తెలుగు పద్య రత్నాలు -17

-భద్రాచలంలో రాముడి గుడి కట్టించిన కంచెర్ల గోపన్న ఎటువంటివాడో మనకి తెల్సినదే. భగవంతుణ్ణి తెల్సుకోవడానికి భక్తి ముఖ్యం తప్ప ఆయనని ఏమని పిలుస్తున్నాం, ఏ రూపంలో అర్చిస్తున్నాం అనేవి ఎన్నటికీ ముఖ్యం కాదు. దాశరధీ శతకం రాసిన గోపన్న – తనని ప్రభుత్వం వారి డబ్బులు వాడుకున్నందుకు కారాగారంలో పెట్టి కొరడాదెబ్బలు కొట్టినా – రాముడి మీద భక్తి నిలుపుకున్నవాడు. ఈ నెల పద్యం దాశరధీ శతకం లో గోపన్న రాసినదే.

ఉ. కోతికి శక్యమా యసురకోటుల గెల్వను గెల్చెబో నిజం బాతనిమేన శీతకరుడౌట దవానలుడెట్టివింత? మా సీత పతివ్రతా మహిమ సేవకు భాగ్యము మీ కటాక్షమున్ ధాతకు శక్యమా పొగడ దాశరధీ కరుణాపయోనిధీ (దాశరధీ శతకం. 62)

రాక్షస కులంలో అడపా దడపా వీరులు పుట్టడం, బ్రహ్మ గారి వరాలతో గర్వం తెచ్చుకుని విష్ణువుతో దెబ్బలాటకి దిగడం, ఆయన వీళ్ల అంతు చూసాక తమ కులం దాదాపు సర్వనాశనం అవుతుంటే ఇంక ఇప్పటికి చాలు అనుకుంటూ పాతాళానికి పోవడం అలా కొన్నాళ్ళు అయ్యేక కైకసి కి పుట్టిన రావణుడు తమ కులం పెంపొందించడానికి, చెట్టుకొకరూ పుట్టకొకరూ పోయిన రాక్షసులని చేరదీసి లంకలో సామ్రాజ్యం స్థాపిస్తాడు. వాడి అండ చూసుకుని ఖర ధూషణులూ, మారీచ సుబాహులూ, వాళ్ళ తల్లి తాటాకీ అడవులలో ముని జనాలనీ వాళ్ళ పత్నులనీ ఏడిపించడం అవీ చూసాక రామావతారం మొదలౌతుంది.

అమ్మవారిని ఈ రావణుడు ఎత్తుకుపోయాడు. వాణ్ణి వెదకడానికి వెళ్ళిన కోతులకి ఎటువెళ్ళాలో తెలియలేదు. కానీ చివరికి అన్నీ సాధించబడ్డాయ్? ఎలా? భగవదనుగ్రహం వల్ల. లేకపోతే అసలు మామూలు కోతులేమిటి, రాక్షసులని గెలవడం ఏమిటి? (కోతికి శక్యమా యసురకోటుల గెల్వను) పోనీ గెల్చారయ్యా అదెలాగో ఓ వింత లాగా జరిగింది అనుకో, కానీ హనుమంతుడు లంక అంతా నిప్పు పెట్టి కాల్చేసినా తన తోకకి అంటుకున్న నిప్పు ఆయన వంటికి మాత్రం చల్లగానే ఉండడం వింత కదా? (ఆతనిమేన శీతకరుడౌట దవానలుడెట్టివింత?). ఇవి జరగాలంటే అసలు సీత పతివ్రతా మహత్యం, నీ కటాక్షం తప్ప మరోవిధంగా అసలు జరగడానికి వీలు లేదు కదా? (మా సీత పతివ్రతా మహిమ సేవకు భాగ్యము మీ కటాక్షమున్).

అటువంటి నిన్ను పొగడడానికి బ్రహ్మదేవుడికి కూడా సాధ్యమౌతుందా? (ధాతకు శక్యమా పొగడ). చివరి పాదంలో రాముణ్ణి ఏమన్నాడో చూసారా? దాశరధీ కరుణాపయోనిధీ, అంటే సముద్రం అంత కరుణ ఉన్నవాడు భగవంతుడు. అందువల్లే ఈ వింతలన్నీ జరిగాయి అన్నమాట. ఆ కరుణే నామీద కూడా చూపించు రామా అని వేడుకుంటున్నాడు. ఈ పద్యంలో ఉన్న సీత పతివ్రతామహిమ గురించి ఓ సారి ఆలోచిద్దాం. ఈ మధ్య జరిగిన అమ్మాయిలని ఎత్తుకుపోవడం, మానభంగాలూ అవి చూసాక ఓ సారి వెనక్కి ఆలోచించి చూద్దాం.

ఒకావిడని లేకపోతే ఒకాయనని అయినా సరే (సీత, రాముడిలాగే) ఎవరో ఎత్తుకుపోయారనుకుందాం. మామూలు విషయలాలలో ఎవరైనా మన ఇంటికొచ్చి ‘మీ ఆయనని ఫలానా చోట ఆసుపత్రిలో జేర్పించారు. నేను ఇప్పుడే చూసి వస్తున్నా, ఇదిగో ఆసుపత్రివారిచ్చిన ఆధారం, నా కూడా రండి’ అంటే, వెనకా ముందూ చూసుకోకుండా వెళ్ళిపోతున్నాం.

ఆ తర్వాత ఆవిడ/ఆయన్ని వేరే చోట కట్టేసి, తిండీనీరూ లేకుండా బెదిరించి, ‘ఇదిగో మీ ఆయన/ఆవిడ మామూలు చెత్తమనిషి, నేను తల్చుకుంటే పది నిముషాల్లో వాడి/ఆవిడ ప్రాణం తీయగలను. నన్ను పెళ్ళి చేసుకోవడం తప్ప నీకు మరోగతిలేదు’ అంటూ ప్రతీ రోజూ ఏడిపిస్తున్నారనుకోండి, భోజనం కూడా పెట్టకుండా. మనలో ఎంతమంది ‘నీ చేతనైంది చేసుకో, నిన్ను పెళ్ళి చేసుకోవడం అసంభవం’ అనగలం? అదీ నాలుగు రోజులు తిండి లేకుండా మాడిస్తే మనం ఏమౌతామో తెల్సినదే కదా? ఆ మాట అలా ఉంచి. రావణుడి డబ్బూ, భవనాలూ వగైరాలన్నీ చూసి రాముడంటే రోత పుట్టకుండా రాముణ్ణే నిరంతరం తల్చుకోవడం అవీ చూస్తే అసలు మనలో ఏ ఒక్కరైనా సీతకున్న గుణగణాలలో లక్షో వంతుకి సరిపోతామా అని చూసుకుంటే మనకి తెలిసి వస్తుంది ఈ పద్యంలో గోపన్న చెప్పిన విషయం.

చివరి పాదంలో ధాతకు శక్యమా అన్న విషయం ఓ సారి చూద్దాం. భగవంతుడి గుణగణాలెటువంటివి అనేది చెప్పడానికి శివమహిమా స్తోత్రంలో పుష్పదంతాచార్యులు చెప్తున్నారు చూడండి.

అసితగిరి సమం స్యాత్ కజ్జలం సింధుపాత్రే సురతరువరశాఖా లేఖనీ పత్రముర్వీ | లిఖతి యది గృహీత్వా శారదా సర్వకాలం తదపి తవ గుణానామీశ పారం న యాతి || (32)

సరస్వతీ దేవి కల్పవృక్షం కొమ్మని కలంగా తీసుకుని భూమండలమంత కాయితం మీద సర్వకాల్లోనూ భగవద్విభూతి రాస్తోందిట. కలంలో సిరా ఏమిటంటే కాటుక కొండ పట్టుకొచ్చి సముద్రంలో కలిపితే వచ్చేదే. ఎప్పటికీ తరిగిపోని అంత సిరా, అరిగిపోని కల్పవృక్ష శాఖ కలంగా ఉండి రాస్తున్నా భగవంతుడి గుణగణాలు రాయడానికి ఇవన్నీ సరిపోవట్లేదు. అదే అవ్యక్తం అంటే. అంటే మనం ఆయన్ని ఎంత వర్ణించినా ఇంకా పూర్తిగా తెలుసుకోనట్టే.

అందుకే అంటున్నాడు గోపన్న, బ్రహ్మదేవుడికూడా సాధ్యం కాదు కదా నీ మహిమ వర్ణించడం అని. వచ్చేనెల, అసురకోటుల గెల్వగల్గిన ఆ కోతి ఎటువంటిదో, దానికెటువంటి గుణాలున్నాయో విశ్వనాధ సత్యన్నారాయణ గారి రామాయణ కల్పవృక్షం పద్యంలో చూద్దాం.

© 2020 Chaitanyam Magazine. All Rights Reserved.