స్వయంకృతం

రామరాజు కోనా అకా కోనా రామరాజు అనే ఒక ముఫై అయిదేళ్ళ ఏళ్ల సాంకేతిక నిపుణుడు అమెరికాలోని ఓ సంస్థలో చెప్పుకోదగ్గ స్థాయిలో పని చేస్తుండగా, అతణ్ణి ఆంధ్రుల నూతన రాజధాని అమరావతిలో తమ శాఖను స్థాపించవలసిందిగా బదిలీ చేసింది. అమరావతి ప్రపంచదేశాల మహానగరాలకి సాటిగా తీర్చిదిద్దుతారన్న సంచలనవార్తలు, నిర్మింపబోతున్నబాహుబలి మహాసౌధాలూ ఊహించుకొని, రామరాజు అమెరికాను వీడి స్వదేశానికి పోవాలా, లేక అక్కడే ఉండిపోయే ప్రయత్నం చెయ్యాలా అని మనసులో తర్జన భర్జనలు చేసుకొని, తన ఆలోచనలను భార్యా బిడ్డలకు చెప్పకుండా, సంస్థ చేసిన బదిలీని గురించి మట్టుకు చెప్పాడు. భార్య నయన ఒప్పుకోలేదు. “ఇంకో ఉద్యోగం చూసుకోండి కానీ తిరిగి ఆ రొంపిలో పడ్డమెందుక”ని నిలదీసింది. ఆ రొంపి అనే పదంలో దేశార్థం, రాష్ట్రార్థమే కాకుండా మూలార్థం రాజుకి అవగతమై మనసు చివుక్కుమనిపించింది. “సంస్థ ఇటువంటి ఆలోచనలో ఉందని తెలుసుకొని రెండు మూడు యితర సంస్థలకు రహస్యంగా దరఖాస్తులు చేశాను, కానీ వారు స్పందించలేదు. తక్కువ జీతానికైతే ఆలోచిస్తామన్నారు. ఇప్పుడు పనిచేస్తున్న సంస్థ భారత్ లో తన కార్యకలాపాల్ని విస్తృతం చేసే దిశలో ప్రణాళికలు రూపొందించింది. యాజమాన్యాన్ని ధిక్కరించ వీలుకాని పరిస్థితి. డాలర్లకి సమానంగా జీతం,” అని పెళ్ళాం బిడ్డల్ని ఎంతగానో సముదాయించి నచ్చచెప్పవలసి వచ్చింది. చివరికి రాజు భార్య నయన భయంకరమైన ఆంక్షలు పెట్టేసింది. తమ స్థాయికి తగ్గట్టుగా ఇల్లూ అదీ ముందస్తుగా అద్దెకు తీసుకోవాలనీ, అటుతర్వాత స్వంత ఇల్లు కట్టుకోవాలనీ సహజమైన చిన్న కోరికలు కోరి, తర్వాత అసలు కోరిక చెప్పింది.

అత్తమామల్నికానీ, అనుంగు సోదర, సోదరీమణుల్ని కాని నెత్తికెక్కించుకోకూడదని! అది కైకేయి దశరథుణ్ణి కోరిన కోరిక కన్నా అతి దుర్లభమైన కోరిక. ‘తను పుట్టి పెరిగిన అమలాపురం, అమరావతికి ఏమంత దూరం, తరుచూ వెళ్ళి చూస్తూ ఉండొచ్చ’ని తన్ను తాను సమాధాన పరుచుకొని, గంగిగోవులా తలాడించి. స్వదేశం తిరిగి వచ్చే ఏర్పాట్లన్నీ చేసుకొన్నాడు. నయన పుట్టిల్లు వదిలి వీడుకోలు రోజున అత్తింటికి వెడ్తోన్నంతగా బాధపడ్తూ, భర్తా పిల్లలతోబాటు విమానమెక్కింది. రామరాజు కోనా కుటుంబంతో సహా కోనా రామరాజుగా స్వదేశంలో అడుగు పెట్టాడు. రాజు తల్లిదండ్రులకి నయనతీరు, మనస్తత్త్వం పెళ్ళయిన వెంటనే సూచన ప్రాయంగా తెలిసిపోయింది. ఇప్పుడు తలకొరివి పెట్టడానికి అమెరికా అంత దూరంలో కాక, దగ్గర్లోనే ఉన్నాడని రాజు తల్లిదండ్రులు ఎంతగానో సంతోషపడిపోయారు. వాళ్ళకంటే పదిరెట్ట్లు ఇతోధికంగా నయన తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లూ సంబరపడిపోయారు. ఎందుకంటే వాళ్ళు కృష్ణాజిల్లా గంపల గూడెం, నూజవీడు, మచిలీపట్నం, నందిగామల్లాంటి ఊళ్లలో కుదుళ్లతో కూరుకుపోయిన స్థిరనివాసులు.

ఏవైనా పనులమీద విజయవాడ అకా అమరావతి వెళ్లినప్పుడు అక్కడా యిక్కడా ఉండి పాట్లు పడకుండా, నేరుగా నయన ఇంట్లో దిగిపోవచ్చునన్నమాట. రాజు కూతురు రమ, కొడుకు వర్మ ఇద్దరు ఆరేడు తరగతుల్లో చదువుతున్నారు. ఇద్దరూ ఉండవల్లిలో కొత్తగా వచ్చిన ఓ కాన్వెంట్ స్కూల్లో సునాయాసంగా చేరిపోయారు. రాజు అక్కడే కృష్ణా నదికి కాస్త దగ్గర్లో ఉన్న యిల్లు తీసుకొన్నాడు. డాబా ఎక్కితే కృష్ణానది ఓ వంద అడుగుల దూరంలో కనబడుతోనే ఉంటుంది. పనిలో పనిగా నందిగామలో ఉండే నయన పెద్దక్క తన కొడుకునీ, నూజవీడులో ఉండే రెండో అన్నయ్య తన కూతుర్నీ ఉండవల్లి కాన్వెంట్లో ఏడెనిమిది తరగతుల్లో చేర్పించడం జరిగిపోయింది. రాజు పిల్లల ఆంగ్లోచ్చారణ మాస్టర్లకి అర్థం కాక, నయన బంధువులైన నందిగామ అబ్బాయికీ, నూజవీడు అమ్మాయికి కాన్వెంటు టీచర్ల కేరళ ఇంగ్లీషు అర్థం కాక తలలు పట్టుకున్నా, నెమ్మదిగా గాడిలో పడ్డారు. ఆ నలుగురి మధ్యా తెలుగు నలిగి చచ్చిపోయి, ఆంగ్లభాష మెరుగులు దిద్దుకోసాగింది. ఆర్థికంగా రాజుకి ఏ విధమైన లోటూ లేదు. అమెరికాలో ఉన్నంతకాలం ఏభై శాతం డబ్బా తిళ్ళకి అలవాటుపడిపోయిన ఆ కుటుంబం, ఉండవిల్లిలో ఇల్లు తీసుకొంటూనే, 24×7 వంట మనిషిని కుదిర్చేసుకోవడం జరిగింది. ఆవిడ నివాసం డాబా మీది బర్సాతీలో. ఉత్తరాదిన డాబామీది ఒంటి గదుల్ని బర్సాతీలంటారు. వర్షాకాలపు గదులన్న మాట. పాత సమాన్లు పడేయడానికి, లేక ఎవరికైనా అతిదారుణమైన అద్దెలకివ్వడానికీ పనికొచ్చే గదులు. అందుకని నయనకి వంట శ్రమ లేదు. కానీ రాజుకి మనసు కొంత బాధగానే ఉంది.

తన కుటుంబం రాకూడదని ఆంక్షలు పెట్టిన నయన, ఇద్దరు తన వైపు శాల్తీలని ఇంట్లో దిగేసింది. పళ్ళు కొరుక్కున్నాడు. ఆలివంకవారు ఆప్తబంధువులౌతారని వేమనగారు ఏనాడో చెప్పారు. అందుకని తను చింతపడనవసరం లేదని, వేమనగారి భాష్యానికి బలం చేకూరుస్తూ సమాధానపర్చుకొన్నాడు. ‘అమరావతికి ఆరు గంటల ప్రయాణ దూరంలో దక్షిణాన చెన్నై, పడమర హైదరాబాద్ ఉండగా మళ్ళీ ఈ అమరావతి గోలేమిటి’ అని సంస్థ యాజమాన్య వర్గంలోని కొందరు వాటాదార్ల మధ్య కొంత దుమారం లేచినా, బిల్ గేట్స్ నే కదిలించి ఆయన మెప్పును పొంది, ఖండితాంధ్ర శేషరాజ్యానికి నూతన రాజధానీ నిర్మాణం తలబెట్టిన చంద్రహాసుడి నీడలో తమ కంపెనీ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆశతో, ఆ దుమార మేఘాల్ని నీరు కార్పించేసింది అమెరికా సంస్థ. యిరుగు పొరుగు రాష్ట్రాల హవా ఆరంభ దశలోనే అమరావతి మీద పడకుండా, ఢిల్లీలోని పెద్ద ఆఫీసు ఓ దళారి ద్వారా ముందుగానే తాడేపల్లిలో ఒక పెద్ద మేడయింటిని తీసుకోవడం, ఆఫీసు ఏర్పాట్లన్నీ చేయడం జరిగిపోయింది.

గ్లాస్ టవర్ల వాతావరణం లేకపోయినా ఉన్నంతలో కాస్త ఆకర్షణీయంగానే గదుల్ని తీర్చిదిద్దారు. బెంగళూరు, పూణే, కోల్కతా, చండీఘర్ల నుంచి ఓ పదిమంది దిగువ స్థాయి ఉద్యోగులు వాళ్ళ ఏడుపులు వాళ్ళు ఏడుస్తూ, వాళ్ళ భార్యల్ని సముదాయిస్తూ వచ్చి చేరారు. ఒకరికొకరు స్వాగతం చెప్పుకొని, రాజుకి తమ అధికారిగా అందరూ ఘనస్వాగతం పలికారు. ఇండియాలో అడుగు పెట్టిన మూడు నెలలకుగాని రాజు అమలాపురం వెళ్లలేకపోయాడు. అదీ కోల్ కతా వెళ్ళి, తిరుగు దారిలో విశాఖపట్నం మీదుగా రాజమండ్రిలో దిగి, భార్యకు తెలియకుండా అమలాపురం వెళ్ళాడు. ఇల్లూ, ఆఫీసూ రెండింటినీ కుదురు పరిచేలోగా వీలు దొరక్క రాలేదని తల్లిదండ్రులకు చెప్పాడు. రాజు తల్లిదండ్రులు ‘భార్యాబిడ్డల్ని కూడా తీసుకురాలేకపోయావా?’ అన్న మాటలకి, ‘నేను కలకత్తా వెళ్ళి తిరుగుదారిలో ఇక్కడ దిగాను. పిల్లలకి స్కూళ్ళు. వాళ్ళకి సెలవులిచ్చిన తర్వాత తీసుకు వస్తాను,”అని అన్నాడేకానీ, ఆ మాటల్లో బరువు లేదు, తల్లిదండ్రులకది ఆత్మీయతతో కూడిన పలకరింపు ప్రశ్నే అయినా, తనిచ్చిన సమాధానంలో నిజాయితీ లేదని రాజుకి అనిపించింది. రాజు తల్లి అ విషయమై ప్రస్తావన ముగించి, “సాయంత్రం ఓ సారి అటు అగ్రహారం వెళ్ళి అమ్మ మ్మనీ, తాతయ్యని, పెద్ద మావయ్యల్నీ పలకరించి, రా,“ అంది . రాజు తల్లిదండ్రులూ, తమ్ముడూ, అతని భార్య, కొడుకు, ఇద్దరు అమ్మాయిలతో విధవ అప్పగారు మొత్తం ఎనమండుగురు తాతలనాటి ఒక పెంకుటింట్లో ఉంటున్నారు.

స్వంత వ్యవసాయం అచ్చి రాక, కౌలు దారుల మోసాలకి గురై, సంప్రదాయాలను విడవలేకా ఆస్తులేనాడో కరిగి పోగా, ఆఖరి ఎకరం అమ్మి తండ్రి తనని అమెరికా పంపాడు. తమ్ముడు అమలాపురం హైస్కూల్లో ఉపాధ్యాయుడు. భారమంతా తమ్ముడి మీద పడకుండా ప్రతినెలా తండ్రి పేరట రెండు వందల డాలర్లు పంపించడం వల్ల కుటుంబం సజావుగానే జరిగిపోతోంది. తల్లిదండ్రుల ఋణం తీర్చుకోవడం రాజుకి ఇదే ఒక సంతృప్తికరమైన మార్గంగా తోచి, అమెరికాలో ఉన్నంతకాలం భార్యకి తెలియని అకౌంట్ లోంచి తండ్రికి డబ్బు బదిలీ చేయించేవాడు. భార్యకి తెలియకుండా అంటే, వేరే వేరే ఉపోద్ఘాతాలు లేకుండా నయన నైజం పూర్తిగా తెలిసిపోతుంది కదా? అమ్మమ్మ యింటికి ఆ సాయంత్రం వెళ్ళాడు. పలకరింపులూ అవీ అయిన తర్వాత, “ఏరా రాముడూ! పన్నెండేళ్ళ క్రితం పెళ్లవగానే అమెరికా వెళ్లిపోయావు.

ఇద్దరు పిల్లలూ అక్కడే పుట్టారు. ఆరేళ్ళక్రితం ఒకసారి ఒక్కడివే వచ్చి చూసి పోయావు. యిప్పుడు వచ్చి నీ కుటుంబాన్ని విజయవాడలో వదిలి, మమ్మల్ని చూడ్డానికి మళ్ళీ వంటరిగా రావడం ఏం బావుందిరా? ఆర్థికంగా అమ్మానాన్నల్ని, అక్కయ్యని నువ్వు ఆదుకొంటున్నావని తెలుసు. కానీ ఆప్యాయత అనేది కూడా ఒకటుంటుందని మరిచిపోయావనుకొంటాను. నీ పెళ్ళాం రాకపొయినా ఓ సారి పిల్లల్ని తీసుకు వచ్చి చూపించు,” అంది. రాజుకి కొంచెంగా కోపం వచ్చింది. “ఆట్టే లేనివాళ్లు, అయి నా మంచి సంప్రదాయం గల కుటుంబం అనీ, మీ ఆయన బంధువులంటూ అమ్మకి నూరిపోసి, అంటగట్టావు. తను ఇతరత్రా మంచిదే అయినా ఎందుకో అత్తిల్లంటే మట్టుకు మొదట్నించీ వ్యతిరేకత చూపుతోంది. గత జన్మలో వాళ్ళు బద్ధవైరులై ఉంటారు! ఒకసారి మూడుముళ్లూ వేసిన తర్వాత నాకున్న అవసరాలూ, బాధ్యతలూ నాకున్నాయి. అమ్మా నాన్నలు కట్నం విషయమై కొంత ఆశపడ్డా, నా ఆశయాలకి అడ్డు కాకుండా, నీ మాటలు ఓటు పోకుండా కట్నం తీసుకోలేదు. చాలమందిలా కాకుండా కాపురా నికి తీసుకువెళ్లేటప్పుడు విమానం ఖర్చులన్నీ భరించాను.

ఏదో నా వ్యక్తిత్వానికి భంగం రాకుండా ప్రవర్తించానని గర్వపడ్డానేకాని, నయన ఏమాత్రమూ కృతజ్ఞతాభావం లేకుండా ఇంత స్వార్థంగా ప్రవర్తిస్తుందని అనుకోలేదు. ఏదో పరాయి వాళ్లని చూసినట్టుగా చూస్తూ దూరంగానే ఉంటుంది. యిక్కడ అమ్మా నాన్నలకి కుటుంబ పోష ణకి కష్టమవకుండా, అక్కా, పిల్ల లూ నాన్నకీ, తమ్ముడికీ భారం కాకుండా నయనకి తెలియకుండా డబ్బు పంపిస్తోనే ఉన్నాను. అంతకంటే ఏం చెయ్యమన్నావు ?” “లేనివాళ్ళ పిల్లయినా, ఉన్నవాళ్ళ పిల్లయినా, పెళ్ళయిన వెంటనే నేనూ, నా భర్తా, నా పిల్లలూ అనే స్వార్థానికి లోనౌతుంది. సహజమైన ఆ స్వార్థాన్ని ఆదిలోనే నియంత్రించి అత్తింట్లో అణుకువగా ఉండి కలిసి మెలిసేటట్లు చేయాలంటే భర్తనేవాడు కొంత మెలుకువుగా ప్రవర్తించాలి. కోతికి కొబ్బరికాయ దొరికినట్టు ఒక్కసారిగా భార్యా మోహంలోకి జారిపోతే, సాధారణంగా జరిగేదింతే! అయినా పెళ్ళయిన నాలుగో రోజునే అమెరికా పెళ్లాన్ని తీసుకు పోయావు. నయనకి అక్కడ నువ్వుతప్ప, చెప్పేవారు మరెవరూ లేరు. తల్లిదండ్రుల్ని పోషించవలసిన బాధ్యత నీదేనన్నట్లుగా మొదట్నుంచి ప్రవర్తించి ఉంటే, గుప్త ధనసహాయం చేయాల్సిన అవసరం ఉండేదికాదు. ఇదీ వ్యక్తిత్వానికి సంబంధించిన విషయం. ఎలెక్ట్రాన్

© 2020 Chaitanyam Magazine. All Rights Reserved.