పూరి జగన్నాధ స్వామి వైభవం

పూరి జగన్నాధుని రధయాత్ర తెలుగువారికి అత్యంత ప్రీతి పాత్రమై నది.కాని ఆ స్వామికి సంబంధించిన పురాణగాధ సంపూర్ణంగా కొద్దిమందికి మాత్రమే తెలుసు.

స్కాందపురాణాంతర్గతమైన జగన్నాధ క్షేత్ర మాహాత్త్యాన్ని యధామూ లంగా, సరళ, వ్యావహారిక భాషలో అనువదించి మన పాఠకులకు ప్రతి నెల అందిస్తున్నాము. చదవండి, చదివించి మోక్షాన్ని పొందండి.

– సంపాదకురాలు

బ్రహ్మ బలరాముని రధం దగ్గరకు వెళ్లాడు.భక్తితో నమస్కరించి ఈ విధంగా స్తుతించాడు.

బ్రహ్మ బలరాముని స్తుతించుట——

“బలరామా! ఆకాశము నీ శిరస్సు. నీరు నీ శరీరము. పాదములు భూమి. అగ్ని నోరు. నీ ఉచ్ఛ్వాశ నిశ్వాసలు, వాయువు, మనస్సు చంద్రుడు. కన్నులు సూర్యుడు. చేతులు ఆకాశము. జ్ఞానమునకు అద్దమువంటి వాడవు అగు నీకు నమస్కారము. పదునాల్గు లోకాలకి నీవే మూలస్తంభం. నీపాదపద్మాలకు నమస్కరించిన వారి పాపాలు పోగొట్టువాడా, అంతులేని కన్నులు, పాదాలు, చెవులు, కన్నులు, చేతులు కలవాడా! అనాదికాలం నుండి మూలరూపం కలవాడా, చీకటికి సూర్యుడు వంటివాడా! వేదమూర్తి! మూడు దోషాలు నాశనము చేయువాడా! మూడు అవతారములు దాల్చినవాడా! పడగలపై భూమిని మోయువాడా! కాలాగ్ని రుద్రా! మహారుద్రా! నీకు నమస్కారము.

పడగలను గొడుగు క్రింద నిద్రించు వాడా! లోకాలను ఉద్ధరించువాడా! నీవే రక్షించువాడవు. నీవే సృష్టించువాడవు. నీవే భక్షించువాడవు. నీవలన మేమందరం బతుకుతున్నాం. ఉపనిషత్తులచే స్తుతించబడిన నారాయణ స్వరూపం నీవే. నీకంటె వేరైనది ఏది లేదు. నీవే అనేక రూపాలలొ కనిపిస్తున్నావు. నీవే శయ్య. నీవే శయనించు వాడవు. కప్పువాడవు, కప్పబడువాడవు నీవే. విష్ణువు నీవే. బలరాముడు నీవే.మీ ఇద్దరిమధ్య భేదంలేదు” అని బ్రహ్మస్తుతించాడు.(40-51)

లోకాలకు తల్లి అయిన సుభద్రను చూడడానికి బ్రహ్మ సుభద్ర రధం దగ్గరకు వెళ్లాడు.ఆమెకు నమస్క

రించి ఈవిధంగాస్తుతించాడు.

బ్రహ్మ సుభద్రాదేవిని స్తుతించుట————

“ దేవి! జగన్మాతా! పరమేశ్వరి! అనుగ్రహించు.కార్య కారణములు నీవే కల్పిస్తావు. నీకు సర్వశక్తులు ఉన్నాయి. అందరిలో జ్ఞానాన్ని, మోహాన్ని నీవే కల్పిస్తావు. కైవల్యాన్ని, ముక్తిని నీవే ఇస్తావు. నీవే విష్ణుమాయవు. అందరిని మోహింపచేయునది నీవే. విష్ణు వక్షస్థలముపై ఉంటూ ఆయన భావాలకి అనుగుణంగా నడుచుకొను చున్నావు. నీవే లక్ష్మివి, గౌరివి, శచివి,కాత్యాయనివి. అన్ని శక్తులను కల్పించుదానవు నీవే. నిన్ను స్తుతించ డానికి ఎవరు సమర్ధులు కారు.అందరికి భద్రమును కల్పించునట్టి సుభద్రవు నీవే. జగన్మాతవు నీవే. స్వామి జగత్పతి! స్త్రీలందరు నీ స్వరూపాలే. పురుషులందరు స్వామి రూపాలే. మీ ఇద్దరకు మధ్య భేదము లేదు.విష్ణు మాయా స్వరూపిణి యగు నీవే మమ్ములను నియమించావు. నీ ఆదేశంపై మేము ఈ కార్యాలు నిర్వహిస్తున్నాము. వృత్తి, ప్రవృత్తి, ఆకలి,నిద్ర అన్ని నీవే. ఆశలు కల్పించునది నీవె, పూర్తిచేయునది నీవే.ముక్తి ఇచ్చుదానవు నీవే. బంధనాలు కల్పించుదానవు నీవే. జ్ఞానాన్ని ఇచ్చుదానా1 కల్పవృక్షము వంటిదానా! నీ పాదాలకు నమస్కారం” అని బ్రహ్మ సుభద్రను ప్రార్ధించాడు. అక్కడికి సమీపంలో సుదర్శన చక్రం ఉన్న రధం ఉంది. బ్రహ్మ అక్కడకు వెళ్లాడు. ( 52 – 63)

ఇరవై ఏడవ అధ్యాయం సమాప్తం

(ఇంకా వుంది)

© 2020 Chaitanyam Magazine. All Rights Reserved.