సినిమా! (ఇదో సప్త వర్ణాల సినీ జగత్)
అలాగే, “ఆ అగ్రనటులు నందమూరి తారక రామారావు గారి,అక్కినేని నాగేశ్వరరావు గారి నడవడిని కానీ, సిన్సియారిటీని, టైమింగ్ ని,అన్ని పాత్రల యందలి వారి నటనా చాతుర్యాన్ని కానీ చూసి”..ఆనాటి ఇతర నటీ నటులు అందరు కూడా ఎటువంటి అసూయా విద్వేషాలకు లోను కాకుండా,ఒక్కొక్కప్పుడు ఏవైనా మాట తేడాలు వచ్చినప్పటికీ, వాటిని అధిగమించి ‘షూటింగ్ సమయాల అప్పుడు అవసరాన్ని బట్టి,ఆ ఇరువురికీ అనుగుణంగా ఆ పద్ధతులు అనుసరించి పాటించే ప్రయత్నం చేయడమే గాకా, వారి పట్ల ఎంతో గౌరవ భావంతో వుండేవారన్నట్టు’ కొన్ని కొన్ని సందర్భాలలో ఆ నటులు చెప్పిన విషయాలను బట్టే,ఇలా ఆ వివరాలు పట్ల వినికిడి ఉండేది. ఇక, NT రామారావు గారి సినిమా పాత్రల విషయాలకి వస్తే పౌరాణికాలలో కృష్ణుడు, రాముడు, దుర్యోధనుడు, రావణాసురుడు, భీష్మాచార్యులు అంటే వారే అన్నట్టు అలా ఎన్నెన్నో వన్నె తెచ్చే..’దాన వీర శూర కర్ణ, పాండురంగమహత్యం,మాయాబజార్,గుండమ్మ కధ,యమగోల,వేటగాడు,లవకుశ, రాముడు-భీముడు మిస్సమ్మ, శ్రీకృష్ణ పాండవీయం’ తదితర ఎన్నెన్నో సినిమాలలోని పాత్రల పోషణలో అందెవేసిన చేయి అనిపించుకోవడమే కాకుండా..తన ఆ పాత్రలకి రామారావుగారు ఎంతగా ప్రాణం పెట్టి,కస్టపడి నటించారు అన్నది..వారి సినిమాలను ఎంతో దీక్షగా వీక్షించిన ప్రతీ ఒక్కరికీ తెలిసున్నదేను! అందుకే అలా ఎనలేని ఆప్యాయతలను,మన్ననలను ప్రజల,అభిమానుల అందరి నుండి ఆయన పొందగలిగారు అన్నది, సామాన్యమైన విషయం కాదు. అలాగే జానపదం,సాంఘికం సినిమాలలోని పాత్రలలో కూడా అంతే అద్భుతంగా వారు నటించారు,అని అనిపించుకున్నారు కూడా. **ఆ తర్వాత ప్రజల సేవకై, N.T రామారావు గారు “తెలుగుదేశం పార్టీని” స్థాపించి, రాజకీయంగా కూడా మేలైన పాలనను అందిస్తూ, రాష్ట్ర ముఖ్య మంత్రిగా భాధ్యతను నెరవేర్చిన అన్నాళ్ళు.. మరెంతగానో ప్రజలు అందరి మెప్పును సహితం పొందగలిగారు! రామారావు గారు ‘ముఖ్యమంత్రి పదవీ బాధ్యతలలో’ వున్నన్ని సంవత్సరాలు.. మా రెండవ అన్నయ్యగారు గోటేటి రామచంద్రరావు గారు వారికి, OSD గా అధికార బాధ్యతలు నిర్వహించడం, మా కుటుంబాలకి ఎంతో గౌరవనీయ విషయంగా ఉండేదీ.
అలాగే మా 5 వ అన్నయ్య స్వర్గీయ గోటేటి రాధాకృష్ణ మూర్తి గారు కూడా ఆ తెలుగుదేశం పార్టీపట్ల అభిమానంతో ఉండడమే కాకా,ముందులో తనకి ఇచ్చిన అన్ని బాధ్యతలను సక్రమంగా నిర్వహించడమే కాక, చివరిగా వచ్చిన ‘పబ్లిక్ సర్వీస్ కమీషన్ బోర్డు మెంబర్’ భాధ్యతను కూడ తన శక్తివంచన లేకుండా చేయగలిగారు. అంతే కాదు ఈ మధ్య ఒక ఏడాది క్రితం రామారావు గారి అబ్బాయి,నటుడు నందమూరి బాలకృష్ణ.. క్రిష్ దర్శకత్వములో తన తండ్రి సినీ జీవితాన్ని, రాజకీయ జీవితాన్ని బయోపిక్ గా “NTR కధానాయకుడు, NTR మహానాయకుడు“ నిర్మించి, తానే ఆ రెండు పాత్రలలో అద్భుతంగా నటించి విడుదల చేసారు అన్నది అందరికి తెలిసున్నదే.. అక్కినేని నాగేశ్వరరావు గారు అయితే ఎక్కువగా, తనదైన సత్తాతో కధా పట్టు, నటనా వైవిధ్యం వున్న “తెనాలి రామకృష్ణుడు,దేవదాసు,ప్రేమాభిషేకం,దసరాబుల్లోడు,మిస్సమ్మ, గుండమ్మ కధ, కాళిదాసు మాంగల్యబలం, భార్య భర్తలు” వంటి సాంఘిక చిత్రాలలో, ఎన్నెన్నో పాత్రలు పోషించి.. ప్రజలు అందరి అభిమానం తన సొంతం చేసుకుని సెహబాష్ అనిపించుకున్నారు.
ఇక పౌరాణిక,జానపదాల్లో కొన్ని కొన్ని మాత్రమే పాత్రలు చేసినప్పటికీ..బాగా చేశారనే పేరు ఎంతగానో సంపాదించుకున్నారు. రామారావు గారు,నాగేశ్వరరావు గార్ల సరసన జోడిగా,హీరోయిన్ గా నటించిన నటీమణులు “మాలతి, శ్రీ రంజని, లక్ష్మి రాజ్యం, జి.వరలక్ష్మి, ఎస్.వరలక్ష్మి,అంజలీదేవి,బి. సరోజా దేవి, సావిత్రి, జమున,దేవిక, రాజశ్రీ, కృష్ణ కుమారి, షావుకారు జానకి.. ‘ఎక్కువగా తన సొంత బేనర్ భరణి పిక్చర్స్ , తన స్వీయ సంగీతం, సొంత గాత్రం, సొంత కధలే కాకుండా.. తనదైన శైలిలో నటించి ఎంతగానో మెప్పు పొందిన’ భానుమతి రామకృష్ణ, గిరిజ, వాసంతి,ఇలా ఒకరని ఏమిటీ, ఎందరెందరో గొప్ప గొప్ప నటీమణులతో నటించగా..ఆ మంచిచిత్రాలు అన్నీ ‘శత దినోత్సవాలు’జరుపుకోవడం అందరూ చూసిందే. అలనాటి ఆ చిత్రాలలో “హీరోయిన్స్ కొంతమంది లావుగా వున్నారా, సన్నగా వున్నారా అనే ప్రశ్న లేకుండా.. ముఖం తీరుగా, అందంగా, ఫోటోజనిక్ గా ఉండి, అద్భుతమైన నటనా వైవిధ్యత చూపించేలా ఉండడానికే, దర్శక నిర్మాతల ప్రాముఖ్యత ఎక్కువ ఇవ్వబడినప్పట్టికి”.. నిజంగా కూడా ఆ చిత్రాలను చూసే జనం,ఆ హీరోయిన్ ల ముఖ సౌoదర్యానికి, వారి నటనా కౌశలానికి ఎంతో ముగ్ధులవుతూ.. వారిని ఎంతగానో ఆదరించేవారు ఎల్లెడలా నిండి వుండేవారనడంలో, ఏ మాత్రం అతిసేయోక్తి లేదేమోను. అంతేకాదు,కొన్ని కొన్ని సినిమాలు “హీరో వలన హిట్ అయ్యేయా, హీరోయిన్ వలన హిట్ అయ్యేయా? అని కూడా తెలియనంత పోటీ తత్వంతో వారు ఇరువురు నటించడం వలన” ఆ పేరు ప్రఖ్యాతలు ఆ నటులకి మాత్రమే కాదు.. ‘మహానటి సావిత్రి, అంజలీదేవి, జమున, కృష్ణ కుమారి’ వంటి ఎందరో నటీమణులకు వాటితో పాటు అలవి కాని గుర్తింపుని,లెక్కలేనంత మంది అభిమానులని తెచ్చిపెట్టాయి అనడంలో ఎటువంటి ఆశ్చర్యము కూడా ఉండదు కదా. ఇక క్యారక్టర్ ఆర్టిస్టులు:- సినిమాలకి వారు ఎంతో ఆయువు పట్టు,గొప్ప నటీమణులు అనిపించే, “కన్నాంబ,రుషేంద్రమణి, హేమలత, శాంతకుమారి,పండరి బాయి,నిర్మల,ఛాయాదేవి..గయ్యాలీ తనానికి, మంచి తనానికి కూడా మారుపేరుగా నటించి మెప్పించే సూర్యకాంతం” ఇలా వీరెందరో తమ తమ పాత్రలకు ప్రాణం పోసి నటించేవారు కావడంతో,అందరిలోకి ప్రత్యేకతతో ఎన్నదగినవారే అయ్యేరు!
అందుకే చాల మంది ప్రేక్షకులు కూడా,వారి నటన గురించి పలుమారులు తలుచుకుని, సరదాగా మాట్లాడుకోవడానికి కూడా ఉత్సహం చూపేవారేమోను అనుకుంటాను. అలాగే “నాగభూషణం, నాగయ్య,S.V రంగారావు, గుమ్మడి వెంకటేశ్వరరావు, సత్యనారాయణ, జగ్గయ్య, కాంతారావు, రాజనాల,అల్లు రామలింగయ్య ,రేలంగి, ముక్కామల,త్యాగరాజు,రమణారెడ్డి, రాజబాబు, పద్మనాభం, ప్రభాకర రెడ్డి, రావుగోపాల రావు,మిక్కిలినేని” ఇలాంటి ఎందరో మహానుభావులు అనిపించే, గొప్ప గొప్ప నటులుగా కీర్తికి ఎక్కడం సామాన్య విషయం కాదు కదా?వీరిలో ‘చాలామందికి వున్న నాటకానుభవం వల్లనేమో కూడా.. వీరు ఏ సినిమాలో అయినా సరే నటిస్తున్నట్టు కాకా, ఆ ఆ పాత్రలలో జీవిస్తున్నట్టే ఉండేది’ అనుకోవడంలో సహితం ఎటువంటి సంశయము ఉండనే ఉండదు. **ఎంత కష్టతరమైన డైలాగులు అయినా,పౌరాణికాలలోని పద్యరాగాలు అయినా అలవోక వాక్చాతుర్యంగా వ్యక్తీకరించడం కూడా” ఎందరెందరో ఆ నటులకు,వెన్నతో పెట్టిన విధ్యే అని అనిపించక మానదు! **అంతేకాదు“ఒక విధంగా చెప్పాలంటే వీరిలో చాల మంది నటులుగానే కాకుండా, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, రైటర్లుగా కూడా వినతికెక్కినవారే!” **అలాగే, 2013 లో S.V రంగారావు,అల్లు రామలింగయ్య, భానుమతి రామకృష్ణ పేర్ల మీద “భారత్ స్టాంపుని” విడుదల చేయడం అన్నది ఎంతో హరిషించే S.V రంగారావు గారు“వినాయక విజయం,భక్తప్రహ్లద,గుండమ్మ కధ, నర్తనశాల,మంచిమనసులు, మాంగల్యబలం,సుఖదుఃఖాలు,పాతాళ భైరవి”వంటి ఎన్నెన్నో గొప్ప చిత్రాలలో.. గుమ్మడి వెంకటేశ్వరరావు“మహామంత్రి తిమ్మరుసు,భీష్మ, లక్షాధికారి,ఆత్మీయులు”వంటి ఎన్నెన్నో పేరెన్నిక గన్న చిత్రాలలో .. నాగయ్య గారు అయితే ”పోతన, త్యాగయ్య, యోగి వేమన,స్వర్గసీమ,మరపురాని కధ, ఇద్దరమ్మాయిలు” వంటి మరెన్నెన్నో అద్భుతమైన చిత్రరాజాల్లో నటించి,గౌరవనీయంగా అందరి గుండెల్లో నిలిచిపోయుంటారు అనడంలో ఏమాత్రం ఆశ్చర్యపడనవసరం ఉండదేమో! నటనలో పూర్తిగా జానపద సినిమాలను తన సొంతం చేసుకున్న,ఆ గుర్రాలు,కత్తులతో, మంచి రాజరికపు కథలతో చక్కగా నటించి మెప్పించడమే కాకుండా, తన పేరునే ‘కత్తుల కాంతారావు గా’ మార్చుకున్న కాంతారావు..“గురువును మించిన శిష్యుడు,రహస్యం,గండర గండడు” వంటి ఎన్నెన్నో సినిమాల్లో నటించారు!
చదువరులకు ఒక చిన్న మాట :- ఉదాహరణ కోసం,“ఇలా కొంత కొంత మంది నటులు నటించిన కొద్దిపాటి చిత్రాల గురించి మాత్రమే తెలియ చెప్పాను.. మిగిలిన నటులు అందరు కూడా,తమ నటనా చాతుర్యములో ఎంతెంతో గొప్పవారేను.” అటువంటి నట రత్నాలను పొందడం కూడా సినీ పరిశ్రమ చేసుకున్న ఎంతో అదృష్టము. వారందరు నటించే ఎన్నెన్నో సినిమాలను, ప్రేక్షక జనమందరు చూసి ఆనందించి, ప్రోత్సహించడం ఇంకెంతో గొప్ప విషయము. (ఇంకా వుంది)