నవవిధ భక్తులు
అర్చనం
నవవిధ భక్తిమార్గాలు అర్చనం
“బామ్మా! నవవిధ భక్తిమార్గాల్లో ఐదవదాన్ని గురించి చెప్తావా?” అంటూ బామ్మ దగ్గరకొచ్చి కూర్చుంది కుమారి.
“తప్పక చెప్తాను కుమారి! అసలు అర్చనం అంటే భగవంతుని పటానికో, ఆలయాల్లో ఐతే విగ్రహాలకో అష్టాత్తరశతనామాలతో పూజించడం.అర్చించడం అంటే సమర్పించడం అని అర్థం. మనకున్న వాటిని భగవంతుడికి సమర్పించడమే అర్చన. అసలు మనకు ఏదైనా భగవదనుగ్రహం వల్లే కదా వస్తుంది? మరి మనం ఆయన మనకిచ్చినదాన్ని తిరిగి ఆయనకు సమర్పించడమంటే అర్థమే ఉండదు.మరి మనం ఆయనకు ఏమివ్వాలీ అంటే మనలోని దుర్గుణాలు భగవంతునికి సమర్పించి, పరి పూర్ణమైన ప్రేమను పెంచుకుని, మనతోటి వారికి సాయం చేయ డం ఆయనకు ఇష్టమైన అర్చన. నీకు బాగా అర్థంకాను ఒక కథ చెప్తాను విను.
పూర్వం ఒక చిన్నపాటి నగరంలోపుల్లయ్య, పోలయ్య అనే ఇరువురు పండ్ల వ్యాపారులు ఉండేవారు. పోలయ్య మంచి వ్యాపారదక్షత గల వాడు. ఎలా తన వ్యాపారాన్ని వృధ్ధి చేసుకోవాలో నిత్యం ఆలోచిస్తూ ఉండే వాడు.
పుల్లయ్య సాదాసీదా వ్యక్తి. తనవ్యాపారంతో పాటుగా తనచుట్టూ సమాజంలో ఉండే తనకంటే పేదలనూ, అనాధలనూ గురించి ఆలోచిస్తూ, వారికి చేతనైన సాయం చేస్తూ ఉండేవాడు.ఉండనూ తిననూ ఉంటే చాలని అతని అభిప్రాయం. పోలయ్య రోజూ తన అంగడికి వెళ్లేదార్లో ఉన్న వినాయక స్వామి ఆలయానికి వెళ్ళి రెండు పండ్లు సమర్పించుకుని అర్చన చేయించుకుని, ప్రసాదంగా ఇచ్చిన ఒక పండును అక్కడే తినేసి షాపు కెళ్ళేవాడు.
పుల్లయ్య రోజు తన అంగడికెళ్లేముందు కొన్ని పళ్ళను ఒక బుట్టలో తెచ్చుకుని వినాయకస్వామి ఆలయం ముందుండే బిచ్చగాళ్ళకూ, అనాధలకూ, అవిటి వారికి ఇచ్చి బయటి నుండే వినాయక స్వామికి నమస్కరించుకుని వెళ్ళేవాడు. దూరంగా ఆలయ ద్వారం బయట ఎదురుగా నిలుచుని నమస్కరించుకుంటున్న పుల్లయ్యను లోపలి పూజారి చేయెత్తి దీవించేవాడు.
వినాయక స్వామికి రోజూ అర్చన చేయటంవల్లో, మరే అదృష్టంవల్లో పోలయ్య వ్యాపారం బాగా అభివృధ్ధి ఐంది. లాభాలతో మంచి ఇల్లు కూడా కట్టుకున్నాడు. పుల్లయ్య వ్యాపారం సాగుతున్నది కానీ పెద్దగా లాభాలూ లేవు, నష్టాలూ లేవు, సాదాసీదాగానే సాగుతున్నది.
దార్లో వచ్చేవారంతా వెళుతున్న పుల్లయ్యకు నమస్క రించడం, గుడిముందున్న బిచ్చగాళ్ళంతా పుల్లయ్య కనిపించగానే నవ్వుతూ లేచి దణ్ణంపెట్టడం చూసిన పోలయ్య అసూయతో మండిపోసాగాడు.
పుల్లయ్య ఏనాడూ ఆలయం లోపలకు వెళ్లనే లేదు. బయటినుంచే నమస్కరించుకునేవాడు.
ఒకరోజున ఆలయంలో పూజకై వెళ్ళిన పిచ్చయ్య, బయటనుంచీ నమస్కరించుకుంటున్న పుల్లయ్యను లోపలినుంచీ దీవిస్తున్న పూజారిని చూసి ఆశ్చర్యపడి” పూజారిగారూ! ఏనాడూ గుడి లోపలికొచ్చి ఒక్క పండైనా సమర్పించి అర్చన చేయించని పిచ్చి పుల్లయ్యను మీరు ఇక్కడి నుంచే దీవించడం నాకు ఆశ్చర్యంగాఉంది” అన్నాడు.
దానికి పూజారి “ఏమీ అనుకోకండి పోలయ్య గారూ! మీరు రోజూ రెండు పళ్ళుతెచ్చి స్వామికి సమర్పించి, మీ వ్యాపారం బాగా సాగాలని అర్చన చేయించుకుని ఆ రెండు పళ్లలో ఒకటి ప్రసాదంగా తిరిగి మీకు ఇస్తే ఇక్కడే తినేసి వెళుతున్నారు. మీ అర్చన మీ వ్యాపారాభివృధ్ధికోసం. మీ రన్నట్లు ఆ పిచ్చి పుల్లయ్యగారు బయటి అనాధలందరిలో వినాయక స్వామిని చూస్తూ వారి ఆకలి తీర్చి అక్కడినుండే స్వామికి నమస్కరించుకుంటున్నాడు. వారందరిలోని వినాయక స్వామినీ అర్చించుకుంటున్నాడు. మీరు ఒక్క వినాయక స్వామిని అర్చిస్తే, పుల్లయ్యగారు ఎంతోమంది వినాయకస్వాములను అర్చిస్తున్నాడు. అర్చన అంటే స్వార్ధంకోసం భగవంతుని పూజించడం కాదండీ! భగవంతుని సృష్టిలోని అనాధలకు సాయం చేయడం” అని చెప్పి హారతి పళ్ళెంతో లోపలి కెళ్లాడు.
పూజారి మాటలు పోలయ్య కళ్ళు తెరిపించాయి. పుల్లయ్య గొప్పదనం అర్థమైంది. ఆరోజునుంచీ తాను కూడా కొన్ని పళ్ళు తెచ్చి బిచ్చగాళ్ళకూ, పేదలకూ అనాధ వృధ్ధులకూ ఇవ్వసాగాడు.నిజమైన అర్చన అంటే స్వార్థ రహితంగా చేసే మానవసేవే కుమారి!” అంటూ ముగించింది బామ్మ .