సప్త మోక్ష నగరాలు
హిందూ ఆధ్యాత్మికత, భక్తి తత్వానికి కేంద్రం—- కాశీ పుణ్యక్షేత్రం. అసంఖ్యాక శివలింగాల సమాహారం — కాశీ క్షేత్రం. జీవితంలో ఒక్కసారైనా కాశీని సందర్శించాలనే పవిత్ర సంకల్పం ప్రతీ హిందువు మదిలోను ఉంటుంది. కాశీ యాత్ర అనేది అనేక కారణాల రీత్యా ప్రతీ హిందువు చేయవలసి ఉంటుందని, ఇది వారి ప్రాధమిక ధర్మం అనీ కాశీ ఖండం పేర్కొంటుంది. భక్తుల ముక్తి సాధనకు సోపానం, కాశీ యాత్ర—- కాశీ యాత్ర.
కాశీ యాత్రలు పలు రకాలుగా ఉన్నవి. అవి 1. పంచ కోశి పరిశ్రమ 2. శివ యాతన యాత్రలు 3. గౌరీ యాత్ర 4. నవ గ్రహ యాత్ర 5. ఏకా దశ మహారుద్ర యాత్ర. 6. జయ తీర్థ యాత్ర 7. అంత గ్రహ యాత్ర 8. దుర్గా దేవి యాత్ర .
ప్రతీ ఏటా కోట్లాది మంది కాశీ క్షేత్రాన్ని సందర్శించుకుంటారు. కానీ అందులో చాలా మంది అసలు కాశీ యాత్ర ఎందుకు చేయాలి? ఎలా చేయాలి? అక్కడ నిర్వహించ వలసిన క్రతువులు ఏమిటి ? వాటిని ఎవరు నిర్వహిస్తారు? కాశీ యాత్రలో సందర్సించవలసిన ప్రదేశాలు ఏవి? అసలు కాశీ యాత్ర అర్ధం పరమార్ధం ఏమిటి? అనే పలు విషయాల పట్ల సరైన అవగాహన ఉండదు. ఈ అంశాలను తెలుసుకునే ప్రయత్నం ఇప్పుడు చేద్దాం.
కాశీ యాత్రను ప్రధానంగా చేసేది పితృ కర్మలను నిర్వహించడం కోసం అనేది చాలా మందికి తెలిసిన విషయమే. అయితే ఈ యాత్రలను కాశీ లోనే ఎందుకు నిర్వహించాలి? అని అంటే కాశీ అనేది పవిత్ర జీవనది గంగానది ఒడ్డున, హిందూ మతానికి కేంద్ర బిందువుగా వెలసిన అత్యంత మహిమాన్వితమైన క్షేత్రం కాబట్టి చెప్పవలసి ఉంది. కాశీయాత్రనే కాశీ పరిక్రమ అని కూడా ఉంటారు. కాశీనే వారణాసి, బెనారస్ అని కూడా పిలుస్తారు. పైన ప్రస్తావించిన పలురకాల కాశీ యాత్రలన్నీ సంవత్సరములోని వివిధ సమయాలు, సందర్భాలలో జరుగుతాయి. కాశీయాత్ర అనేది సర్వ పాపాలనూ హరించే మహిమ గల యాత్ర అనేది హిందువుల బలమైన విశ్వాసం. ఇది మోక్ష ప్రాప్తిని కలిగిస్తుంది. కాశీలో పితృ దేవతలకు తర్పణాలు, వారిని సంతుష్టి పరిచే కర్మలు నిర్వహించినవారికి ఆ పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. దీనితో పాటు కాశీలోని ఇతర పుణ్య ప్రదేశాలను కూడా సందర్శించుకోవాలి. కాశీ ప్రదేశమంతా ఎంత పుణ్యప్రదమైనదంటే ప్రతి అణువులోనూ కాశీ విశ్వేశ్వరుడు కొలువై ఉంటారు.
కాశీయాత్రలోని. ఆంతర్యం, అంతరార్ధం
పవిత్ర గంగానదీ తీరంలో హిందూమత ఆధ్యాత్మిక ఆత్మగా వెలసిన అతి పురాతన పట్టణం కాశీ పట్టణం. కాశీ, వారణాసి, బెనారస్ వంటి పలు పేర్లతో పిలువబడే ఈ కాశీ క్షేత్రం ఏంటో పవిత్ర పట్టణం దివంగతులైన పెద్దల ఆత్మలకు శాంతి కలిగించే పలు క్రియలకు వేదిక కాశీ సాధారణంగా పితృ తర్పణ కార్యాలను పవిత్ర నాదీ తీరాలలో చేయడం మంచిదైతే కాశీలో గంగానది తీరంలో నిర్వహించడం అత్యంత పుణ్యప్రదం. కాశీలోని కాకుండా ఇటువంటి కర్మలను ఆచరించే యాత్రను మూడు ప్రదేశాలలో నిర్వహిస్తారు. అందులో మొదటిది ‘గయ’. బుద్ధుడు ఆత్మజ్ఞానాన్ని పొందిన పవిత్ర ప్రదేశం గయ. అలాగే అలహాబాద్ లోని ప్రయాగ రెండవ పుణ్యప్రాంతం. ఇది గంగ, యమున, సరస్వతి నదుల పవిత్ర సంగమ క్షేత్రం. మూడవది రామేశ్వరం. కాశీయాత్ర అంటే కేవలం కాశీ పట్టణాన్ని మాత్రమే సందర్శించడం కాదు. అతి పురాతనమైన, అత్యంత శక్తివంతమైన రెండు జ్యోతిర్లింగ శివ క్షేత్రాలను సందర్శించడం వలెనే కాశీయాత్ర సంపూర్ణమవుతుంది. అది ఒకటి విశ్వనాథుడు కొలువైన క్షేత్రం, రెండవది రామేశ్వరుడు కొలువైన రామేశ్వర క్షేత్రం.
అయిటర్ కాశీకి పోవాలన్న ప్రతి ఒక్కరూ కాశీకి వెళ్లి కాశీ విశ్వనాధుని, విశాలాక్షిని దర్శించుకోలేరు. కారణం గత జన్మలో ఎన్నెన్నో ఆలయాలను దర్శించుకుని పూజించినవారికే, ఈ జన్మలో కాశీ తలుపులు తెరచుకుంటాయి అని చెబుతుంది శివపురాణం. ఏడు ముక్తిక్షేత్రాలలో ఒకటిగా కీర్తించబడుతున్న కాశీలో పన్నెండు జ్యోతిర్లింగేశ్వరులలో ఒకరైన శ్రీ విశ్వనాథుడు కొలువై భక్తులను అలరిస్తున్నాడు. ‘ఈ పవిత్ర భూమిని నా నివాస యోగ్యంగా మార్చుకున్నాను, ఇకపై ఈ నగరాన్ని వదిలి ఒక్కరోజూ బయటకు వెళ్ళలేను’ అంటూ విశ్వనాథుడు ప్రమాణపూర్తిగా చెప్పినట్టు లింగపురాణంలో ఉంది.
కాశీ అనే పేరుకు కాంతి నిచ్చే స్థలం అని అర్ధం. జగద్గురు ఆది శంకరాచార్య, తులసీదాసు, కబీరు, గౌతమ బుద్ధుడు దర్శించిన పుణ్యధామం ఇది. అతి పురాతనమైన ఈ నగరానికి వయసు నాలుగు సంవత్సరాలకు పైనే. ఇంకా గంగానదికి ఉత్తరంగా ‘వరుణ’ నది, దక్షిణాన ‘ఆసి’ నది సంగమిస్తున్నాయి. ఈ రెండింటికి మధ్య ఉన్న నగరమవడం వలన వరుణ + ఆసి = వారణాసిగా ఈ స్థలం పిలువబడుతోంది.
హిందూ పురాణాలలో సైతం అతి పవిత్ర ప్రాంతంగా చోటు చేసుకున్న అతి పురాతన పట్టణం కాశీ పట్టణం. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది హిందువులు తమ అంత్య కాలాన్ని కాశీలో గడపాలని కోరుకుంటారు. కాశీలో మరణిస్తే అది నేరుగా స్వర్గానికి చేరుస్తుందనే ప్రగాఢ విశ్వాసం హిందువులలో నెలకొని ఉన్నది. అందుకే విశ్వనాధ ఆలయానికి దగ్గర ఉన్న మణికర్ణికా ఘాట్ లో రోజూ వందలాది మృతదేహాలను అగ్నికి ఆహుతి చేసి అస్థికలను, చితాభస్మాన్ని గంగలో కలిపివేస్తారు. అలా కోరిక తీరనివారు, చనిపోయిన తర్వాత వారి చితాభస్మాలను గంగలో కలిపితే ఏంటో శాంతి పొందుతారు అనే నమ్మకంతో ఎంతోమంది ‘ఆస్థి విసర్జన’ కార్యక్రమములను నిర్వహిస్తూంటారు. హిమాలయాలలో పుట్టి బంగాళాఖాతంలో కలిసేవరకూ గంగమ్మ ఏంటో పవిత్రమైనది. ఒక్కసారి స్నానం చేసినా, స్పృశించినా వారి పాపాలను హరించే మహిమ గంగానదికి ఉన్నాడని యాత్రికుల విశ్వాసం. అందుకు తార్కాణంగా స్వయంగా విశ్వనాధుడే తన సతి విశాలాక్షికి ‘గంగామహిమ’ తెలియ పరచాడు.
విగతజీవుడైన తన భర్త తలని ఒడిలో పెట్టుకుని ఏడవసాగింది ఒక వృద్ధురాలు. ఆ హృదయ విదారకమైన దృశ్యాన్ని యాత్రికులంతా చూస్తున్నారు. ‘ఏయ్ ముసలీ, శవాన్ని ఇక్కడ పెట్టుకుని రోదిస్తావెందుకు? దహనం చేయవచ్చు కదా’ అని అన్నారు చుట్టూ ఉన్న వాళ్ళు. ఆ వృద్ధురాలు మరింత దుఃఖంతో ‘అయ్యా! నా భర్త చనిపోయేముందు ఓ కోరికను కోరాడు. ఇంతవరకు జీవితంలో ఒక్క పాపం కూడా చేయని వ్యక్తి తనకు దహన సంస్కారాలు చేయాలన్నది ఆయన కోరిక. మాకు సంతాన భాగ్యం కూడా లేదు. మీలో ఎవరైనా పాపం చేయనివారు నా భర్తకు అంత్యక్రియలు చేసేందుకు ముందుకు రండి: అని అభ్యర్థించడం ఆలస్యం, ఆ గుంపు చెదిరిపోసాగింది!
‘ఈ ప్రపంచంలో ఒక్క పాపం కూడా చేయకుండా ఉండటమా?’ అనుకుంటూ వెళ్ళసాగారు. గంటలు గడుస్తున్నా ఏ ఒక్కరూ ముందుకు రాలేదు. ఒక యువకుడు అక్కడకి వచ్చాడు. విషయం తెలుసుకున్నాడు. ‘అవ్వా! మీ ఆయనకు నేను అంత్యక్రియలు చేస్తాను. నేను నాకు తెలిసినంత వరకు ఏ పాపమూ చేయలేదు. ఒకవేళ నాకు తెలియకుండా ఏమైనా పాపాలు చేసివుంటే, ఆ కాశీ విశ్వనాధుడిని ప్రార్ధించి, గంగలో స్నానం చేస్తాను’ అని చెప్పి ఆ వృద్ధునికి అంత్యక్రియలు చేసేందుకు ఉపక్రమించాడు. వెంటనే ఆ వృద్ధుడు, వృద్ధురాలు కాశీ విశ్వనాథుడు, విశాలాక్షిగాప్రత్యక్షమయ్యారు. ఆ యువకుని ఆశీర్వదించారు. ఈ కథ విన్నవారికి గంగానది పవిత్రత, అందు స్నానం చేస్తే సర్వపాపాలు హరింపబడతాయని సుబోధమవుతుంది.
యాత్రికులు కాశీలో ఉన్న ఆలయాలను ఒకదాని వెంబడి రెండవ దానిని భక్తితో దర్శనం చేసుకుంటారు. హైందవ సాంప్రదాయాలపై నమ్మకమున్నవారు కనీసం తొమ్మిది రోజులు కాశీలో నిద్ర చేసి, కాశీ విశ్వేశ్వరనాధుని దర్శనం చేసుకుంటూ నియమబద్ధమైన జీవితాన్ని గడిపి ధన్యులవుతారు. గంగా స్నానమాచరించిన పిమ్మట భక్తులు ప్రధమంగా కాశీనగరం క్షేత్ర పాలకుడైన కాలభైరవ ఆలయాన్ని దర్శించటం ఒక అలవాటు.
పూర్వం బ్రహ్మదేవునికి తానే సర్వాధికారినన్న గర్వం పొడచూపింది. శివహేళన చేయసాగాడు. ఒకానొక దశలో అక్కడ ప్రత్యక్షమయిన శివుడు తన ఆవులింత నుండి భైరవుని సృష్టించి, బ్రహ్మ ఐదవ తలను త్రుంచివేయమన్నాడు. వెంటనే భైరవుడు బ్రహ్మ ఊర్ధ్వముఖాన్నిత్రుంచివేయగా, అతనికి బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంది. శివుని ఆజ్ఞతో భైరవుడు బ్రహ్మ కపాలాన్ని చేతిలో ధరించి, భిక్షాన్ని స్వీకరిస్తూ కాపాలికా వ్రతంతో సంచరించసాగాడు. చివరకు భైరవుడు కాశీ నగరం ప్రవేశించగానే బ్రహ్మ కపాలం నేలపై పడిపోయింది. అప్పటినుండి భైరవుడు విశ్వేశ్వరుని ఆజ్ఞపై కాశీ నగర క్షేత్రపాలకుడిగా పదవి పొంది, అక్కడ కొలువై, తనను దర్శించుకున్న భక్తుల మనోరధాలు నెరవేర్చిమ్ వారి పాపాలను పోగొడుతున్నాడు.