నూతన జాతీయ విద్యా విధానంపై చిన్న అవగాహన
నాస్తి గ్రామః కుతస్సీమా నాస్తి విద్యా కుతో యశః
నాస్తి జ్ఞానం కుతో ముక్తిః భక్తిర్నాస్తి కుతస్తుధీః!
గ్రామమే లేకుంటే సీమ ఎందుకు? విద్య లేకుంటే యశస్సు ఎక్కడ? జ్ఞానం లేకుంటే ముక్తి ఎక్కడిది? భక్తి లేకుంటే బుద్ధి ఉండి ప్రయోజనం ఏమిటి? అంటే వ్యక్తి జీవితం పలు అంశాలతో ఓతప్రోతమై ఉన్నది.
నేపథ్యం…
భారతీయ జీవన విధానంలో సమగ్రత ఉంది, శాస్త్రీయత ఉన్నది, సంపూర్ణత ఉన్నది. వ్యక్తి వ్యష్టి నుండి సమష్టికి ఎదిగే విధానం ప్రాతిపదికగా ప్రాచీన విద్యా విధానం రూపొందించబడింది. గురుకులాలలో గురువును సేవిస్తూ, సహ పాఠకులతో సహ జీవనం సాగిస్తూ, కష్ట సుఖాలలో అందరితో పాలుపంచుకుంటూ, అర్హతను నిరూపించుకుంటూ, విద్యార్థి విద్యాభ్యాసం చేసేవాడు. ఇది సామాన్యులకైనా, రాజకుమారులకైనా సమానమే. దీని వల్ల విద్య విలువ తెలిసేది. “అర్హత సాధించి ఆశించు” అనే భావన నిలిచేది. సహనశీలత అలవడేది. సమభావన వెలుగు చూచేది. విలువలతో కూడిన వికసన కలిగేది.
అలోచనా విధానంలో పరిణతి కలిగేది. “ఆలోచించడం ఎలా” అనేది అవగతమయ్యేది. సమస్యలు కేంద్రంగా కాక పరిష్కారం కేంద్రంగా ముందుకు సాగే దృష్టికోణం ఏర్పడేది. పనిని ప్రేమించే తత్త్వం, ఫలితాన్ని ఆస్వాదించే తత్త్వం, ఆ ఫలితాన్ని అందరితో పంచుకునే మనస్సు జాగృతమయ్యేది. స్వార్ధభావన తగ్గి విశ్వాత్మ భావన ఏర్పడేది. ఎక్కువ మందికి మేలు జరిగేందుకై అవసరం మేరకు తాను త్యాగం చేసే మానసిక స్థితి వెలుగు చూచేది. ముఖ్యంగా జ్ఞానాన్ని తెలివితేటలను విచక్షణాయుతంగా ఎలా ఉపయోగించాలో తెలిసేది.
ఈ విద్యా విధానంలో రెండు కోణాలు ఉండేవి. ఒకటి తన మూలాలను వెతుక్కునే విధానం, రెండవది తను జీవించేందుకు అవసరమైన వికాసాన్ని, అభ్యుదయాన్ని పొందేందుకు అవసరమైన విధానం. రెంటికీ మూలం… వ్యక్తిత్వ వికసన… విలువలు, నైతికత ప్రాతిపదికగా సాగే జీవనం. ఒకటి ఆధ్యాత్మిక మార్గం, రెండవది భౌతిక మార్గం. ఒకటి శ్రేయో మార్గం రెండవది ప్రేయోమార్గం. ఒకటి సుగతి నిచ్చేది రెండవది ప్రగతి నిచ్చేది. ఈ రెండూ జీవితానికి అవసరమే. ఈ రెండు కోణాలకు ధర్మాచరణ, కర్మాచరణ ఆలంబనగా నిలిచేవి. ఈ విధానంలో సరైన పనిని చేయడం, సరైన విధానంలో పని చేయడం అలవడేవి.
ఈ విధానంలో విద్య వల్ల ముఖ్యంగా తనపై తనకు నమ్మకం ఏర్పడేది. సమర్ధత పెరిగేది. దీనికి ముఖ్య కారణం గురు శిష్య బంధం. గురువు శోధన, సాధన, బోధనలు ఊపిరులుగా, అర్హత ప్రాతిపదికగా ఎవరికి ఏది ఎంత అవసరమో గ్రహించి ఆ ప్రకారం అందించేవాడు. గురువు జ్ఞానాన్ని ప్రదానం చేసే వాడు. (ఇంకా వుంది)