ప్రేమంటే ఇంతే

(గతసంచిక తరువాయి)

అనూరాధకి ఇల్లంతా చూపించారు కృష్ణమోహన్ దంపతులు. ఆ ఇల్లు చూసి రుక్మిణి ఇల్లు ఎంత అందంగా వుంచిందో అనుకొని అదే మాట రుక్మిణితో అంది. పెద్దవాళ్ళు ముగ్గురూ హాల్లో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. 

“మన అతిధికి ఒక వేడి కాఫీ ఇవ్వవా?” అని సడన్గా అన్నాడు కృష్ణమోహన్.

“ఇప్పుడు పదకొండు అవుతున్నాది, ఇప్పుడు కాఫీ ఏమిటి” అని లేస్తున్న రుక్మిణి చెయ్యి పట్టుకొని కూర్చోపెట్టింది అనూరాధ.

“అబ్బే అది మీ మీద ప్రేమతో కాదు, ఆయనకి కాఫీ కావాలి” అంటూ వంటింట్లోకి వెళ్ళింది రుక్మిణి. 

“ఏమిటి మేడం తమరు ఎప్పుడూ రాత్రి పదకొండు గంటలకి కాఫీ తాగలేదా?” అని రాధ కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు కృష్ణమోహన్. 

“షటప్, అవన్నీ ఇప్పుడెందుకు?” అని కళ్ళతో మందలించింది అనూరాధ. 

రుక్మిణి తెచ్చిన కాఫీ త్రాగి మరో అర గంట కబుర్లు చెప్పుకున్నాక, రుక్మిణి పిల్లలున్న గదిలోకి వెళ్ళి “సుప్రియ, ఆంటీ ఇక్కడ పడుకుంటారు, నువ్వు ఇవాల్టికి హాల్లో పడుకో” అని వంశీతో చెప్పి అక్కడ బెడ్ షీట్స్ తలగడ గలీబులు అవి మార్చి అనూరాధ పడుకోడానికి ఏర్పాట్లు చేసింది. 

“సార్ మా అపాయింట్మెంట్ గురించి ఏమిటి ఆలోచించారు?” అంది రాధ.

“డోంట్ వర్రీ, నాకు గుర్తుంది. సబర్ రఖో…రాధా ఇంక పడుకో, ప్రొద్దున్నే ఎనిమిది గంటల కల్లా బయలుదేరి మనం అవినాష్ ఇంటికి వెళదాము” అన్నాడు కృష్ణమోహన్. 

“మీరు, సుప్రియ పిల్లల గదిలో పడుకోండి” అని అనూరాధతో అంది రుక్మిణి.

“మళ్ళీ మీరు అంటున్నావు…ఎందుకు వాళ్ళిద్దరు కబుర్లు చెప్పుకుంటూ అక్కడ పడుకుంటారు, నేనిక్కడ హాల్లో పడుకుంటాను” అంది అనూరాధ.

“వద్దు వాళ్ళిద్దరినీ వదిలేస్తే రాత్రంతా కబుర్లు చెప్పుకుంటూనే వుంటారు, వంశీ ఇక్కడ పడుకుంటాడు” అంది రుక్మిణి.

“ఓకే రాధా, గుడ్ నైట్” అన్నాడు కృష్ణమోహన్.

నలభై ఆరవ భాగం 

ప్రొద్దున్నే ఐదు గంటలకల్లా రుక్మిణి లేచి కాలకృత్యాల తరువాత పూజా కార్యక్రమం పూర్తి చేసుకొని వచ్చేటప్పటికి రాధ కూడా లేచింది. అప్పుడు సమయం ఐదూ ఏభై అయింది. “గుడ్ మార్నింగ్, రాత్రి నిద్ర పట్టిందా, ఇంకాస్సేపు పడుకోలేక పొయావా?” అంది రుక్మిణి.

“వెరీ గుడ్ మార్నింగ్, నాకూ ఐదున్నరకి లేవటం అలవాటు”

“OK ఫ్రెష్ అవు, కాఫీ కలుపుతాను” 

“బావ లేచాక తాగుదాము” 

“ఆయన రోజూ ఏడు, ఏడున్నరకి లేస్తారు, శెలవు రోజున ఎనిమిది దాకా పడుకుంటారు. ఎనిమిది గంటలకి అవినాష్ ఇంటికి వెళ్ళాలి కనుక ఇవాళ ఏడింటికి లేపమన్నారు. అందుకని కాఫీ త్రాగి నువ్వు తెమిలిపో”

“బాగుంది చిన్న పిల్లలలాగ లేపడం కూడానా! అయ్యగారికి బద్దకం బాగా పెరిగినట్లుంది” 

“రాత్రి ఆలస్యంగా పడుకుంటారు అందుకని ఆలస్యంగా లేస్తారు, కానీ ముఖ్యమైన పని వుంటే ఆయనే ముందు లేస్తారు”

“బెంగాల్లో పుట్టినందుకు ఆ అలవాట్లు వచ్చాయని వేళాకోళం ఆడేవాడు” అంది అనూరాధ. ఇద్దరూ నవ్వుకున్నారు.

ఏడు గంటలకి కృష్ణమోహన్ లేచి హాల్లోకి వచ్చి “గుడ్ మార్నింగ్ రుక్కు అండ్ రాధా” అన్నాడు.

“గుడ్ మార్నింగ్, మీ ఆవిడ లేపకుండానే లేచావు కొంపదీసి మా మాటలు విన్నావా?” అంది అనూరాధ.

“అంటే నా గురించి మీరిద్దరూ ఉన్నవీ, లేనివీ చెప్పుకొని మీ ఇద్దరూ నాతో పడ్డ కష్టాలు ముచ్చటించుకున్నారన్నమాట” 

“బెడ్ కాఫీ కావాలా? తరువాత ఇవ్వనా, తొందరగా తెమలండి” అంది రుక్మిణి

“కాఫీ ఇచ్చెయ్యి, ఏకంగా స్నానం చేసి వస్తాను” 

కృష్ణమోహన్ రడీ అయేసరికి బ్రేక్ఫాస్ట్ తయారు చేసి అనూరాధ, కృష్ణమోహన్లకి డైనింగ్ టేబుల్ మీద పెట్టి “అనూ రా టిఫిన్ పెట్టాను” అని పిలిచింది రుక్మిణి. 

టేబుల్ దగ్గరకి వచ్చి రెండు ప్లేటులే వుండటం చూసి “నీకో” అని అడిగింది అనూరాధ.

“నేను తరువాత పిల్లలతో తింటాను” అంది రుక్మిణి.

“అదేమిటి నువ్వు మాతో రావా?” 

“సారీ నేను రావడంలేదు మీరిద్దరూ వెళ్ళి రండి, రేపు సుప్రియ ప్రయాణం, తను తీసుకువెళ్ళవలసిన వస్తువులు సమకూర్చాలి, పనిమనిషి వస్తుంది బట్టలు ఉతికించాలి. అదీగాక మూడురోజులైంది ఇల్లు వదిలి కాస్త సర్దాలి”. రుక్మిణి కావాలనే వారిద్దరినీ పంపించి ఏకాంతంగా మాట్లాడుకోవడానికి అవకాశం కల్పిస్తున్నాదని అనూరాధకి అర్ధం అయ్యింది. ఇంతలో కృష్ణమోహన్ వచ్చి కూర్చుని, టిఫిన్ తింటూ “మనిద్దరమూ వెళ్లోద్దాము, రేపు సుప్రియ ప్రయాణం కదా రుక్కూ బిజీగా వుంటుంది” అన్నాడు. 

కృష్ణమోహన్, రాధ కారులో ఎనిమిది గంటల కల్లా బయలుదేరారు. స్టీరియో ఆన్ చేస్తే అందులో మళ్ళీ “మెరె సపునోకి రాని కబ్ ఆయేగితూ” పాట వచ్చింది. ఆ పాట తను కూడా పాడుతూ నడుపుతున్నాడు. 

“ఇంకా రాలేదా?” అని అడిగింది.

“లేదు ఇంకా కాస్త దూరం వుంది” 

“ఏమిటి”

“అవినాష్ ఇల్లు”

“బాబూ నేనడిగింది అవినాష్ ఇల్లు కాదు”

“పాట గురించా, ఒకరు కాదు ఇద్దరు వచ్చారు” 

ఇంతలో స్టీల్ ప్లాంట్ పైలాన్, ఎంట్రన్స్ దగ్గర ఆర్చ్ కనబడి “ఇదేమిటి అవినాష్ సీతమ్మధారలో వుంటున్నాడని చెప్పావు, మనం స్టీల్ ప్లాంట్ దగ్గర వున్నాము, అసలు మనం ఎటు వెళుతున్నాము” అని అడిగింది రాధ. 

“అన్నవరం” 

“మతి గాని పొయిందా మనిద్దరమూ అన్నవరం వెళ్ళడమేమిటి? ఈ విషయం మీ ఆవిడకి తెలిస్తే నన్ను హైదరాబాద్ దాకా తరిమి తరిమి కొడుతుంది, ఇంకెప్పుడు వైజాగ్లో అడుగుపెట్టనివ్వదు”

“థాంబా, ఈ అన్నవరం ట్రిప్ సలహా మా ఆవిడే ఇచ్చింది” 

“నీ మరాఠీ మంచిగుంది బిడ్డా, కాని అబధ్ధం చెబితే అతికనట్లుండాలె”. కృష్ణమోహన్ వేళాకోళమాడుతున్నాడని అర్ధం చేసుకొని తను కూడా తనకి వచ్చిన తెలంగాణా యాసలో సమాధానం చెప్పింది. 

“నిజం” అని అ రోజు అవినాష్ ఇంటి నుండి తిరిగి వస్తునప్పుడు తనకి రుక్మిణి మధ్య జరిగిన సంభాషణ గురించి చెప్పాడు. 

“ఓహ్ మై గాడ్ నిజంగానా, మీ ఆవిడ మంచి మనసున్న వ్యక్తి, ఉత్తమురాలు అని మాత్రమే అనుకున్నా కానీ చాలా తెలివిగలది, ఖతర్నాక్” 

“మనం ఏకాంతంగా కలసుకొని మన కష్టసుఖాలు మాట్లాడుకొంటే మన మనసులలో వున్న వేదన దూరమవుతుందని మనకి సహృదయంతో ఈ అవకాశం కల్పిస్తే నువ్వు తనని ఖతర్నాక్ అంటావా?” 

“నాయనా మీ ఆవిడని నేను ఏమీ అనలేదు, ఆవిడ తెలివితేటలని పొగిడాను” అని “దొంగాడి చేతికి తాళం ఇచ్చింది” అంటూ ఏడిపించింది. ఆ మాటకి ఇద్దరూ నవ్వుకున్నారు. 

ఎలమంచిలి బైపాస్ రోడ్డులో ఒక ధాభా దగ్గర కారు ఆపి “ఏమిటి తిందాము?” అని అడిగాడు

“ఇంట్లో కడుపునిండా మీ రుక్మిణి చేసిన బ్రేక్ఫాస్ట్ తిన్నాక కనీసం మధ్యాహ్నం రెండు గంటల దాకా నాకు ఆకలి వెయ్యదు, నీకు కావాలంటే ఆర్డర్ చెయ్యి”… ఆ “మీ” అన్న పదాన్ని వత్తి పలుకుతూ అంది.

“సరే నాదీ మా రాధ పరిస్థితే, కాఫీ తాగుదాము”… ఆ “మా” అన్న పదాన్ని వత్తి పలుకుతూ అన్నాడు. 

“నువ్వు ఎంత వత్తి పలికినా నేను నీ దాన్ని కానుగా?” అని బాధగా అంది రాధ. ఆమె స్వరంలో మార్పు గమనించాడు కృష్ణమోహన్. 

“ఎవరు చెప్పారు నువ్వు నాదానివి కావని, అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ నువ్వు నాదానివే, నేను నీవాడినే”

“ఏమిటి మాట్లాడుతున్నావు, మనిద్దరికీ పెళ్ళిళ్ళు అయి ఎవరి జీవితం వాళ్ళు జీవిస్తున్నాము, మన పిల్లలు పెద్ద వాళ్ళయ్యారు. ఈ జన్మలో మనిద్దరమూ భార్యా భర్తలయే అదృష్టాన్ని ఆ భగవంతుడు ఇవ్వలేదు” అంటూ కన్నీరు పెట్టుకుంది అనూరాధ.

“ఏయ్ రాధా! ఏమిటిది, నిజమే ఈ జన్మలో మనం భార్యా భర్తలు కాలేకపోయాము, అది దైవ నిర్ణయం. దైవం ఏమి చేసినా మన మంచికేనని నమ్మే మనుషులం మనము, అందుకే ఆ దైవ నిర్ణయాన్ని శిరసావహిస్తున్నాము” అని కృష్ణమోహన్ ఆమెని ఓదార్చాడు. 

“కృష్ణా, నాకు ఒక కోరిక వుంది ?” అంది అనూరాధ.

“ఏమిటది?”

“ఇప్పుడే ఈ క్షణమే నీతో కబుర్లు చెబుతూ ఇలా ఇక్కడే ప్రాణం వదిలేయాలని వుంది” అంది అనూరాధ.

కృష్ణమోహన్ ఉలిక్కిపడి “రాధా” అని గట్టిగా అరచి తన కుడి చేతితో రాధ నోరు మూసాడు. 

“మనిద్దరమూ ఒకటి కాలేకపొయినా, ఇరవై మూడేళ్ళు నిన్ను చూడకపొయినా, నువ్వు వున్నావని నన్ను నేను సమాధాన పరచుకుని జీవించాను” అని చాలా ఉద్వేగంతో అన్నాడు. 

“ఐ యాం సారీ కృష్ణా, ఎమోషన్లో ఎదేదో మాట్లాడి నీ మనసు నొప్పించాను”

ఓకే, టైం తొమ్మిదిన్నర దాటింది, ముందు సత్యనారాయణస్వామివారి దర్శనము చేసుకొని, మళ్ళీ ఇక్కడికే వచ్చి భోజనం చేసి ఇక్కడనుండి పూడిమడక బీచ్కి వెళ్ళి అక్కడ కూర్చుని కబుర్లు చెప్పుకుందాము, ఇక బయలుదేరుదాము” అన్నాడు.

అన్నవరం కొండమీదకు చేరుకొనేసరికి పదకొండు అయింది. స్వామి వారి దర్శనానికి వెళ్లి, ఇద్దరూ తమ గోత్ర నామాల మీద అర్చన చేయించుకున్నారు. స్వామి విగ్రహాన్ని చూస్తూ తన్మయత్వంలో మునిగిపొయారు. 

“రాధ జీవితంలో అంతా మంచే జరగాలి, రాధ, పిల్లలు ఇక ఎటువంటి కష్టాలు పడకుండా వాళ్ళకి మంచి ఆయురారోగ్యాలని, సంతోషాన్ని, సుఖాన్ని ప్రసాదించు స్వామి” అని కోరుకున్నాడు కృష్ణమోహన్. 

“కృష్ణకి రుక్మిణి లాంటి మంచి ఉత్తమురాలిని భార్యగా ఇచ్చావు, నాకు చాలా ఆనందంగా వుంది. వాళ్ళిద్దరూ వాళ్ళ పిల్లలతో కలసి నిండు నూరేళ్ళు ఆరోగ్యవంతంగా, సంతోషంగా, సుఖంగా జీవించాలని వాళ్ళని ఆశీర్వదించు స్వామి” అని అనూరాధ కోరుకుంది. 

దర్శనము చేసుకొన్న తరువాత ప్రసాదం కొనుక్కొని ఇద్దరూ కాస్త తిని మిగతాది ఇంట్లో వాళ్ళ కోసం వుంచారు. అక్కడ వున్న పంపా నదిని చూస్తూ తమ గత అన్నవరం యాత్రా విశేషాలని ముచ్చటించుకున్నారు. 

“నాకు ఎప్పుడు అన్నవరం వచ్చినా ఎంతో మనశ్శాంతిగా వుంటుంది. స్వామివారి విగ్రహాన్ని ఎంతసేపు చూసినా తనివితీరదు” అన్నాడు కృష్ణమోహన్. 

“అవును ఇక్కడ ఈ కొండమీద నుండి చూస్తే ఆ రెండు కొండల మధ్యనుండి ప్రవహిస్తున్న పంపానదిని చూస్తూ వుంటే ఎంతో ఆహ్లాదకరంగా వుంటుంది” అంది రాధ. 

కారులో కూర్చుని బయలుదేరబోతూ వుంటే ఒక పేద బ్రాహ్మణుడు వచ్చి “అయ్యా! నేనొక వేద పండితుడిని, చితికిపొయాను, అయినవాళ్ళందరూ పోయి ఒంటరిగా జీవిస్తున్నాను, నా వయసు డెబ్బైఐదు సంవత్సరాలు, కడుపునిండా తిని మూడు రోజులయింది. కష్టపడి పని చెయ్యడానికి శక్తి లేదు, బిచ్చమెత్తుకోవడమంటే అభిమానం అడ్డువస్తున్నాది, కానీ ఈ ఆకలి చేసే విలయ తాండవం ముందు నా మానాభిమానాలు నామరూపాలు లేకుండా నలిగిపోతున్నాయి, నాకు కడుపునిండా భోజనం పెట్టిస్తారా” అని కళ్ళ వెంబడి నీళ్ళు కారుతుండగా ఏడుస్తూ ఎంతో దీనంగా అడిగాడు. 

అది చూసిన కృష్ణమోహన్కి, రాధకి కళ్ళలో నీళ్ళు తిరిగాయి. వెంటనే ఇద్దరూ కారు దిగి ఆ బ్రాహ్మణుని చెయ్యి పట్టుకొని హోటలుకి తీసుకొని వెళ్ళి, అక్కడ మేనేజర్తో మాట్లాడి ఆయన తినినంతా పెట్టమని చెప్పారు. 

ఆ బ్రాహ్మణునితో “అయ్యా మీరు మొహమాట పడకుండా భోజనం చెయ్యండి, నేను డబ్బు చెల్లించాను. మీరు కడుపు నిండా తిని తృప్తి చెందిన తరువాతే మేము బయలుదేరుతాము” అన్నాడు కృష్ణమోహన్. 

ఆ బ్రాహ్మణుడు భోజనం చేసిన తరువాత “ఆ లక్ష్మీనారాయణులే వైకుంఠం నుండి దిగివచ్చి ఈ రోజు నా క్షుధ్బాధని తీర్చారు. అయ్యా నేను ఏమిచ్చి మీ ఋణం తీర్చుకోగలను, ఆకలితో వున్న నన్ను అదరించి నా ఆకలి తీర్చారు. మీకు శతకోటి నమస్కారాలు” అంటూ నమస్కారం చేయబోతూ వుంటే కృష్ణమోహన్ అతని చేతులు పట్టుకొని వారించి…”అయ్యా మీరు పెద్దవారు, పండితులు మీ కన్నా వయసులో ఎంతో చిన్నవాళ్ళం, మీరు మాకు అలా నమస్కరించకూడదు, మమ్మల్ని ఆశీర్వదించండి” అంటూ ఆయన చేతిలో మూడు వంద రూపాయులు పెట్టి కృష్ణమోహన్, రాధ ఆ బ్రాహ్మణుని కాళ్ళకి నమస్కరించారు.

ఆ బ్రాహ్మణుడు వారిద్దరి శిరస్సుల మీద చేయి వేసి “శతమానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం శతసంవత్సరం ధీర్ఘమాయుః శతమానం భవతి శతాయుః పురుష శ్శతేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతిథిష్ఠతి ఆయురారోగ్య ఐశ్వర్యమస్తు యశోవిభవ ప్రాప్తిరస్తు”… అని ఆశీర్వచన మంత్రం చదివి ధీర్ఘాయుష్మాన్భవ అని కృష్ణమోహన్ని, దీర్ఘసుమంగళీభవ అని అనూరాధని దీవించి…“మీ పిల్లా పాపలతో, మనుమలు, మునిమనుమలతో నిండు నూరేళ్ళూ ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో జీవించండి”అని ఆశీర్వదించాడు. 

“అయ్యా మేమిక వెళ్ళొస్తాము” అన్నాడు కృష్ణమోహన్.

“శుభం, వెళ్ళిరండి” అన్నాడు ఆ బ్రాహ్మణుడు. 

ఆ పేద బ్రాహ్మణుడు గురించే ఎవరికి వారు ఆలోచిస్తూ వున్నారు. కృష్ణమోహన్కి ఆ పండితుడి దీనావస్థ చూసి చాలా బాధ కలిగింది. అనూరాధకి కూడా అంతటి వేద పండితుడు ఈ రోజు బిచ్చమెత్తుకోవడం బాధ కలిగింది. అన్నవరం నుండి బయలుదేరిన కొంతసేపు వరకు ఇద్దరూ మౌనంగా వున్నారు.

“బావా ఆయన పరిస్థితి చూస్తే చాలా బాధగా వుంది. ఈ రోజుల్లో వేద పండితులకు సరి అయిన గుర్తింపు లేకుండా పొయింది” 

“నా హృదయం కలచి వేసింది” 

“నువ్వు చాలా సెన్సిటివ్ అయిపోయావు బావా” 

“అవును ఈ మధ్య కాలంలో కొన్ని విషయాలు నన్ను చాలా ఆవేదనకి గురి చేస్తున్నాయి. కొన్ని సినిమాపాటలు వింటున్నపుడు కూడా నేను ఉద్వేగానికి గురి అవుతున్నాను, అలాగే చాలా విషయాలలో” 

“ఎక్కువగా ఆలోచిస్తున్నావేమో”

“అయుండచ్చు”

“ఎక్కువగా ఆలోచనలు చేసి ఉద్వేగానికి గురికాకు. బావా ఒక విషయం గుర్తు పెట్టుకో ‘ఉంకొక వ్యక్తి గాని, ఏదైనా సంఘటన గాని నిన్ను నియత్రించకుండా నువ్వు ఆపిన క్షణం నుండి నీకు మనశ్శాంతి దొరుకుతుంది’ “

“అలాగే, తుని వచ్చింది కూల్ డ్రింక్ తాగుదాము కాస్త రిలీఫ్గా వుంటుందేమో” 

తుని నుండి బయలుదేరిన తరువాత “నువ్వు ప్రొద్దుననగా లేచావు మళ్ళీ బీచ్కి వెళితే అవకాశం వుండదు, అందుకని ఆ సీట్ వెనక్కి వాలుస్తాను, పాటలు వింటూ కాస్సేపు రిలాక్స్ అవు. హోటల్ వచ్చాక లేపుతాను” అన్నాడు కృష్ణమోహన్. 

“ఆ బ్రాహ్మణుడు మనిద్దరినీ భార్యా భర్తలు అనుకుని నన్ను దీర్ఘసుమంగళీభవ అని దీవించాడు, మనం విషయం చెప్పి వుండవలసింది” అపరాధ భావంతో అంది అనూరాధ.

“ఇప్పుడే అనవసరంగా ఆలోచించవద్దని నాకు సలహా ఇచ్చావు మరి నువ్వు ఏం చేస్తున్నావు? ఆయన నిష్కల్మషమైన హృదయంతో దీవించాడు. మనల్ని వైకుంఠం నుండి వచ్చిన లక్ష్మీనారాయణులు అన్నాడాయన, కాని ఆ సత్యనారయణస్వామి వారి వ్రత కధలో బ్రాహ్మణుని రూపంలో వచ్చిన స్వామి వారిలా నాకు కనబడ్డాడు” అన్నాడు కృష్ణమోహన్. 

స్టీరియోలో పాటలు వింటూ అనూరాధ నిద్రపోయింది, కృష్ణమోహన్ పాటలు వింటూ డ్రైవ్ చేస్తున్నాడు. హోటల్ వచ్చింది, ఇద్దరూ కారు దిగి వాష్రూంకి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చి కూర్చున్నారు. 

“ఆ రోజుల్లొ ఉద్యోగం చేస్తాను అనేదానివి, ఉద్యోగం చేస్తున్నావా?” అడిగాడు కృష్ణమోహన్.

“పెళ్ళి అయిన తరువాత ఆయనని అడిగితే అభ్యంతరం లేదన్నారు, అపుడు ఒక ఎడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీలో అఫీస్ అసిస్టెంట్గా చేరాను. దాని యజమానికి మా నాన్నగారి వయసు వుంటుంది. ఆయనకి ఒక్కడే కొడుకు, అమెరికాలో వుంటున్నాడు, అక్కడే సెటిల్ అయాడు. మా కంపెనీ యజమాని నన్ను తన కన్న కూతురిలా చూసుకుంటున్నారు. ప్రకాష్ పొయినపుడు చాలా సపోర్టింగ్గా వుండి ధైర్యం చెప్పి మా నాన్నగారి కంటే ఎక్కువ జాగ్రత్తగా చూసుకున్నారు. ఇపుడు మేనేజర్గా ఎదిగాను, మొత్తం కంపెనీ బాధ్యత అంతా నా మీదే పెట్టారు. మా యజమాని వారానికి ఒకసారి లేదా రెండు రోజులు మాత్రమే ఆఫీస్కి వచ్చి అన్ని విషయాలూ చూసుకుంటారు. ఏదైనా అవసరం అయితే ఫోన్లోనే గైడెన్స్ ఇస్తారు, మనది కర్ర పెత్తనమే. అందుకని ఇబ్బంది ఏమీలేదు, హాయిగా వుంది” 

“వెరీగుడ్, అటువంటి మంచి మనసున్న వ్యక్తి దగ్గర ఉద్యోగం దొరకడం చాలా సంతోషంగా వుంది”

“నీ ఉద్యోగం ఎలా వుంది? ఎన్ని ప్రమోషన్స్ వచ్చాయి? ఏమైనా అవార్డ్స్ వచ్చాయా?”

(ఇంకా వుంది)

© 2020 Chaitanyam Magazine. All Rights Reserved.