ప్రపంచ దివసం

ఎండిన మొక్కలతో, వ్యాపించిన ముళ్ల పొదలతో, చెట్ల నీడలు లేక, పురపాలక సంఘపు నిర్లక్ష్యానికి నిదర్శనంగా ఉన్న ఆ పట్టణ ఉద్యానవనంలో, బీటలువారిన సిమెంటు బెంచీలమీద కూర్చున్న ఆ ముగ్గురు స్నేహితులతో ప్రతిదిన సాయంకాలపు సమావేశం జరుగుతోంది. 

“ఈ ప్రపంచ దివసాలు లేదా దినాలు దరిదాపుల్లో 180 కి పైగానే ఉన్నాయట. చాలా సామాజిక అంశాలను దృష్టిలో ఉంచుకొని ఈ దినాలు నిర్థారింపబడతాయట” అన్నాడు నాగేశం. 

సమాచార, గణాంక సేకరణలు నాగేశానికి కాలక్షేపం. ఆ ముగ్గురూ పదవీ విరమణ చేసి ఇరవై సంవత్సరాలు దాటి ఎనభైలలో పడినా ఈనాటి సమాజ ధోరణులగురించి ముచ్చట్లాడుకొంటారు. 

“కావొచ్చు. కానీ అవన్నీ సామాజిక దృష్టితో సృష్టించబడినా వాటిలో కొంత శాతం అంతర్లీనంగా దేశీయమైన సంస్కృతీ సంప్రదాయాల్ని వెక్కిరించే ధోరణి ఉంటుంది. అవి సెలవుల్లేని పండగదినాలుగా, ఆదర్శాలు వల్లించే సభా, సమావేశ దినాలుగా ఉంటున్నాయి.” అన్నాడు సీతాపతి. 

“ప్రపంచ బాలల, యువత, ప్రేమికుల భర్తల, తల్లుల మహిళల, వయోధికుల, గుండెసంబధిత, నవ్వుల, మధుమేహ, క్షయ, ఎయిడ్స్, కాన్సర్, పొగాకు, ధూమపాన నిషిద్ధ, వైద్యుల, వనాల, వన్యమృగాల, పర్యావరణ యిటీవలే ప్రవేశబెట్టబడిన యోగా……..ఇలా ఒకటేమిటి, అనేక అంశాల పేరిట ఈ అంతర్జాతీయ దినోత్సవాల రూపకల్పన జరిగి, జాతిమత ప్రమేయం లేకుండా విశ్వజనీనమైన సభలూ, సమావేశాలు జరుపుతున్నారు. వీటికీ కొన్ని దేశీయమైన బంధాలు పెట్టడం జరుగుతోంది. బాలల ప్రపంచదివసం నవంబరు 20 అయితే, మన దేశవ్యాప్తంగా దాన్ని చాచా నెహ్రూ జన్మదినం నవంబరు 14 తో ముడివేసేశారు ….” అన్నాడు నాగేశం. 

“అయితే ఇదే నవంబరు 14 అంతర్జాతీయ మధుమేహ దినంగా జరుపుతున్నారు. కాకతాళీయం కావొచ్చు కానీ ఈ రెండింటి మధ్యా అసంకల్పితమైన అనుబంధముంది. మధుమేహాన్ని ఏ వైద్యంతోనూ వదిలించుకోవడం సాధ్యం కాదు. ఏవో కొన్ని గుణాలు వెంటాడుతోనే ఉంటాయి!” అన్నాడు శాస్త్రి. అతగాడికి రాజకీయ విశ్లేషణలు చెయ్యడం, రంగులు పులమడం అలవాటు. 

“రాజకీయం చెయ్యకు. ఇవన్ని ఏం సాధిస్తున్నాయని చెప్పడం కష్టమైనా, మౌలికమైన కొన్ని సామాజికాంశాల గురించి ప్రజల్ని ఆలోచింపజేసి చైతన్యవంతుల్ని చేస్తున్నాయని అనుకోవచ్చు కదా?”అన్నాడు నాగేశం.

“నాకు నా పుట్టినరోజూ, పెళ్లయినరోజు తప్ప మరేమీ ముఖ్యం కావు. అంచేత నన్ను నేను ఓ ప్రపంచ పౌరుడిగా పరిగణించే ఈ రెండు వ్యక్తిగతమైన దివసాలూ ప్రపంచ దివసాలే! అన్నాడు శాస్త్రి. శాస్త్రి ఎదుటివారి మాటల్ని సులువుగా ఒప్పుకోడు. వ్యతిరేకించడం అతనికి మహసరదా. అందుకనే అతనితో వాదించడం ఒక విధంగా కష్టమే! అయినా స్నేహితులు ఏమీ అనుకోకుండా వినోదం పంచుకుంటారే కానీ విరోధం పెంచుకోరు. అప్పుడప్పుడు వాళ్లూ మర తిప్పి వదుల్తారు. 

“ఏడువందల కోట్ల ప్రపంచ జనాభాలో నువ్వు అల్పబుద్ధివి కాదుకానీ, మాలాగే సాధారణమైన ఓ స్వల్ప బుద్ధి మానవుడివి. ఏ ప్రాతిపదిక మీద, లేదా ఏ ప్రమాణం మీద నీకు సంబంధించిన ఈ రెండు రోజుల్నీ అంతర్జాతీయoగా పరిగణించాలి?” సీతాపతి అడ్డు పడ్డాడు. 

“జాతి మతాల అంశాలు లేకపోయినా వ్యాపార వాణిజ్య అంశాలు అంతర్లీనంగా కొన్నిటితో పెనవేసుకు పోయాయి. లౌకికవాదంతో పండుగలను, ఖర్చులను గేలి చేసే విజ్ఞులు ఈ ప్రపంచ దివసాల ఆర్భాటాల్ని నిరసించరు. అసలు మన పండుగలకు ఏదో మూలకారణం ఉండేది. అయితే నేపథ్య చరిత్రల ఆధారాలు తెలుసుకోకుండా, తెల్లతోలుగాళ్ళు ఏదంటే దాన్ని మనం గుడ్డిగా ఆచరణలో పెట్టేస్తున్నాం. ఉదాహరణకి ప్రేమికుల దినాన్నే తీసుకోండి. ప్రేమికుల దినాన్ని నిరసించిన మనలాంటి వారిని దుర్భాషలాడి నగర యువత పలు రాష్ట్రాలలో కాని పనులు చేసి అభాసు పాలైయ్యింది. కుటుంబ బంధాల్నిఆర్థికకోణాలతో ముడిపెట్టి దగ్గర సంబంధాలకి నీరు పోసి పెంచింది మన తెలుగు సమాజం. నా మేనమామ కూతుర్ని ఇచ్చి ముడి వేయించేశారు. ఏభై ఏళ్ల వైవాహిక జీవితం సహజసిద్ధమైన ప్రణయకలహాలతో, రాజీలతో, హాయిగానే గడిచిపోయింది. రెండు వీధుల అవతల నున్న ఓ తెలిసున్నవారి కుటుంబంలో ఓ అమ్మాయి చీరకట్టుడు పేరంటానికి వెళ్ళి అమెరికానుంచి వచ్చిన ఓ స్నేహితురాలితో రాసుకు, పూసుకు తిరగడంతో నా శ్రీమతిని కరోనా కాటువేసి తీసుకుపోయిన సంగతి మీకు తెలిసిందే కదా? పుణ్యస్త్రీగా వెళ్లిపోయిందని బంధువులందరూ, మీరూ ఓదార్చారు. అందుకే జ్ఞాపకాల పందిరిలో, ఆమె మెడలో నేను ముడివేసిన రోజు నాకు చాలా చాలా ముఖ్యం,” అన్నాడు శాస్త్రి. 

“సరే ఇది చాలా సున్నితమైన విషయం. నీ అభిప్రాయాన్ని గౌరవిస్తున్నాం. ……?” నాగేశం, సీతాపతి ఒకేసారి అన్నారు. 

“వస్తున్నా. రాబర్ట్ క్లైవ్ 1757 ప్లాస్సీ యుద్ధంలో కేవలం బెంగాల్ ని మాత్రమే స్వాధీనపరుచుకొన్నాడు. అటుపైన మన దేశం చేసిన అనేకానేకమైన ఎదురు పోరాటాలవల్ల ఆంగ్లేయుల పాలనలోకి రావడానికి 100 సంవత్సరాల దీర్ఘకాలం పట్టింది. అదైనా నీతిబాహ్యమైన వారి కుతంత్రాలవల్ల సాధించినదే కాని పోరాట పటిమతో కాదు. అటుతర్వాత 1947 దాకా ఆంగ్లేయులు దేశాన్ని పాలించారు. ఈ 190 సంవత్సరాల వ్యవధికీ మరో పది సంవత్సరాలు ఉదారంగా కలుపుకొని మన చరిత్రకారులు రెండువందల సంవత్సరాల ఆంగ్ల పాలన నుంచి విముక్తి సాధించామని చెప్పేయడం జరిగింది. ఆంగ్లేయుల పాలన నుంచి విముక్తి పొందిన ఆగస్టు పదిహేనుని ఈ రోజువరకూ స్వాతంత్ర్య దినోత్సవంగా పరిగణిస్తూ మనం పరోక్షంగా పరాధీనతను లేదా బానిసత్వాన్ని గుర్తుచేసుకొంటున్నాం. అయితే దేశం ముక్కలైన సంగతి విస్మరిస్తున్నాం. అదేవిధంగా తొమ్మిదినెలల గర్భవాసపు చీకటి చెరసాలనుండి బయటపడి వెలుగు చూసిన రోజు నాకు ఇంకా ముఖ్యం. అయితే భూమ్మీదపడి దేశాన్నికానీ, ప్రపంచాన్నికానీ ఏమి ఉద్ధరించావని అడగకండి.” 

“జన్మసార్థకత లేదా సార్థకజన్మ అని ఒకటి ఏడ్చిందిగా?” నాగేశం అడిగాడు.

“35 సంవత్సరాలు పనిచేసి, అయిదు వందలమంది పనిచేసే ఓ కార్ఖానాలో అంచెలంచెలుగా ఎదిగి భుజాలమీది తలని పైకెత్తి సగౌరవంగా పదవీ విరమణ చేశాను. అంతకంటే ఏం కావాలి?”

“నీ పేరు నువ్వు పనిచేసిన కంపెనీలోకూడా తాత్కాలికం. ఏడాది గడిచే లోగా నిన్ను మరిచిపోయే ఉంటారు. యింతకీ, ఆర్థికంగా ఏం సాధించావని?” సీతాపతి అన్నాడు. 

“ఏమీ లేదు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో నేను కూడబెట్టగలిగింది ఏమీ లేదు. పదవీ విరమణ తర్వాత నా సేవింగ్స్ ఖాతాలో ఆఖరి నెల జీతం తప్ప కానీ లేదు. అయితే వచ్చిన ప్రావిడెంట్ ఫండ్, గ్రాట్యుయిటీ ఫిక్సెడ్ డిపాజిట్లలో పడేసి దానిమీద వచ్చే వడ్డీనే కుబేరసంపదగా భావిస్తూ ఈదులాడుతున్నాను.”

“అది సరే! నీకు పుట్టినరోజూ, పెళ్లిరోజూ ముఖ్యమంటున్నావ్ కదా? ఈ రెండురోజులూ ఏం చేసేవాడివి?”

“మా అమ్మా నాన్నలకి నేను పదో సంతానం. పుట్టినరోజు వైభోగాలన్నీ జరిగేవి మొదటి ఒకరిద్దరి పిల్లలకే. తర్వాత ఏ నాయనమ్మలో, తాతమ్మలో గుర్తుచేస్తే తప్ప, తరువాతి వాళ్ళ పుట్టిన రోజులు తల్లిదండ్రులే మరిచిపోతారు. అయితే విజ్ఞత గల తండ్రులు మట్టుకు పుట్టిన సంతానం తాలూకు జనన వివరాలు ఓ పుస్తకంలో రాసి పెట్టుకొంటారు. పిల్లలకి పెళ్లిసంబంధాలు వెతుకుతున్న సమయంలో జాతకచక్రాలతో నుదుటి రాతలను అంచనా వెయ్యడానికి మన సమాజాలలో జననసమయ వివరాలు చాలా అవసరం కదా?”

“సరే మరి వివాహమనేది ఒక విధంగా వ్యక్తిగతమే కదా? ఆ రోజు ఎలా గడిపేవారు?”నాగేశాం అడిగాడు. 

“వివాహబంధమనే సంకెళ్లతో మరో చెరసాల ప్రవేశం కదా? ఆ రోజు ఎవరైనా పండగ చేసుకొంటారా? అయినా సినిమాల్లోలాగా ఉమ్మడి కుటుంబాలలలో ఈ పెళ్లిరోజు వేడుకలు ఎవరు ఆడుతూ పాడుతూ చేసుకొంటారని? అయితే పెళ్ళయిన మొదటి సంవత్సరాలలో ఏటా పెళ్లిరోజుకి శ్రీమతికి మట్టుకు ఒక కొత్తచీర కొనేవాణ్ణి. అప్పుడు నా అక్కచెల్లెళ్లకి కూడా కొనాల్సివచ్చేది. లేకపోతే వాళ్ళూ, వాళ్ళతో కలిసి అమ్మా అలిగేవారు! తర్వాత్తర్వాత ఎదిగిన పిల్లల కోసమే కొనమనేది నా శ్రీమతి.”

“యిది దాదాపు ప్రతి మధ్యతరగతి కుటుంబాలలో జరిగేదే! పెళ్లిరోజు సందర్భంగా విహారయాత్రలకి వెళ్ళే ధనవంతులమాదిరి ఆర్థికవనరులు లేక, ఉన్న ఊళ్లోనే వెంకన్నగుడికో, సినిమాకో పోవడం తప్ప గత్యంతరం లేదు కదా? అయినా వివాహబంధమనే చెరసాలలో చిక్కుకుపోవడం నువ్వు చెప్పిన ప్రకారమూ ఆయా వ్యక్తులకు ముఖ్యమైన దినమే!” అన్నాడు సీతాపతి రాజీ పడిపోతూ. 

అంతలో ఓ పిల్లలగుంపు అటువైపు ఆడుకొంటూ వచ్చింది. “పిల్లలూ,జాగ్రత్త! ఇక్కడ ముళ్లూ అవీ చాలా ఎక్కువ,” అన్నాడు శాస్త్రి కలగజేసుకొంటూ. 

“తాతగార్లూ! ఈ రోజు ముసలివాళ్ళ దినంట కదా? మీకోసం మెత్తటి చాక్లెట్లు తీసుకువచ్చాం. యివిగో తీసుకువచ్చాం. తీసుకోండి,” అంటూ ఒక బాలుడు ముగ్గురి చేతుల్లోనూ రెండేసి చాక్లెట్లు పెట్టి కాళ్ళకు దణ్ణం పెట్టాడు. 

”ఏమిటి విశేషం?” నాగేశం అడిగాడు. 

“ఇవ్వాళ నా పుట్టిన రోజు సార్! మా నాన్న ఇరవై రూపాయిలిచ్చాడు. ఇరవై చాక్లెట్లు వచ్చాయి. మా ఏడుగురం రెండేసి తినేశాం. మిగిలిన ఆరూ మీకు!” అన్నాడా బాలుడు. 

ఆ ముగ్గురూ ఏడుగురు పిల్లల్నీ దగ్గరగా తీసుకొని దీవించి, పార్క్ బయటనున్న అయిస్క్రీమ్ పార్లర్లో అయిస్క్రీమ్ తినిపించారు. 

“మన పిల్లలు మరిచిన మనకి, మనమే మరిచిన మనకి ఈ పిల్లలు ఈ దినం చాలా విలువైన సత్కారం చేశారు! ఎంత కాదనుకొన్నా పుట్టిన రోజంటే……” సీతాపతి అగాడు. 

శాస్త్రి మొహాన విజయ హాసం వెలిసింది. 

(‘నిఖిలలోకమెట్లు నిర్ణయించినగాని తిరుగులేదు విశ్వనరుడ నేను’ …కీ.శే. గుర్రం జాషువా) 

ldman%20icecreamchidren.jpg

© 2020 Chaitanyam Magazine. All Rights Reserved.