సర్ప ప్రశ్నలు
జన్మవాడ నుంచి మృత్యువాడ కు వెళ్ళే దారిలో జ్ఞానపురం అనే ఓ నగరం ఉంది. అది ఎంత పెద్ద నగరమంటే ఒకప్పుడు నాలుగు లక్షలమంది వుండేవారు. ఇప్పుడ సలు ఎవరూ లేరు. ఇళ్ళు అన్నీ శిధిలమయిపోయాయి. ఒకప్పుడు ధర్మరాజు భీమార్జున నకుల సహదేవుల్ని దాహం తీర్చుకోవడానికి నీరు తెమ్మని పంపింది యీ జ్ఞానపురము దగ్గరలో ఉన్న మోక్ష సరస్సు దగ్గరకేనట. వీరందరూ అక్కడ ఆ సరస్సుకి కాపలా వున్న యక్షప్రశ్నలకు జవాబులు చెప్పలేకపోవడం – ఆ తరవాత ధర్మరాజు వెళ్లి సరైన సమాధానాలు చెప్పి వారందర్నీ బ్రతికించుకోవడం అందరికీ, అంటే మహాభారత కథ తెలిసినవారందరికీ తెలిసిందే. ఆ తర్వాత ఆ యక్షుడి ప్రస్తావన గానీ మోక్ష సరస్సు ప్రస్తావనగానీ ఎక్కడా లేదు.
జ్ఞానపురం ఉన్నమాట నిజం. ప్రస్తుతం అది శిధిలావస్థలో వున్నదీ నిజమే. దాపున ప్రస్తుతం సరస్సు లేదు కానీ, ఒక చిన్న నీటిమడుగు వుంది. జన్మవాడ నుంచి మృత్యువాడకు వెళ్ళేవారు అక్కడ, అంటే ఆ చిన్న మడుగు దగ్గర ఆగుతారు. కారణం, అక్కడ చల్లని నీడనిచ్చే చెట్లూ, తియ్యని నీరూ దొరకడమే.
అత్యంత ఖరీదైన BMW కారు మడుగు దగ్గర ఆగింది. చల్లని గాలి తరగలు తరగలుగా వీస్తూ అంత ఖరీదైన కార్లోని AC నీ సిగ్గుపడేట్టు చేసింది. కార్లోంచి దిగాడు ధనుంజయరావు. వాళ్ళ పూర్వీకులు జన్మవాడ వాళ్ళు. చిన్నతనంలో చాలాసార్లు ధనంజయరావు తండ్రితో అదే దోవన ఎడ్లబండి మీద వెళ్ళాడు. ఇవాళ అతడు అత్యంత ధనవంతుడు. ఒక్కసారి గత జ్ఞాపకాలని నెమరు వేసుకోవడం కోసం ఆ రూట్లో వచ్చాడు. ఎప్పట్లాగానే అక్కడున్న చెట్ల కింద కట్టివున్న అరుగుల్లో ఒకదాని మీద హాయిగా కూర్చున్నాడు.
“అయ్యా, ధనంజయరావు గారూ, నమస్కారం. నా పేరు సర్వేశ్వర శాస్త్రి. మీ చిన్నతనంలో చూశాను. నేనూ మీరు చదివిన స్కూల్లోనే చదివాను” అంటూ పొట్టిగా కుదిమట్టంగా వున్న ఓ బ్రాహ్మడు ధనంజయతో అన్నాడు.
“అలాగా…. చాలా సంతోషం. ఇప్పుడేం చేస్తున్నారూ?” కుతూహలంగా అన్నాడు ధనంజయ.
“నిజం చెపితే ఏమీ చెయ్యనండీ. ఇక్కడికొచ్చిన ప్రతివాళ్ళనీ పలకరించి, ఓ ప్రశ్న వేస్తాను. సరైన సమాధానం ఇస్తే సంతోషిస్తా. లేకపోతె వారిదారిని వారిని పోనిచ్చి, నా దారిన నేను పోతా” అన్నాడు సర్వేశ్వరశాస్త్రి.
“భలే వుందే… అయితే నన్ను కూడా అడుగుతారా?” కుతూహలంగా ముందుకి వంగి అన్నాడు ధనంజయ.
“అందుకేగా వచ్చిందీ” నవ్వాడు సర్వేశ్వరశాస్త్రి. “అడగండి మరి” నవ్వాడు ధనంజయ.
“ఎప్పటికీ మారనిది ఏది?” ” సూర్యుని వెలుగు, చంద్రుని వెన్నెల” ఠక్కున జవాబు చెప్పాడు.
“మారుతున్నై.
ఇక్కడి పగలు అమెరికాలో రాత్రి. అక్కడి పగలు ఇక్కడి రాత్రి. అంతే కాదు. సోలార్ ఎనర్జీనేగా కూలర్ లో దూరి చల్లదనాన్నిచ్చేదీ!” నవ్వాడు శాస్త్రి. “మీరు చెప్పేది కరక్టే అయినా …” చర్చించబోయాడు ధనంజయ.
“అయ్యా మీరెంతగా చర్చించినా, నేనూ సైన్సు ప్రకారం అంత లోతుగానూ చర్చించగలను. అందుకే ఓపికగా చెబుతున్నా. మీ సమాధానం నాకు తృప్తినివ్వలేదు” నమస్కరించి మెట్ల వెనకనున్న దారి పట్టాడు శాస్త్రి. ఓ నిముషం షాక్ తిని ఆ తరవాత కాసేపటికి బయల్దేరి వెళ్ళిపోయాడు ధనంజయరావు.
డొక్కు సైకిలు తొక్కుతూ మడుగు దగ్గర ఆగాడు ‘దీన్’. దీన్ పూర్తి పేరు దీన్ దయాళ్. పరమ నిరుపేద. ఆ సైకిలు కూడా వాళ్ళ తాత నుంచి వారసత్వంగా వచ్చిందే. అప్పటికే దీన్ ను శాస్త్రి గారు ప్రశ్నించడం అయిపొయింది. “పేదరికం” జవాబిచ్చాడు దీన్. “కానేకాదు. పేదగా ఎవరైనా పుట్టొచ్చు. అందులోంచి బయటపడటానికి లక్ష మార్గాలున్నాయి. అంతెందుకూ, నిరుపేదగా పుట్టి కోట్లకి పడగలెత్తినవాళ్ళు ఎంతమంది లేరూ!” పెదవి విరి చి అన్నాడు శాస్త్రిగారు. “అవును. నాలాంటి మూర్ఖుడు తప్ప ఎవడూ నిప్పచ్చరంగా బత కడు” లేచి నిట్టూరుస్తూ సైకిల్ స్టాండు తీశాడు దీన్ దయాళ్.
ఓహ్! మీరు హీరోయిన్ ఫలానా కదూ! మీ సినిమాలు చాలా చూశాను. మిమ్మల్ని నేనో ప్రశ్న అడుగుతా, జవాబు చెప్పరూ!” ప్లీజింగ్ గా ప్రశ్న అడిగాడు శాస్త్రిగారు. “హీరోయిన్ వయసు” పకపకా నవ్వింది హీరోయిన్. “అవన్నీ పాతరోజులు. ఆధార్ కార్డూ, పాన్ కార్డూ, డిజిటల్ హెల్త్ కార్డూ, రేషన్ కార్డూ, ఇలా లక్షా తొంభై కార్డులొచ్చాక ఎవరి వయసూ ఎవరూ దాచలేరు” నవ్వాడు శాస్త్రిగారు. విసవిసా కారెక్కింది హీరోయిన్.
“అయ్యా, నేను అతి అందవిహీనమైనదాన్ని. నిరక్షరకుక్షిని. నన్నెందుకీ ప్రశ్న అడిగారో తెలీదు గానీ, ఒకటి మాత్రం చెప్పగలను. మాలాంటి వాళ్ళ ‘fate’ అంటే నుదుటిరాత మాత్రం మారదు” నిట్టూర్చింది వనజాక్షి.
“హో..హో.. పొరబాటమ్మా. మైకేల్ జాక్సన్ శరీరం మొత్తాన్ని తెల్లగా మార్చుకోలేదూ! ఏ చదువూ రానివాళ్ళు డాక్టరేట్లు కొనుక్కోవటం లేదూ! సంకల్పముంటే అన్ని రాతలూ మారతై” చెప్పాల్సింది చెప్పి నడిచిపోయాడు శాస్త్రి.
ఓ కంప్యూటర్ ఇంజినీరు, ఓ డాక్టర్, ఓ గొప్ప సివిల్ కాంట్రాక్టర్, ఓ పేరెన్నికగన్న క్రిమినల్ లాయర్, ఓ టీచర్, ఓ చర్చి ఫాదర్, ఓ ఆలయ పూజారి, ఓ మౌలాజీ, ఓ సర్దార్జీ, ఓ పనిమనిషి, ఓ బిజినెస్ మాన్, ఓ స్టూడెంట్, ఓ ప్రేమికుడు, ఓ వేదాంతి, ఓ గూండా, ఓ రౌడీ, ఓ అపరిచితుడు, ఓ అనామకుడు ఇలా వస్తూనే వున్నారు, శాస్త్రి గారు తన ప్రశ్నకి సరైన సమాధానం దొరక్క చిక్కిపోతున్నాడు శాస్త్రి.
అప్పుడు ఎర్రగా, పొడుగ్గా, లావుగా వున్న ఒకాయన మందీ మార్బలంతో, గన్ మెన్లతో, అనుచరులతో, అభిమానులతో ‘మడుగు’ దగ్గరికి వచ్చాడు. ఆయన సర్వేశ్వర శాస్త్రి ప్రశ్న విని,
“అయ్యా, ముందర అసలు మీరెండుకు అందర్నీ యీ ప్రశ్న అడుగుతున్నారో సిన్సియర్ గా నాకు జవాబు చెబితేగానీ, నేను జవాబు చెప్పను” శాస్త్రిని నిలదీశాడు.
“స్వామీ, నా బిడ్డను ఓ నాగుపాము కరిచింది. బతికించమని దాన్నే వాడుకున్నాను.
అప్పుడది,’ఓయీ నేనడిగే ఓ ప్రశ్నకు నువ్వు సమాధానం ఎప్పుడు చెబితే అప్పుడు నీ బిడ్డని బ్రతికిస్తా. నిజానికి నేనూ పామును కాదు… శాపవశాత్తూ పామునైన ఓ యక్షుడిని.
నేనడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పినప్పుడే నాకు శాపవిముక్తి అవుతుంది. అప్పుడే నీ బిడ్డ బతుకుతాడు’ అన్నది. అప్పటినించీ యీదారిన వచ్చినవాళ్ళనందరినీ యీ ప్రశ్న అడుగుతూనే వున్నాను” విచారంగా అన్నాడు సర్వేశ్వరశాస్త్రి.
‘ఓస్! ఇంతే కదా! దా… చెవిలో చెబుతా!” అని నవ్వుతూ సర్వేశ్వరశాస్త్రి చెవిలో జవాబు చెప్పాడు ఆ ఆసామీ. అతడు గత ముప్ఫై ఏళ్లనుంచీ ఏకగ్రీవంగా ప్రజాసేవ చేస్తున్న మహానుభావుడు. జవాబు విన్న వెంటనే పాము యక్షుడై పోయి, శాస్త్రి కొడుకుని బ్రతికించి తన దారిన యక్షలోకానికి వెళ్ళిపోయాడు. జవాబు ఏమై వుంటుందో వూహించగలరా? ప్రశ్న: ఎప్పటికీ మారనిది ఏది? ఇచ్చిన జవాబు: రాజకీయ నాయకుల బుద్ధి. బస్. ఇక చెప్పెదేముంటుందీ!
మీ భువనచంద్ర.