అసలు సిసలు కవిత్వానికి ఆనవాలు
మొదటి సారి పెన్నా శివరామకృష్ణ గారి పేరు ముప్పై ఏళ్ల క్రితం మా సదాశివ సారు నోటివెంట విన్నాను.
అప్పటికే పెన్నాగారు గజల్ కవిగా సుప్రసిద్ధులు. అప్పట్లోనే పెన్నా గారి కవిత్వం పత్రికల్లోవచ్చేది.
గజల్ ఉర్దూలో ప్రాచుర్యం పొందిన ఒక ప్రక్రియ.అందుకే ఉర్దూ కవిత్వపు లోతులుతెలుసు కోవడానికి సదాశివ గారిని సంప్రదించే వారనుకుంటా.
అప్పటికి పేరుమాత్రమే తెలిసిన నేను ఆయన కూడా సదాశివ గారిలాగే పెద్దవయసు వారనుకు న్నాను.కాని ఇటీవల తెలిసింది వారికి మొన్నమొన్ననే షష్టి పూర్తిఅయ్యిందని.పెన్నాగారి వృత్తి, ప్రవృత్తికి అనుకూలమైంది కనుక ఇటు తెలుగు అధ్యాపకుడిగా ఉంటూ ఎం.ఏ.,ఎం.ఫిల్.,పిహెచ్.డిపూర్తిచేసుకున్నారు.అలాగే అటు కవిగా ,విమర్శకునిగా పరిణత దశకు చేరుకున్నారు. పెన్నా గారిది నిశ్శబ్ద విప్లవం.రాశి కన్నా వాసికి అత్యంత ప్రాముఖ్యతనిచ్చే ఆయన అనేకకవిత్వరూపగుహాంతర్భాగాలలోకి దూరి వాటి ఆనుపానులను పట్టుకున్నారు. ముఖ్యంగా గజల్, రుబాయీ వంటి ఉరుదూ ఫారసీ ప్రక్రియల స్వరూప స్వభావాల గురించితెలుసుకోవడానికి డా. సామల సదాశివ, డా.నోముల సత్యనారాయణ వంటి వరిష్ఠులద్వారాఆ ప్రక్రియలపై సాధికారాన్ని సంపాదించిన వారు పెన్నా శివరామకృష్ణశర్మ గారు.
స్వతహాగా మంచి కవి, ఆపై విశిష్ట విమర్శకులు కావడంతో ఏది రాసినా లోతుగాఆలోచించి ప్రక్రియ ప్రామాణికతను నిలబెట్టే కవిత్వాన్ని వెలువరించగల ఒడుపు ఉన్నకవి పెన్నా . ప్రాచ్య పాశ్చాత్య కవిత్వపోకడల తీరు తెలిసిన వారు. పలు వాదాల ధోరణి ఎరిగినవారు. వారిది ఒక\వచన కవిత చూడండి.
అప్రమేయంగానే…………..!!
కొన్ని అప్రమేయంగానే వచ్చి చేరతాయి.
దుస్తులకంటుకున్న ఇసుక రేణువులా..
గాలాల దుస్తులు ధరించిన పల్లేరులా…
బాటసారి జేబులో రాలిన పూరెమ్మలా…
తేమ ఆరిపోగానే
వచ్చినంత నిశ్శబ్దంగానే రాలిపోతాయి ఇసుక రేణువులు,
వేళ్ళ చివర కొన్ని చిట్టి గులాబీలను వికసింపజేసి,
జీవనవస్త్రానికి కొన్ని శిథిల గవాక్షాలను అమర్చి
పల్లెరుకాయలూ నిష్క్రమిస్తాయి.
మనిషిని కస్తూరి మృగంగా మార్చే జేబులోని పూరెమ్మను
వాడిపోకుండా కాపాడనూ లేము, పారేయనూలేము!
ప్రపంచవస్త్రానికి అంటుకున్న ఇసుక రేణువులం,
స్పృశించిన దానినల్లా అంటుకు తిరిగే పల్లేరుకాయలం,
అనూహ్య సుగంధ బుద్బుదాలం మనమేనని….
చివరకు రాలేటప్పుడు కానీ తెలియదేమో !!
కొన్ని అప్రమేయంగానే వచ్చి చేరతాయి !
వచ్చినంత నిశ్శబ్దంగానే రాలిపోతాయి !!
కవితలో ఇసుక రేణువులతో , పల్లేరు కాయలతో,రాలిన పూరెమ్మలతో మనిషి మనుగడను పోల్చడం ఎంతో భావగర్భితంగా ఉంది.మనిషి లక్ష. ణాలకు తగిన ప్రతీకలుఎంచుకోవడంలోనే తెలుస్తుంది కవి ప్రతిభ. ఏ ప్రమేయం లేకుండానే ప్రపంచంలో మనిషి రావడంపోవడం ఎలాగో చెప్పడమే కవితలోని మర్మం. ఆయన వచన కవిత్వానికిది ఒక మచ్చుతునక మాత్రమే. ఇక ఈ రుబాయీ చూడండి.
‘వదలిన కొమ్మకు పక్షే పెను భారం అవుతుంది
ఊహ గాలిపటమైతే మది దారం అవుతుంది
ఛందస్సులు భావాలకు పెను సంకెలలవుతాయా
మలచుకుంటె ప్రతిబంధం సుమహారం అవుతుంది’‘అశ్రుధార’అనే రుబాయీ సంపుటిలోనిది ఇది.ఇలాంటి అందమైన, భావస్ఫోరకమైనఐదువందల రుబాయీల సంపుటి. వీరు ఇటీవల వెలువరించిన అశ్రుధార.ఇందులోని ఏ రుబాయీ కా రుబాయీనైపుణ్యంతో రూపొందించిన సౌష్టవం కలిగిన అందమైన స్వర్ణాభరణలా ఉంటుంది. తెలంగాణ రుబాయీలు పేరుతో ఇదివరకే ఒక పుస్తకం ప్రచురించారు వీరు.
అలాగే జపాన్ లో ఆవిర్భవించి ప్రపంచవ్యాప్తమైన లఘు కవితా ప్రక్రియ హైకూ గురించికూడా చాలా శ్రమించి ప్రపంచ ప్రసిద్ధమైన కొన్ని హైకూలను తెలుగు పాఠకులకుఅందించారు.
గాలి ఒడిలో ప్రాణదీపిక వెలుగుతూనే ఉన్నది
తిమిరవలయం నింగిదాకా
పెరుగుతూనే ఉన్నది
వచ్చినపుడూ వెళ్లునపుడూ
ఒంటరిగనే పయనము
నడుమ మనసొక తోడు కోసం
వెతుకుతూనే ఉన్నది
మృత్యువనియెడు లోయ అంచుకు
చేర్చినది ఒక దాహము
వీడిపోవని ఆశ ఇంకా
తరుముతూనే ఉన్నది
కలతనిదురై పోయె మనుగడ
కలగ మారెను ప్రేయసి
కలకు ఇలకూ నడుమ నా మది
నలుగుతూనే ఉన్నది
రాయుచూ చెలి చెరుపుచున్నది
మట్టిలో నా పేరును
ప్రేమకథగ ముగియుచోటును
తెలుపుతూనే ఉన్నది
మోదమైనా ఖేదమైనా లేదు ‘పెన్నా’
భేదము
రాలుతూ ప్రతి అశ్రుబిందువు నవ్వుతూనే ఉన్నది
ఇది పెన్నా కలం నుండి జాలువారిన ఒక చక్కని తాత్వికత కలిగిన గజల్.
తెలుగులో గజల్ను అవగాహన చేసుకోవడానికి వీరు గజల్ సౌందర్య దర్శనం అనేపుస్తకాన్ని వెలువరించారు.గజల్ కు సంబంధించిన అనేక వివరాలతో కూడిన పుస్తకంఇది.తెలుగులో గజల్ కు దాశరథి ఆద్యుడు కావచ్చు. సినారె గజళ్ల తో తెలుగు గజల్ కుప్రాభవం కలిగి ఉండవచ్చు.కాని గజల్ మీద సాధికారత కలిగి ఉన్న కవి పెన్నా అనటంలోసందేహం లేదు.వీరు సల్లాపం మరియు శిశిర వల్లకి అనే గజల్ సంపుటులనువెలువరించారు.
కవిసేన మానిఫెస్టో,ఆధునిక భారతం వంటి రచనలతో సుప్రసిద్ధులైన గుంటూరుశేషేంద్ర శర్మ గారి కవిత్వం మీద పరిశోధన సల్పిన పెన్నా శివరామకృష్ణ గారు హైదరాబాదువిశ్వవిద్యాలయం నుండి ‘శేషేంద్ర కవిత్వానుశీలనం’ అనే సిద్ధాంత గ్రంథం సమర్పించి
పిహెచ్. డి పట్టా పొంది డాక్టర్ పెన్నా శివరామకృష్ణ అయ్యారు.
వీరు కవిత్వం మరియు విమర్శలో సవ్యసాచి.అనేక అంశాలపై వీరి విమర్శకొనసాగింది.
శివారెడ్డి కవిత్వం -పరిణామ వికాసాలు,ఎరుక (సాహిత్య వ్యాసాలు),సినారె విశ్వంభరలోఅర్థయుక్తి,ఆవిష్కరణ (సాహిత్య వ్యాసాలు),తెలుగు గజళ్లు రుబాయీలు,గోరటి వెంకన్నకవితా పరామర్శ,వచనకవిత-అలంకారికత
ఎన్.గోపి కవితాతత్త్వ వివేచన వంటి పుస్తకాలు సాహిత్యప్రియులకు కరదీపికలవంటివి.
ఇవి కాకుండా ‘రోజురోజుకో చరిత్ర’,
’జాతీయ అంతర్జాతీయ దినోత్సవాలు’,నిరాశావాది నిఘంటువు’,’ ప్రేమ మరికొన్నిసంగతులు’,’ముద్దుల ముచ్చట్లు’,’తారీఖుల్లో తెలంగాణ’
వంటి వైవిధ్యం కలిగిన పుస్తకాలు వీరి పెన్ను విరచించింది.
అంతే గాక వీరి సహ సంపాదకత్వ నిర్వహణలోప్రేమ-101కవితలు,కవిత్వదశాబ్ది,తెలంగాణ సంస్కృతి-కళలు,శివారెడ్డి కవిత్వం-విమర్శలు,ఆమె ఎవరైతే మాత్రం,ఎన్.గోపి భావచిత్రదీపాలు,శివారెడ్డి పీఠికలు,దశాబ్దికవిత,పరంపర,నోముల సాహిత్యముచ్చట్లు వంటి పలు పుస్తకాలు వివిధ ప్రచురణసంస్థల ద్వారా వెలువడ్డాయి.ఇది వీరి సాహిత్య ప్రతిభకు గీటురాయిగా చెప్పవచ్చు.
‘విద్వాన్ సర్వత్ర పూజ్యతే’ అన్నట్లు వీరి ప్రతిభకు తగిన గుర్తింపుగా అనేక పురస్కారాలువీరిని వరించాయి.
నూతలపాటి సాహితీ సత్కారం,
ఆంధ్ర సారస్వత సమితి (మచిలీ పట్నం) సాహితీ పురస్కారం, తెలుగువిశ్వవిద్యాలయం-పిల్లలమఱ్ఱి వేదవతి జగన్నాథం స్మారక పుర స్కారం,శ్రీమతి కొలకలూరిభాగీరథి తెలుగు సాహిత్య విమర్శ పుర స్కారం,వీరి దీపఖడ్గం కవితా సంపుటికిఉమ్మడిశెట్టి సాహితీ అవార్డు,సాహితీ గౌతమి (కరీంనగర్) వారి సి.నా.రె.కవితాపురస్కారం, ద్వానాశాస్త్రి సాహిత్య పురస్కారం, తెలుగు విశ్వ విద్యాలయం సాహితీపురస్కారం (దీపఖడ్గం కవితా సంపుటికి),తెలంగాణ సారస్వత పరిషత్ వారి సి.నా.రె. సాహిత్య పురస్కారం వీరిని వరించాయి.
సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో తెలుగు ఉపన్యాస కులుగా పనిచేసిఉద్యోగ విరమణ గావించిన పెన్నా శివరామకృష్ణ శర్మ గారు ఫిబ్రవరి 8,1960 న నల్లగొండజిల్లా దుగునవల్లి గ్రామంలో అనంతలక్ష్మి శేషావతారం దంపతులకుజన్మించారు.సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాదు నుండి క్రమంగా ఎం.ఏ.,ఎం.ఫిల్, పిహెచ్.డి.పట్టాలు సంతరించు కున్నారు.
ముగించే ముందు ఒక చిన్నమాట.
వీరి పలు ప్రక్రియలలో ‘అశ్రువు’అనే పదం పలుచోట్ల కనబడుతుంది. నేనైతే ఆ పదంపెన్నా గారి సాహిత్య సంతకంగా భావిస్తాను. భావతీవ్ర తకు సంకేతంగా రసార్ద్రంగా వాడేఆ పదం పెన్నాగారి కవిత్వపుటా ల్చిప్ప లో పడి ఆణిముత్యంగా మారిన స్వాతిచినుకంటాను.అశ్రుధార అనే శీర్షికతో ఒక పుస్తకమే వెలువరించా రంటే వారికి ఆ పదంమీద ఉన్న
మమకారం ఎంతటిదో తెలుస్తుంది.
ఇటీవల ముఖపుస్తకంలో వీరి పెన్నా సరాలు ఎందరో పాఠకులనుఅలరిస్తున్నాయి.మచ్చుకి
కలలలోనే బతుకు స్వేచ్చే
ఒకరు ఇచ్చిన బహుమతి!
మనసు కోరిన కలలు కనుటకు
నిదుర ఇవ్వదు అనుమతి!
-ఇలా తాత్త్వికతతో కూడుకొన్న సరాలు వారి కవితా స్వరాలు.
నిరంతర సాహిత్యైకజీవి,కవితా తత్త్వ పిపాసి ఎందరికో మార్గదర్శి తెలుగు భాషకుతెలంగాణ గడ్డకు దొరికిన ఒక ఆణిముత్యం పెన్నా. పెన్నా గారి పెన్ను పెన్నానదిలాజాలువారి నిరంతర కవితాద్రుమాలు పెంచుతూ, సాహితీ సుమాలు పంచుతూఉండాలని అభిలషిస్తున్నాను