మా ఊరి నందుల ఆత్మీయ కధ

(గత సంచిక తరువాయి)

రాజకీయ నాయకులు 

ఎన్నికల ప్రచారం హోరాహోరీగా జరిగే రోజుల్లో ఓసారి వాళ్ళ ఊరినుండి మనిషి వచ్చారట. విషయమేమిటంటే, చిదానంద మయ్య వారి గడ్డివామిని అమ్మా రు. కొన్నవాళ్ళు లారీలతో వరిగడ్డిని వారం రోజులు తరలించారు. ఓ పెద్ద కొండంత వుండేదట వామి. వారి గడ్డి తరలించటం అయిన తర్వాత అందులో మిగిలిపోయిన వడ్లగింజలన్నీ రాలాయట. అవన్నీ కుప్ప వేస్తే పది పుట్ల వరకూ వడ్లు అయ్యాయట. వారి గడ్డి కొన్నవాడు ‘వడ్లు మావి’ అని, చిదానందమయ్య మనుషులు ‘గడ్డి అమ్మటం జరిగింది… గింజలు కాదుకదా’ అని గొడవ పెట్టుకున్నారు.

ఆ వివాదాన్ని తీసుకుని చివరిమాట కొరకు ఊరినుండి మనిషి వచ్చాడు. విషయం చెప్పాడు. సావధానంగా విని… “ఒరే … మనం ఒక ఆవును అమ్మివేశాం. అది అమ్మేటప్పుడు అది ‘సూటి’ పశువు, దాని కడుపులో దూడ వుంది అని తెలియదు. అమ్మిన తరువాత తెలిస్తే… దూడ మనది అంటామా?” అని తీర్పు చెప్పాడు. విన్నవాళ్ళు ఆశ్చర్యపోయారు. గడ్డి ఖరీదు కంటే వడ్ల ఖరీదే ఎక్కువగా వుంది. అది… ఆనాటి రాజకీయనాయకుల లక్షణం. 

ఉపసంహరణ 

ఆధునికత అప్పుడప్పుడే ప్రారంభమవ్వడం, హరిత విప్లవ పోకడలతో ఎకరాకు నలభై నుండి యాభై బస్తాలైనా పండించాలని ‘ఎవరికీ యమునా తీరే’ అవటం, నిండు సంసారాలు నిట్టనిలువునా చీలిపోవటం జరిగింది. భూమి తల్లిని ప్రేమించే రైతు భూసారాన్ని లాగి ఒకేసారి పచ్చనోట్లకు పడగలెత్తాలని చూశాడు. ఎద్దులు, దున్నలు సేద్యానికి పనికిరావని యంత్రాలను మారిగాడు. మైళ్లకొద్దీ కాలినడకన, ఎద్దుల బండిపై ప్రయాణించే రైతులు మోటారు సైకిళ్ళు మరిగారు. సాయంత్రం రచ్చబండ మీద కబుర్లాడుకుంటూ పంటపొలాల దిగుబడి గురించి చీడ పురుగుల నివారణ గురించి మాట్లాడుకునే రైతు, సాయంకాలం అయ్యేటప్పటికి పక్కనున్న పట్నం వెళ్లి ఓ సినిమా చూసి, పెగ్గు బిగించి ఉదయానికల్లా ఎరువులతో, పురుగుమందులతో ఇంటికి చేరటంప్రారంభమయింది. 

చూస్తూ చూస్తూ ఉండగానే కాలం ‘పదేళ్లలో వందేళ్లు’ ముందుకు పోయింది. మనుషుల్లో మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎవరి పరిధిలో వాళ్ళు గిరి గీసుకుని బ్రతకటం మొదలుపెట్టారు. ఉమ్మడి కుటుంబాలన్నీ విచ్ఛిన్నమయ్యాయి. పెద్దరికం మంట కలిసింది. ఎవరికీ వారే పెద్ద. 

చిన్న, సన్నకారు రైతుల్లో చాలామంది వడ్డీలకు డబ్బు తెచ్చుకునేవారు. పెళ్లిళ్లకు, అత్యవసరాలకు రాయిపెద్ది వెంకటరామయ్య గారి వద్ద వడ్డీకి తెచ్చుకునేవారు. సంవత్సరం మధ్యలో తిండిగింజలు అవసరమైతే కొండువారపల్లెలో దిండుకుర్తి పీరయ్య దగ్గర ‘నాగు’కు గింజలు తెచ్చుకుంటారు. ‘నాగు’ అంటే బస్తా గింజలు ఇస్తే బస్తాన్నర గింజలు పంట పండిన తర్వాత ఇవ్వాలి. ఇచ్చేటప్పుడు ఎక్కువగా ‘వడ్లు’ ఇచ్చి తీసుకునేటప్పుడు ‘రాగులు’ తీసుకునేవాడు దిండుకుర్తి పీరయ్య. 

సంవత్సరం పొడవునా అప్పులు ఇవ్వటం, పంటమాసూలు జరిగేటప్పుడు ఊరూరూ తిరిగి కళ్లంలో గింజలు తనే కొలుచుకుని బస్తాలకెత్తితే … ఊరివాళ్ళే ఆ బస్తాలను కొండువారిపల్లె చేర్చాలి. ఈ గింజలన్నీ ఒక పెద్ద గదిలో నింపుతారు. ఆ గడిగోడలకు ఎక్కడా కిటికీలు, వాకిళ్లు ఉండవు. అడుగున ఒక చెయ్యి పట్టేటట్లు రంధ్రం ఉంటుంది. ఆ రంధ్రంలో నుండి కొంచెం గింజలు బయటకి లాగి కొలుస్తుంటాడు. 

చాలామంది రైతులు చాలా సంవత్సరాలు కల్లంలో గింజలన్నీ ‘నాగు తెచ్చుకున్నదానికి యివ్వగా వట్టి చేతులతో తిరిగివచ్చిన రోజులున్నాయి. అందులో మా పెద్దనాయన ప్రథముడు. 

కులవృత్తులవాళ్ళు చాలామంది ఊరు విడిచిపెట్టడం, బయటి పనులు నేర్చుకోవటం జరిగింది. నాయీ బ్రాహ్మణులు చాలామంది కళాకారులుగా తయారై ‘ఆల్ ఇండియా రేడియో’ లో సంగీతం వినిపించే స్థాయికి చేరుకున్నారు. మరి కొంతమంది దగ్గరలో వున్న పోరుమామిళ్ల, కలసపాడు, గుడిపాడు లాంటి చిన్న చిన్న పట్టణాలకు వలస వెళ్లి అక్కడ ‘హెయిర్ కటింగ్ సెలూన్’ లు పెట్టుకున్నారు. ముసలి, ముతక మాత్రం ఇక్కడే మిగిలిపోయారు. 

సాయిబుల కుటుంబాలలో చాలామంది ‘ఓనిపెంట’ చేరుకొని పాత్రలకు ‘మాట్లు’ వేసే వ్యాపారంతో దేశమంతా తిరగటం, డబ్బు సంపాదించటం మొదలుపెట్టారు. ‘మాట్లు’ వేయడమంటే ఇత్తడి సామాన్లు బొక్కలు పడి కారుతూ ఉంటే వాటిని కారకుండా అతుకువేసే పని. ఒక్కోసారి … ఒక్కో ఊరిలో వందలకొద్దీ ఇత్తడి గిన్నెలు, చెంబులు, బిందెలు, గంగాళాలు, వంటపాత్రలు సేకరించి రాత్రికి రాత్రే ఊరు వదిలి వెళ్లిపోవడం… మా పెద్దన్న గంపలగూడెంలో నాగార్జునసాగర్ పనుల్లో ఇంజనీరుగా చేస్తుండేవాడు. అక్కడికి మేము వేసవి సెలవులకు వెళ్ళినపుడు ఓ వ్యాపారస్తుడు అన్నమాటలివి. ‘ఓనిపెంట’ సాయిబులను నమ్మకూడదు అని. కానీ అందరు అలా లేరు. 

మరికొంతమంది సాయిబులు ‘కువాయెట్’ పోయి పిచ్చిపిచ్చిగా డబ్బులు సంపాదించి ఊరిలో మసీదు నిర్మించారు. అలాంటివారిలో ‘బసమ్మ గారి హసాన్’ ముఖ్యుడు. అప్పటినుండి మావాళ్లకు ‘హమారా ముసల్మాన్’ అనే మాట తెలియవచ్చింది. ఊరిలో సెంటు వాసనలు ఘుమఘుమలు మొదలయ్యాయి. మనుషుల్లో మాలిన్యాలూ పెరుగుతున్నాయి. 

ఊరికి… ఊరికి మధ్య కూడా అంతరాలు పెరిగిపోయాయి. భాకరాపేటలో కొత్తగొల్ల నాగన్న వాళ్ళ బర్రెలు, బొగ్గులవారిపల్లె వారి చేలో పడి మేశాయని ఆ చేను యజమాని బర్రెల తోకలు తెగగొట్టాడు. జరిగింది అన్యాయమని తెలిసినా ఊరి జనం నోరెత్తలేదు. సుబ్బరాయుడు మాత్రం ఆ బర్రెలను ఆ ఊరికి తోలుకుపోయి జరిగిన అన్యాయం బట్టబయలు చేసి ఆ దురాగతం చేసినవాడికి నాలుగు తగిలించాడట. 

ఆ సాయంత్రం ఆ ఊరిలో వారందరు మీటింగు పెట్టుకుని ‘ఊరిమీదకు వచ్చి దాడి చేస్తే ఊరుకుంటామా? మనకేం తక్కువ? ఇంత రాజకీయ బలం, కుల బలం, ఆర్థికబలం ఉంటే ఒక్క అనామకుడు ఊరిమీద దాడిచేస్తాడా?’ అని మరుసటి రోజు ఉదయమే…. ఓ పాతిక, ముప్ఫయ్ మంది కట్టెలు తీసుకుని సుబ్బరాయుడి ఇంటి మీదకు వచ్చారట. 

సుబ్బరాయుడు ఊర్లో లేకపోవటం, వాళ్ళ అన్న ‘కంట్లో కలికం’ పెట్టుకుని ఇంటి బయట కూర్చుని ఉండటం, వచ్చినవాళ్లు కోపం పట్టలేక ఈయన్ను చితకబాది నెత్తురోడేటట్టు కొట్టటం…. ఇరు గ్రామాల మధ్య రాకపోకలు ఆగిపోయాయి. ఇబ్బంది పడటం…. మనుషుల్లో ఆవేశాలకు, ఆక్రోశాలకు మారే ప్రగతే కారణమయింది. 

డబ్బు అవసరాలు పెరగడం, మనిషిలో ‘అనుభవించాలి’ అన్న కోరిక మెండుగా ఉండటం, ఏదో ఒకటి చేయాలన్న తపనతో…. భాకరాపేటలో ‘మంత్రగాళ్ళు’ తయారయ్యారు. స్వామీజీల రూపం ఎత్తారు. ఇందులో కూడా సుబ్బారాయుడు పాత్ర అధికం. ‘మాబు’ సుబ్బరాయుడికి గురువు. అంటే ‘మాబు’ మిషను కేట్టేవాడు. కుట్టుమిషను నేర్చుకోవడానికి సుబ్బరాయుడు మాబు దగ్గర శిష్యరికం చేశాడు. 

ఎన్నిరోజులు ఆడవాళ్ళ జాకెట్లు, చినిగిన పాత గుడ్డలు కుడితే డబ్బులు వస్తాయని ‘స్వామీజీ’ల అవతారమెత్తారు. 

గడ్డాలు, మీసాలు పెంచి, కాషాయ వస్త్రాలు ధరించి, మంత్రదండం చేత్తో పట్టుకుని దేశం మీదకు బయలుదేరారు. వేసిన నాటకాలు, పీర్ల పండుగ వేషాలు బాగా పనికి వచ్చాయి. మొత్తానికి ఎవరిని బుట్టలో వేశారో తెలియదు. చేతినిండా డబ్బు… ఊర్లో అందరి మన్ననలు పొందటానికి ‘జాతర ఘనంగా జరిపించారు. 

‘దర్గా’ను సుందరంగా అలంకరించి, కొత్త జండాలు తెచ్చి జండాలు పండుగ, ఉర్సు నిర్వహించారు. ఊర్లో సందడి…. నిత్య

కల్యాణం…. 

అసలు జరిగిందేమిటంటే… ఓ మంచి వ్యాపారస్తుని ఇంట్లో మకాం వేశారు. ఇంట్లో ‘ధనలక్ష్మి’ తిరుగుతోదని వాళ్ళను నమ్మించారు. ఆ కుటుంబం… బ్రతికి చెడినది. పెద్దలు ఎక్కడో ఒకచోట ‘బంగారు బిందెలు’ (లంకె బిందెలు) దాచివుంటారని వాళ్ళ అనుమానం. ఈ అనుమానాన్ని ఆసరాగా చేసుకుని వారిని నమ్మించారు. పక్షం రోజులు రాత్రింబవళ్ళు పూజలు చేశారు. ఆ రూములోకి ఎవరిని రానివ్వలేదు. ఆహారం మానేశారు. కేవలం పండ్లు, పాలు మాత్రమే ఆహారం. 

పదిహేను రోజుల తర్వాత … అమావాస్య… అర్ధరాత్రి… లాంటి ముహూర్తాలు నిర్ణయించి, ‘బలి’ ఇచ్చి, ఇంటివాళ్ళందరినీ పిలిచి, గదిలో ఒకచోట త్రవ్వించారు. మంత్రాలు, తంత్రాలు … చేస్తూనేవున్నారు. అందరిలో ఉత్కంఠ… ఇంటివాళ్లకు తప్ప ఎవ్వరికీ తెలియకూడదు. మూడడుగులు తవ్వేటప్పటికీ గడ్డపారకు ‘ఖంగు’న తగిలింది. అందరికి ఆశ్చర్యం… స్వాములకు తప్ప. 

స్వాములు ముట్టుకుని చూశారు. కరెంటు షాక్ కొట్టినట్టు వెనక్కి పడ్డారు. ఇంట్లో ఒక్కొక్కరిని ముట్టుకోమన్నారు. అందరికీ… షాక్… ఇంటి ఇల్లాలికి తప్ప. ఆమె చేతనే బయటకు తీయించారు ఆ బిందెను. ఆ బిందెకు సీలు వేయబడివుంది. ‘ఇప్పుడే తెరవకూడదు… ఇక్కడ నాలుగు బిందెలున్నాయి…’ అంటూ .. రోజూ ఆ బిందెకు పూజలు చేయించారు. ఇలా నాలుగు బిందెలు… లేపేటప్పటికీ సంవత్సరం పట్టింది. అప్పటికే ఆ యింటి ఇల్లాలు సొమ్ములు, డబ్బులు అయిపోయాయి. 

మా అనుమతి లేకుండా … బిందెల మూట తీస్తే బంగారమంతా రాళ్లు, రప్పలుగా మారుతుందన్నారు. ఓపిక నశించిన ఇంటి యజమాని బిందెల మూటలు తీస్తే…. నిజంగా రాళ్లు, రప్పలు వున్నాయి. ఆ తరువాత ఏం జరిగిందో నే చెప్పనక్కరలేదు. 

ప్రగతి పథంలో పయనించాలనుకున్న యువత చదువులపై దృష్టి సారించారు. పలుగురాళ్ళపల్లె ఉన్నత పాఠశాలలో యస్.యస్.ఎల్,సి. పూర్తి చేసిన పిల్లలు చాలామంది తిరుపతిలో బి.విద్వాన్ లో చేరిపోయారు. మా అన్నదమ్ములం మదనపల్లె బిసెంటు థియోసాఫికల్ కాలేజీలో చేరిపోయాం. మా చదువులు పూర్తి చేసుకుని ఉద్యోగాన్వేషణలో ఉంటూ… అప్పుడప్పుడు ఊరికి వచ్చేవాళ్ళం. 

(ఇంకా వుంది)

© 2020 Chaitanyam Magazine. All Rights Reserved.