గ్రీసు దేశపు పురాణ గాథలు

“Knowledge is acquired when we succeed in fitting a new experience into the system of concepts based upon our old experiences. Understanding comes when we liberate ourselves from the old and so make possible a direct, unmediated contact with the new, the mystery, moment by moment, of our existence.”

Aldus Huxley. “Knowledge and Understanding”

ముందు మాట 

నేను ఈ వ్యాసాలు రాయడానికి ప్రేరణ కారణం ఒక విమాన ప్రయాణం. భారత దేశం వెళుతూ, శేన్ ప్రాన్సిస్కో లో ఉదయం 8 గంటలకి బయలుదేరి, నూ అర్క్ చేరునేసరికి సాయంత్రం అయిదు అయింది. పరుగుబాట మీదకి దిగడానికి విమానం సంసిద్ధం అవుతూ ఉండగా, “మనం దిగబోయే పరుగుబాట మీద మరొక విమానం ఉంది. కంట్రోలు టవర్ లో ప్రజలు నిద్రపోతున్నట్లు ఉన్నారు. మరో చుట్టు తిరిగి వస్తాను. అరగంట సేపు ఓపిక పట్టండి,” అని చోదకుడు విమానం జోరు పెంచుతూ పైకి లేచేసరికి ఇహ చేసేది ఏమీ లేకపోవడంతో నా కుర్చీకి ఎదురుగా ఉన్న టి.వి. లో ఏదైనా “ఇరవై నిమిషాల కార్యక్రమం” చూద్దామని వెతకడం ఉపక్రమించేను. “అపస్వరం అనే ఏపిల్ పండు కథ” ట. పదిహేను నిముషాలు ట. చూడడం మొదలు పెట్టేను. 

పురాతన గ్రీసు దేశపు కథ. ఇంతకు పూర్వం నేనెప్పుడూ ఈ కథ గురించి వినలేదు. ఆసక్తితో చూసేను. గమ్యం చేరుకోగానే గూగుల్ లో వెతికేను. చాల ప్రాచుర్యం ఉన్న కథ. మా అమ్మాయిని అడిగితే, “చిన్నప్పుడు హైస్కూల్ లో చదివేను” అని చెప్పింది. నేను పుస్తకాల పురుగుని అయినా ఈ కథ నా కళ్ళ పడడానికి ఎనభై ఏళ్ళు పట్టిందంటే ఈ కథని వినని వాళ్ళు ఇంకా ఎంతమంది ఉంటారో అనిపించింది. ఈ కథ గురించి పరిశోధన చేస్తూ ఉంటే ఆసక్తికరమైన అంశాలు ఎన్నో తెలుసుకున్నాను. వాటన్నిటిని క్రోడీకరించి వ్యాసాలుగా రాసేను. 

ఇక్కడ ఉటంకించిన అంశాలన్నిటినీ కేవలం ఒక నఖచిత్రంలా స్పర్శించినా ఇది పెద్ద గ్రంథం అవుతుంది. అందుకని కొన్ని ముఖ్యమైన అంశాలని మాత్రమే ముచ్చటించేను. 

8. ట్రోయ్ సంగ్రామం నిజమా? కల్పనా?

భారత యుద్ధం గురించి చదువుతున్నప్పుడు వచ్చే రకం సందేహాలే ట్రోయ్ సంగ్రామం గురించి కూడా వస్తాయి. ఈ కథ పురాణమా? ఇతిహాసమా? ఈ యుద్ధం నిజంగా జరిగిందా? జరిగితే ఎప్పుడు జరిగింది? యుద్ధంలో కనిపించే సంఘటనలు, పాత్రలు (మనుష్యులు, దేవతలు) నిజమా? కల్పనా? ఈ యుద్ధం గురించి ఎవ్వరు రాసేరు? ఎప్పుడు రాసేరు? వగైరా, వగైరా!

ట్రోయ్ లో జరిగిన యుద్ధం నిజమా కల్పనా అన్న ప్రశ్నని పక్కకి పెడితే ఈ కథ యొక్క ప్రాముఖ్యత అర్థం అవుతుంది. ఎంతమంది చరిత్రకారులు, కవులు, కళాకారులు, పరిశోధకులు, ఎన్ని తరాలబట్టి ప్రభావితులు అవుతున్నారో చూస్తే ఈ కథ యొక్క గొప్పదనం అర్థం అవుతుంది. యుద్ధంలో ప్రతి చిన్న సంఘటనని హోమర్ వర్ణించి చెబుతూ ఉంటే, “ఇంత విపులమైన వర్ణన నిజం కాక కల్పన ఎలా అవుతుంది” అనిపిస్తుంది. మహాభారత యుద్ధం తిక్కన వర్ణించిన తీరు చూసినప్పుడు కూడా ఇదే రకం భావం కలుగుతుంది.

ఈ యుద్ధం గురించి మనకి ఉన్న ముఖ్యమైన ఆధారాలు గ్రీకు సాహిత్యంలో కనిపిస్తాయి; కానీ ఏ ఒక్క చోట మనకి సాధికారంగా ఆధారాలు కనబడవు. ఈ యుద్ధం నిజంగా జరిగి ఉంటే అది సా. శ పూ. 1194-1184 మధ్య కాలంలో జరిగి ఉండవచ్చని గ్రీకు శాస్త్రవేత్త ఎరతోస్తనీస్ (Eratosthenes, సా. శ పూ. 276-194) వేసిన అంచనా నమ్మదగ్గదే అనడానికి అధారాలు కనిపిస్తున్నాయని పురావస్తు పరిశోధకులు అభిప్రాయపడ్డారు. అనగా, కంచు యుగపు చివరి దశలో అని మనం చెప్పుకోవచ్చు. 

సా. శ. 1870 లో జెర్మని దేశపు వాణిజ్యవేత్త, ఔత్సాహిక పురావస్తు పరిశోధకుడు హైన్రిక్ షులైమన్ (Heinrich Schliemann) పశ్చిమ టర్కీలో (ట్రోయ్ నగరపు సమీపంలో) జరిపిన తవ్వకాలలో ఒక శిధిలమైన కోట దిబ్బ, దాని చుట్టూ 25 మీటర్ల లోతు వరకు శిధిలమైన భవనాల అవశేషాలు కనిపించేయి. వాటి చుట్టూ 46 ఇతర వాటికలు కనిపించేయి. ఇటీవల జరిపిన మరికొన్ని తవ్వకాలలో కనబడ్డ ఒక పురాతన నగరం హైన్రిక్ షులైమన్ కనుక్కున్న నగరం కంటే పదింతలు పెద్దది అని తెలిసింది. ఈ నగరం ఉన్న ప్రాంతాలలో సా. శ. పూ. 3000 నుండి సా. శ. పూ. 1350 వరకు అవిరామంగా జనావాసాలు ఉండేవని తీర్మానించేరు. అంతేకాదు. సా. శ. పూ. 1180 కి సంబంధించిన స్తరాలలో వేడికి మాడిపోయిన అవశేషాలు, మానవ ఆస్థి పంజరాలు కనిపించడంతో అవి ఏదో యుద్ధానికి సంబంధించినవే అయంటాయని నమ్ముతున్నారు. 

ఈ నగరం గురించి, అక్కడ జరిగిన యుద్ధం గురించి, ఆనోటా, ఈనోటా, జానపదులు నోటా 400 సంవత్సరాల తరువాత విన్న కథలని హోమర్ ఇలియాడ్, ఆడెస్సి అనే రెండు ఉద్గ్రంథాలలో పొందుపరచి ఉంటాడు. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం ఇలియాడ్ సంకలనం సా. శ పూ. 750 లోను, ఆడెస్సి సంకలనం సా. శ పూ. 725 లోను పూర్తి అయి ఉంటాయి. ఇలా సంకలించబడ్డ కథల సమాహారం లిఖిత రూపం దాల్చేసరికి మరికొన్ని దశాబ్దాలో, శతాబ్దాలో పట్టి ఉండవచ్చు.

అసలు హోమర్ అనే వ్యక్తి ఉన్నడా అని ప్రశ్నించేవాళ్ళు కూడా ఉన్నారు. కొన్ని గ్రీకు మాండలికాలలో “హోమర్” అంటే గుడ్డివాడు అని అర్థం వస్తుంది కనుక “హోమర్” గుడ్డివాడయి ఉంటాడని కొందరి తీర్మానం. ఎందుకంటే ఆడేస్సి లో ఒక చోట ఒక అంధుడు పాత్ర వచ్చి యుద్ధంలోవిశేషాలని కథల రూపంలో చెబుతాడు. హోమర్ ఈ విధంగా తాను చెబుతున్న కథలో తానే ఒక పాత్రలా వచ్చేడని వీరి అభిప్రాయం. వ్యాసుడు కూడా భారత కథలో అక్కడక్కడ “అతిథి నటుడు” గా వస్తూ ఉండడం గమనార్హం. 

ఈ కథని చారిత్రక పరిశోధన కోణం నుండి విశ్లేషించడం కష్టం. ఈ కథలో తారసపడే చాల పాత్రలు దైవాంశ సంభూతులు (demigods) – అనగా దేవతలు, మానవులు కలవగా పుట్టినవారు. ఉదాహరణకి హెలెన్ ఒలింపియను దేవత అయిన జూస్ ఒక హంస రూపంలో వచ్చి మానవ వనిత లేడాని బలవంతం చెయ్యగా పుట్టిన సంతానం. అదే విధంగా హెలెన్ ని పేరిస్ వశపరచుకోడానికి టైటన్ దేవత ఏఫ్రొడైటి ఇచ్చిన వరం కారణభూతం అవుతుంది. ఈ రకం సంఘటనలు నిజ జీవితాలలో జరగడం అనేది మన అనుభవాలకి అతీతం. అలాగే యుద్ధం పది సంవత్సరాలు జరుగుతుంది. కంచు యుగంలో ట్రోయ్ నగరాన్ని పది రోజులు దిగ్బంధం చేసేరంటే నమ్మవచ్చేమోకాని పదేళ్లు – అది కూడా నావికా దిగ్బంధం – కొంచెం అతిశయోక్తి అనిపిస్తుంది. 

ఈ సమాచారం అంతటిని దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తే ట్రోయ్ అనే నగరం ఉండి ఉండవచ్చు. ఆ నగరం వద్ద పెద్ద యుద్ధం జరిగి ఉండవచ్చు. ఆ యుద్ధం జరగడానికి హెలెన్ అనే అందమైన ఆడదానిని పేరిస్ అనే యువకుడు అపహరించడం కారణం అయి ఉండవచ్చు. ఆ యుద్ధంలో గ్రీకు సైనికులు ఒక కొయ్య గుర్రంలో దాగుని దొంగచాటుగా ట్రోయ్ నగరంలో ప్రవేశించి ఆ నగరాన్ని నాశనం చేసి ఉండవచ్చు. ఇవన్నీ నిజంగా జరిగిన సంఘటనలే కావచ్చు. కానీ ఈ కథలో కనిపించే దేవతలు, వారికీ మానవులకి మధ్యనున్న సంబంధ బాంధవ్యాలు మన అనుభవ పరిధిలో నమ్మడానికి వీలు లేనివి. వీటిని కవి కల్పించిన ఉత్ప్రేక్షలు అనే అనుకోవాలి. 

© 2020 Chaitanyam Magazine. All Rights Reserved.