నూటపదహార్లు కందాల్లో సుందరకాండ
మనవి
- వాల్మీకి రామాయణం మహోత్క్రుష్టమైన కావ్యం. ఎవరె న్నిసార్లు రాసినా ఇంతకంటే ఎక్కువగా ఏం చెప్పగలరు? యావద్భారత దేశంలో ఎన్నో భాషల్లో ఎందరో మహానుభావులు రచించి, చదివి, విని ధన్యులయ్యారు. ఉత్తర భారత దేశంలో గోస్వామి తులసీదాసు రచించిన “రామచరితమానస్” కి ఉన్న ప్రాచుర్యం మరి దేనికీ లేదు. అఖండ రామాయణ పారాయణం, సుందర కాండ పారాయణం, హనుమాన్ చాలీసా ప్రతి రోజూ ఎక్కడో ఒక దగ్గర వినిపిస్తూనే ఉంటాయి. తెలుగులో కూడా వెయ్యేళ్ళుగా వేలాది భక్తులు రామాయణాన్ని రాసి, చదివి, విని తరించారు.
- రామాయణంలో రాముడి తరవాత విశిష్టమైన పాత్ర హనుమది. స్వామి భక్తికి, కార్య దీక్షకి, బుద్దికుశలతకి కొలమానంగా చిత్రించాడు వాల్మీకి. అసలు రామాయణంలో సుందర కాండ ప్రత్యేకంగా హనుమ కోసమే సృష్టించ బడింది అనిపిస్తుంది. సీతాన్వేషణలో హనుమ చేసిన అధ్బుత కార్యాలకి అబ్బురపడి శ్రీరాముడు “నువ్వు నా తమ్ముడు భరతుని వంటి వాడవ”ని ఆప్యాయంగా కౌగలించుకున్నాడు. భక్తి తత్వానికి ఉదాహరణగా రచించ బడింది కనుకనే సుందర కాండ ప్రత్యేకంగా పారాయణకి నోచుకుంది.
- నాటి రామదాసు, త్యాగరాజు నుంచి, నేటి ఎం. ఎస్. రామారావుగారి వరకు ఎందరో మహానుభావులు శ్రీరామ హనుమలను కీర్తించడం ద్వారా ధన్యులయ్యారు.
- వారిని స్ఫూర్తిగా తీసుకుని ‘వంద కందాల్లో సుందర కాండ’ రాద్దామనే ప్రయత్నం చేశాను. ‘అష్టోత్తర శతం’ దాటినా హనుమంతుని తోకలా పెరుగుతూ పోయింది. ఆఖరికి ‘నూటపదహార్లు’ తో పూర్తి చేయ గలిగాను. చదువరులు ఆదరిస్తారని ఆశిస్తున్నాను.
- ఆఖర్న అనుబంధంగా “పురజన గీత” గా పద్దెనిమిది కందాలు చేర్చాను. పట్టాభిషేకం తరవాత శ్రీరాముడు తమ్ముల్ని, మంత్రుల్ని, సామంతుల్ని, సైన్యాన్ని ఉద్దేశంచి ఎవరెలా మసలుకోవాలో మాట్లాడాక, పుర ప్రజల్ని కూడా పిలిపించి వారికి భక్తి తత్త్వం బోధిస్తాడు. ఆ కారణంగానే దీనికి ‘పురజన గీత’ అని పేరు. తులసీ రామాయణం ఆధారంగా రాసిన పద్యాలు.
33) ఆకాశమంత నోటితొ
రాకాసిని బోలి సురస రారమ్మనియెన్
ఏకాకి దొరికితివిదియె
ఆకలి గొని యుంటి నిన్ను హాయిగ తిందున్
33. సురస మారుతిని అడ్డగించి, “నాకు భలే ఆకలిగా ఉంది. ఒక్కడివే నువ్వు నాకు బాగా దొరికావు. నిన్ను మింగేస్తాను రా!” అని పెద్దగా నోరు తెరిచింది. మారుతి అంతకంటే పెద్దగా అయ్యాడు అలా పెరుగుతూ పోయి, ఆమె ఆకాశమంత నోరు తెరిచింది,
34) లొంగక భీకర రూపుడు
అంగుళమాత్రుడయి దూరె నంగన నోటన్
చెంగున యుదరము చేరెను
అంగలు వేయుచు బయటికి అంజని వచ్చెన్
34. ఆసమయంలో హనుమ ఉన్నట్టుండి తన చతురత చూపించి, అంగుళమంతగా మారి, ఆమె నోట్లో ప్రవేశించి చటుక్కున బైటికి వచ్చాడు.
35) అమ్మా! తీరెను ఆకలి
పొమ్మా నా దారి విడిచి పోవలె నమ్మా
అమ్మను జూడగ లంకకు
ముమ్మారర్థింతు నంచు ముందుకు పోయెన్
35. “అమ్మా! నీ ఆకలి తీరింది కదా! ఇక నీ దారిన పో! నేను రాముని భార్య సీతమ్మను వెదకడానికి లంకకు పోతున్నాను. నిన్ను వేడుకుంటాను” అని వెళ్ళిపోయాడు. రెండో అడ్డంకి అలా తొలగింది.
36) అక్కడితో నాగక యొక
రక్కసి సింహిక తినంగ రాముని బంటున్
ఒక్కడిగ దలచి కేసరి
నక్కడె బంధించగ నడియాసతొ యుండెన్
36. అక్కడితో ఆయన కష్టాలు తీరలేదు. సముద్రంలో సింహిక అనే రాక్షసి ఉంది. అది హనుమంతుని నీడ నీటి మీద పడుతూ ఉంటే, దాని ఉనికిని బట్టి, హనుమంతుని ప్రయాణం ముందుకు సాగకుండా అడ్డుకో సాగింది. ఒక్కడే ఉన్నాడు పోరాడ లేడు అని ఆయన్ను తినేద్దామనే ఆశతో ఉంది.
37) అప్పటికె విసిగి యుండిన
యప్పవన కిశోరుడామె నల్లన చేరెన్
చప్పున పొట్టను చీల్చెను
తప్పులు చేసిన ఫలితము తప్పదు ధరలో
37. అప్పటికే హనుమ ఎదురు పడిన అవరోధాలతో విసిగి పోయి ఉన్నాడు. సమయం వృధా అయిందని బాధ పడుతున్నాడు. ఇంక ఆలస్యం తగదని, దాని నోట్లో దూరి, శరీరం పెంచి, కడుపు చీల్చి బైటికి వచ్చాడు. సింహిక దెబ్బకి చచ్చి పడింది. తప్పు చేసిన వారికి శిక్ష తప్పదు కదా!.
38. అవరోధములేర్పడినను
అవలీలగ నధిగమించి ఆగక పోగా
జవగల ధీరుడని తెలుపు
పవన సుతుని బోలు వీర భక్తుల గాధల్
38. ఇలా అంజనేయుని కథలు విన్నవారికి కార్యశూరుడు ఎలా మసలు కోవాలో, అనుకున్న పని మధ్యలోనే ఆపకుండా ఎలా సాధించాలో, బాగా అవగాహన కలుగుతుంది కదా!.
39. ఆదరికి జేరె మారుతి
పాదములొక కొండ మోపి పరికించంగా
ఆదర్శనమున హాయిగ
మోదము నొందెను హృదయము మోజులు పడియెన్
39. ఏమైతేనేం, నూరామడల దూరం ఎగిరి సముద్రం మధ్య ఉన్న లంకలో దిగాడు హనుమంతుడు. ఆ దిగడం, దిగడం, తిన్నగా ఒక పర్వత శిఖరం మీద దిగాడు. అక్కడి సుందర దృశ్యాలు చూస్తూ ఉంటే ఆయనకి చాలా ఆశ్చర్యం కలిగింది.
40. ఏమందమేమియందము
ఏమంచు బొగడ గలంగ మీ నగరంబున్
శ్రీమంతులెంత దనుజులు
ధామంబుల కాంచనంబు ధగధగ మెరిసెన్
40. ఔరా! ఈ లంకా పట్టణం ఎంత అందంగా ఉంది! ఎంత పొగిడినా తక్కువే! ఇక్కడి రాక్షసులెంత ధనవంతులో! ప్రతీ ఇల్లూ బంగారంతో సాయంత్రపు సూర్య కాంతిలో ధగధగమెరిసి పోతోంది.
(సశేషము)