కరోనా – 4
ఉండుడింటను అన్నను ఊరికేగి అంటు నంటించు కొనివచ్చి మింటికెగసి స్నేహితుల బిల్చి “పార్టీలు” చేయువారి తీరుతెన్నుల ఫలములు తెలియరావె! 1
పరిసరమ్ముల సంక్షోభ ప్రాభవంబు కర్మఫలమని చేతుల కడిగి వైచి తమది బాధ్యత కాదని తలచువారి తీరుతెన్నుల ఫలములు తెలియరావె! 2
జనుల క్షేమము గోరు సజ్జనులు కూడ నీమముల ప్రక్క నెట్టుచు నిబ్బరముగ నెవరి కేమౌనులే యని యెంచువారి తీరుతెన్నుల ఫలములు తెలియరావె! 3
దగ్గరుండిన ‘షాపు’ ల దరికి బోక వేరె ‘షాపింగు మాళ్ళ’ లో విరగబడుచు చొక్కి సొంపని నడయాడు చుండువారి తీరుతెన్నుల ఫలములు తెలియరావె! 4
లోలోన బెదురుతో రొప్పుచు నెగబడి కోరి గుంపులలోన దూరనేల? పారిశుధ్యమెరిగి పాటింపకుండగ ఒరులకు హితబోధ నొసగ నేల? ప్రాణాంతకంబని పదిమందికిం జెప్పి నీమాలు ప్రక్కకు నెట్టనేల? చేజేతులార జేసిన దాని కీనాడు పరితాపమున బాధ పడగనేల? ప్రభుత నియమాల కెల్లరు బద్ధులగుచు నిత్య జీవనమున తగు నేర్పు నోర్పు జేర్చి సహకార మందింప శ్రేయమమరి శాంతి చేకూరు నెల్ల నిస్సందియముగ II 5
విశ్వ సంక్షోభ మీనాడు విలయమయ్యె విపణివీథుల గతులు స్తంభించి పోయె పాలకుల నిర్ణయంబులు ఫలములొసగి పూర్వ విభవము మరల పెంపొందుగాక! II 6