తిన్నింటి వాసాలు
చదువులు పూర్తయ్యాయి. వెంటనే ఓ కేంద్రప్రభుత్వాధీన సంస్థలో ఉద్యోగం దొరికింది. శాస్త్ర
సాంకేతిక విభాగంలో ఉద్యోగమది. ఆ సంస్థ కుడా మొదలై కేవలం మూడు సంవత్సరాలు. కేంద్ర అధికార యంత్రాంగం ఉత్తరాదిలోనూ, సాంకేతిక కార్యాచరణ స్థావరాలు మొదటగా
పశ్చిమంలోనూ, ఈశాన్యంలోనూ స్థాపించబడ్డాయి. శాస్త్ర,సాంకేతిక విభాగంలో కూడా పలు శాఖలుంటాయి. కేంద్ర స్థావరంలో చేరిన నాలుగో రోజునే వివిధ శాఖల్లో చేరిన ఓ నలుగుర్ని ఈశాన్య స్థావరంలో పడేశారు. మేము రైలు రిజర్వేషన్లు అవీ చూసుకొని, కేంద్ర స్థావరంలో రైలెక్కి ఈశాన్య స్థావరం చేరడానికి మూడురోజులు పట్టింది. సుదీర్ఘమైన ప్రయాణం.
బ్రహ్మపుత్రానది మీద వంతెన నిర్మాణంలో ఉన్న సమయం. ఇవతల గట్టున అమీన్ గావ్‌లో రైలు దిగి, స్టీమర్ మీద బ్రహ్మపుత్ర దాటి, అవతలిగట్టున పాండులో( గౌహతి పొలిమేర స్టేషను) మళ్ళీ రైలెక్కితే, మరో 18 గంటల ప్రయాణం తర్వాత మా ఈశాన్య స్థావరాన్ని చేరుకోగలిగాం.
ఆంధ్రవిశ్వవిద్యాలయంలో నేను చదువుకొంటూన్నప్పుడు నాకు ఒక ఏడాది జూనియర్ అయిన బోర్థాకుర్ ఓ అస్సామీ విద్యార్థి. అతను తరచూ నా గదికి వస్తూండేవాడు. అతని కజిన్ అపూర్వజీబన్ బోర్థాకూర్ అక్కడి మా స్థావరంలో పాలనా విభాగంలో పనిచేసేవాడు. ఓ నలుగురు కోసం ఏదైనా ఇల్లు చూడమని విశాఖ నుంచి టేలిగ్రామ్ ఇచ్చాడు. అప్పటికింకా అధికశాతం పూరిగడ్డితో కానీ, రేకుల కప్పులతో కానీ ఉన్న ఇళ్లే అధికం. పక్కా కట్టడాలు బహు స్వల్పం. భూకంపాల భయంవల్ల అక్కడవన్నీ తేలిక నిర్మాణాలు. రెండో అంతస్తనేది ఎక్కడోకాని కనిపించేది కాదు. మేము వెళ్ళేసరికే అతను ఓ యింటిని కుదిర్చేశాడు. మొత్తం మూడు గదులు. వంటకని వేరే ఒక చిన్న పూరిపాక గది. రాణా అనే ఓ ఘూర్కానీ వంటవాడిగా కుదిర్చాడు. మేము ఇద్దరిద్దరం ఒక గదిలో ఇమిడిపోయి, మూడో గదిని తిండికీ, రాణా వసతికీ కేటాయించేశాం. మావన్నీ ఫీల్డ్ ఉద్యోగాలు. మూడు దఫాలుగా ఎనిమిదేసి గంటలు రాత్రిoబవళ్ళు పనిచేయాలి.
నలుగురం నాలుగు రాష్ట్రాలనుంచి వచ్చినా, అందరం శాకాహారులమే కాబట్టి గొడవలేకపోయింది. కానీ, రాణా మట్టుకు కొద్దిగా నిరాశ పడ్డాడు. ఎప్పుడైనా కావలిస్తే బయటకి పోయి తిని రావొచ్చునని హామీ యివ్వడంతో కుదుట బడ్డాడు. ఏమైతేనేం రెండేళ్లలో స్థావర కార్యక్రమాలు వృద్ధిచెందాయి. రెండు ముడిచమురు క్షేత్రాల్ని
కనుక్కోవడం జరిగింది. సమాచా ర వ్యవస్థ పుంజుకో సాగింది. కాలనీ నిర్మాణానికి నాంది పడింది.
రాణా మా అధ్వర్యంలో మా మా నాలుగు రాష్ట్రాల వంటకాల్ని వండే నైపుణ్యం సాధించాడు. ఒక నిర్ణీతమైన పద్ధతిలో వంటలు చేసేవాడు. బట్టలు ఉతికి, ఆరేసి, ఇస్త్రీ చేసేవాడు. పక్కలు సద్దేవాడు. వాచీలు పర్సులూ బయటపడేసి ఉన్నా తీసి, జాగ్రత్త చేసి, తర్వాత ఇస్తూ మందలించేవాడు. వస్తువు కనబడకపోతే తన మీద అనుమానపు కన్ను వెయ్యడం తన కిష్టంలేదని మొహం మీదే చెప్పేసేవాడు. జీతం పెంచాం. తనకి జీతం అందగానే మా చేత మనియార్డరు ఫారం భర్తీ చేయించుకొని, నేపాల్ లో ఉన్న తల్లిదండ్రులకి డబ్బు పంపే వాడు.
ఒకరోజున కేంద్ర స్థావరంనుంచి మా స్థాయి ఆఫీసరే ఒకడు కంపెనీ పనిమీద వచ్చాడు.అతగాడికి మా సహవాసుల్లో ఒకరైన మధుసూదన్ సహాధ్యాయుడు. అతని పేరు నందకుమార్.
అతను సంస్థ తాలూకు తాత్కాలికమైన అద్దెకొంప అతిథిగృహంలో ఖాళీ లేక, మాతో ఉన్నాడు. ఓ నాలుగు రోజుల తర్వాత పని పూర్తిచేసుకొని నందకుమార్ మా నలుగురికీ ధన్యవాదాలు చెప్పి వెళ్లిపోయాడు. ఓ నెల తర్వాత రాణా తనకి స్థానికులతో గొడవలు వస్తున్నాయనీ, అప్పటికే రెండు సార్లు చిన్నపాటి దెబ్బలు తిన్నాడని చెప్పుకొని, ఎంతచెప్పినా వినిపించుకోక నేపాల్ వెళ్లిపోయాడు. ఆ తర్వాత ఓ స్థానికుణ్ణి కుదుర్చుకొన్నాము.
చదువు పూర్తయి ఉద్యోగం వచ్చిన తర్వాత, తల్లిదండ్రులు కుమారరత్నాల మీద వివాహపు ఒత్తిళ్ళు తీసుకురావడం మనదేశంలో సహజమే కదా?వాళ్ళ భయాలు వాళ్లవి. కుటుంబ పరి స్థితులను దృష్టిలో ఉంచుకొని, అవునూ, కాదూ అని చెప్పే నిర్ణయం విజ్ఞత గల కుమార రత్నాలదే. ఆ బ్రహ్మచారుల వసతిలో బదిలీలమీద వెళ్ళినవారు, వెళ్లారు. కొత్తగా వచ్చినవారు దిగారు. పెళ్లిళ్లు చేసుకొని వేరు కొంపలు తీసుకొనో, లేదా కాలనీలో పరిమితంగా కట్టిన వసతుల్లోకి మారడమో జరిగేది. సరే ఓ సారి యింటికి సెలవు మీద వెళ్లినప్పుడు, అందరూ అప్పటికప్పుడు ఓ అమ్మాయిని చూసి, పెళ్లి చేసి పంపించేశారు. వాళ్ల భయం తీరింది. నా వయసు ఊపిరి తీసుకొంది. కాలనీలోకి మారాను.
మా సంస్థ ముడిచమురు క్షేత్రాలు పశ్చిమ ఈశాన్యరాష్ట్రాలలో ఒక్కటొక్కటిగా పెరిగాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పుంజుకొ ని, సమాచార వ్యవస్థ ఊహాతీతంగా మారిపోవడంతో సంస్థ సంస్కృతి మారిపోయింది. ఒక టా, రెండా యిరవై సంవత్సరాలుగా సంస్థ ఎదిగింది. సంస్థతోబాటు మేమూ ఎదిగాం. నాకూ అప్పటికి నాలుగు స్థావరాలికి బదిలీ అయింది.
నాకు బదిలీ అయిన అయిదో స్థావరం ముంబయ్. వెళ్ళి బాంద్రాలోని మా సంస్థ కాలనీలో ఒక బహుళ అంతస్తుల భవనంలోని ఒక వసతిలో దిగాను. ఓ ఆదివారం కూరల మార్కెట్ కి వెళ్లినప్పుడు, అక్కడ ఓ నేపాలీ నాకేసి చూడసాగాడు. నాకూ ఎక్కడో చూసిన మనిషిలాగే అనిపించి, ఒక నిముషంలోనే రాణా అని గుర్తించాను.
“ఏం రాణా? నన్ను గుర్తించావా? ఇక్కడేo చేస్తున్నావ్?” అని అడిగాను.
“గిరీష్ సాబ్! నేను మిమ్మల్ని చూస్తూనే గుర్తుపట్టాను. మీ దగ్గర దాపరికమెందుకు? ఆనాడు
మధుసూధన్ సాబ్ అతిథిగా వచ్చిన నందకుమార్ సాబ్ నన్ను ఎక్కువ జీతంతో ప్రలోభపెట్టడంతో, మీ దగ్గర పని వదిలి, ఆయన పంచన చేరాను. ఆయనకీ నాలుగు బదిలీలు అయ్యాయి. ఆయనతో బాటే తిరిగాను. ఆయనా ఇక్కడే ఉన్నారు. ముగ్గురు సంతానం. అమ్మకూడా ఉద్యోగం చేస్తోంది. కూరలకోసం, చికెన్ కోసం వచ్చాను.” అన్నాడు.
“కాలనీలో నందకుమార్ సాబ్ క్వార్టర్ నెంబరు తెలుసా?”
“లేదుసార్! ఆయన ఈ ఊరు బదిలీ మీద వచ్చిన రెండేళ్లలో ఓ ప్రయివేట్ కంపెనీలో చాలా ఎక్కు
వ జీతంతో చేరిపోయారు. ఆ కంపెనీ కూడా మీ సంస్థచేసే పనే చేస్తుంది. మెహబూబ్ స్టూడియోస్ దగ్గర కుందన్ అపార్ట్మెంట్స్ లో ఉంటున్నారు. మీరు వచ్చారని చెప్పనా?”
“వద్దు. ఆ నాలుగు రోజుల పరిచయం తప్ప, అంతకు మించిన దోస్తీ లేదు. అందునా మా విభాగాలు వేరు. నేను అతన్ని చూడ్డానికి వెళ్ళినా, నిన్ను మా దగ్గరనుంచి ఎత్తుకుపోయిన తను ఇబ్బందిలో పడ్తాడేమో? అతను మా కంపెనీకి ఎదో పని మీద రాక తప్పదు. అప్పుడు అనుకోకుండా కలుసుకొన్నా నీ ప్రస్తావన తీసుకురానులే! మరి నీ సంసారం సంగతి?” అన్నాను.
“నాకు ఇద్దరు కుర్రాళ్ళు సాబ్. కుమార సాబ్ కంపెనీ సర్వెంట్ క్వార్టర్స్ మోహబూబ్ స్టూడియో దగ్గర్లోనే ఉన్నాయి, ఇబ్బంది లేదు.”
రాణా సెలవు తీసుకొని వెళ్లిపోయాడు. మరుచటి శనివారం ఉదయం ఏడింటికల్లా, ఏదో అలవాటైన నిత్యపూజా కార్యక్రమం కొనసాగిద్దామని కూర్చోబోతుండగా సెల్ మోగింది. ఎవరికేం అవసరమొచ్చిందేమోనని చూశాను. నాకు పరిచయం లేని నెంబరు.
“గిరీష్ సాబ్ తో మాట్లాడాలి,” అవతలి కంఠం పలికింది. ఆడగొంతుక.
“ఎస్! నేనే! చెప్పండి,” అన్నాను.
“సర్! నా పేరు సమతామల్హోత్రా. సాగర్ ఎక్స్ ప్లోరేషన్ అండ్ ఎనర్జీ సంస్థ మానవ వనరులశాఖ నిర్దే శికురాల్ని. ఇంత ఉదయమే మిమ్మల్ని ఇబ్బందికి గురిచేస్తూ పలకరిస్తోన్నందుకు క్షమించాలి.
మీరు అనుభవశాలురనీ, ప్రజ్ఞావంతులనీ మావద్ద తగినంత సమాచారముంది. మా యాజమాన్యం మిమ్మల్ని మా సంస్థలోకి తీసుకోవాలన్న కుతూహలంతో ఉంది. ఏడాదికి 30 లక్షల పేకేజీ. ఫార్మల్ అప్లికేషన్ మీకు కొరియర్లో పంపడం జరిగింది. అందులో వివరాలన్నీ ఉన్నాయి. కేవలం మీరు సంతకం పెట్టేసి పంపిచేస్తే మిగతా సంగతులన్నీ మేము చూసుకొంటాo.”
నేను ఒక్కక్షణం తొట్రుపాటు పడి, తేరుకొని, తిరిగి సమాధానం చెప్పేలోగానే ఆమె సెల్ ఆపుచేసింది. అన్యమనస్కంగా పూజముగించాను. పూజయిన తర్వాత శ్రీమతి అడిగింది.”ఎవరూ, ఫోన్
చేస్త?” అనకూడదుకాని ఈ ఇల్లాళ్ళకి సెలవు పూటల్లో భర్తల సెల్ ఫోన్లు మోగితే ముందే ప్రణాళికలు వేసుకొన్న కార్యక్రమాలు అటకెక్కిపోతాయేమోనన్న భయం. మా సంస్థ కార్యకలాపాలన్నీ తరచూ అటువంటి పరిస్థితుల్ని కల్పిస్తోనే ఉంటాయి. “ఏమీ లేదు! ప్రోజెక్ట్ సైట్ నుంచి పని సరిగానే జరిగిపోయిందన్న రిపోర్ట్.” అసలు సంగతి ఏ మాత్రం చెప్పినా నాకు సుఖశాంతులుండవు.
ఇప్పటికే మా సంస్థ మాకు చాలా అన్యాయం చేసిందనీ, ప్రైవేటు కంపెనీ వాళ్ళ జీతాలూ, సౌకర్యాలూ మనకుండవనీ అనే మహిళాసంఘ సభ్యుల మాటలు మాకు వినిపిస్తోనే ఉంటాయి. మా స్థాయి చూసి మాకంటే వాళ్ళకే బాధలెక్కువ!
అయినా ఎవరో రాలుగాయి మనిషి పరాచికాలు చేస్తోoదేమోనని అనిపించింది. మహానగరాల్లో ఇటువంటి సంఘటనలు సాధారణంగా జరుగుతోనే ఉంటాయి. ఆ మధ్యాహ్నం మూ
డింటికి కొరియర్ వచ్చింది. కవరు చింపి కాయితాలు చూశా ను. వివరాలు ఆమె చెప్పిన విధంగానే ఉన్నాయి.
మంచి వసతి. ప్రత్యేకించి డ్రైవరుతో సహా కారు. విమాన ప్రయాణాలు. రెండేళ్ళకోసారి వారం రోజులు కుటుంబంతో సహా విదేశీ విహారయాత్రలు. ఇలా ఎన్నో సౌకర్యాలు. చివర్నఓ అనుబంధo లో అంతవరకు మా మాతృసంస్థనుంచి తమసంస్థలో జేరిన ఆఫీసర్ల వివారాలు ఉన్నాయి. వారిలో కొందరు నాకు తెలుసు. వారిలో మధుసూదన్ కూడా ఒకడని జాబితా చూసిన తర్వాత గ్రహించాను. ఆలోచనలో పడ్డా ను.
దేశవ్యాప్తంగా చాలా ముఖ్యమైన ప్రభుత్వాధీన సంస్థల్ని పెట్టుబడిదారుల సంస్థలకి అప్పగించే ఆలోచనని ప్రభుత్వం చేస్తోంది. దానికి సత్యదూరాలు కాని కారణాలనేకం. చెప్పుకుంటే చేటలు నిండుతాయి. కానీ ఇక్కడ ఒక సంస్థ శైశవదశలో ఉండగా నేను చేరాను. నేను ఎదిగాను. సంస్థ ఎదిగింది. సంస్థతోబాటు తిరిగి నేనూ ఎదిగాను.
ఇదొక నిరంతర ప్రక్రియ. ఒక కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని స్థిరపరచి, వ్యవస్థీకరించడంలో నేను చేసిన కృషి నాకు తెలుసు. ప్రభుత్వాధీన సంస్థకాబట్టి జీతభత్యాల విషయంలో కొన్ని నిబంధనలు యజమాన్యం పాటించక తప్ప దు. అంచెలంచెలుగా అవగతమైన మా సంస్థ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్నీ, నా ఇరవైఏళ్ల అనుభవాన్నీ, వాళ్ళు ఒక్క అంగలో సాధించే ప్రయత్నం సబువు కాదనిపించింది.
రాణాని హైజాక్ చేసిన మధుసూదన్ కీ, నాలాంటి వాళ్లని హైజాక్ చేయ ప్రయత్నిస్తోన్న సాగర్ సంస్థ వాళ్ళకీ ఏమి తేడాలేదు. ప్రభుత్వ విద్యాసంస్థలనుంచి సమర్థవంతులైన ఉపాధ్యాయుల్నీ, ఉపన్యాసకుల్నీ ప్రైవేటు విద్యాసంస్థలు ఆకర్షించే తీరుకీ, దీనికీ ఏమీ తేడాలేదు.
ఆ కాయితాల్ని చింపి చెత్తబుట్టలో పడేశాను. సాయంత్రం ఆరింటికి సమతా మల్హోత్రా ఫోన్ చేసింది ఫార్మల్ అప్లికేషన్ అందిందా అంటూ. “అందడం, చింపి బుట్టలో పారేయడం జరిగింది. ఈ విషయానికి మీరు ఇంతటితో స్వస్తి పలికితే సంతోషిస్తాను!” అని సెల్ మూశాను. తిన్నయింటి వాసాలు లెక్కబెట్టే స్థితికి నేనింకా జారిపోలేదు.