గ్రీసు దేశపు పురాణ గాథలు

Knowledge is acquired when we succeed in fitting a new experience into the system of concepts based upon our old experiences. Understanding comes when we liberate ourselves from the old and so make possible a direct, unmediated contact with the new, the mystery, moment by moment, of our existence.” Aldus Huxley. “Knowledge and Understanding”
ముందు మాట
నేను ఈ వ్యాసాలు రాయడానికి ప్రేరణ కారణం ఒక విమాన ప్రయాణం. భారత దేశం వెళుతూ, శేన్ ప్రాన్సిస్కో లో ఉదయం 8 గంటలకి బయలుదేరి, నూ అర్క్ చేరునేసరికి సాయంత్రం అయిదు అయింది. పరుగుబాట మీదకి దిగడానికి విమానం సంసిద్ధం అవుతూ ఉండగా, “మనం దిగబోయే పరుగుబాట మీద మరొక విమానం ఉంది. కంట్రోలు టవర్ లో ప్రజలు నిద్రపోతున్నట్లు ఉన్నారు. మరో చుట్టు తిరిగి వస్తాను. అరగంట సేపు ఓపిక పట్టండి,” అని చోదకుడు విమానం జోరు పెంచుతూ పైకి లేచేసరికి ఇహ చేసేది ఏమీ లేకపోవడంతో నా కుర్చీకి ఎదురుగా ఉన్న టి.వి. లో ఏదైనా “ఇరవై నిమిషాల కార్యక్రమం” చూద్దామని వెతకడం ఉపక్రమించేను. “అపస్వరం అనే ఏపిల్ పండు కథ” ట. పదిహేను నిముషాలు ట. చూడడం మొదలు పెట్టేను.

పురాతన గ్రీసు దేశపు కథ. ఇంతకు పూర్వం నేనెప్పుడూ ఈ కథ గురించి వినలేదు. ఆసక్తితో చూసేను. గమ్యం చేరుకోగానే గూగుల్ లో వెతికేను. చాల ప్రాచుర్యం ఉన్న కథ. మా అమ్మాయిని అడిగితే, “చిన్నప్పుడు హైస్కూల్ లో చదివేను” అని చెప్పింది. నేను పుస్తకాల పురుగుని అయినా ఈ కథ నా కళ్ళ పడడానికి ఎనభై ఏళ్ళు పట్టిందంటే ఈ కథని వినని వాళ్ళు ఇంకా ఎంతమంది ఉంటారో అనిపించింది.
ఈ కథ గురించి పరిశోధన చేస్తూ ఉంటే ఆసక్తికరమైన అంశాలు ఎన్నో తెలుసుకున్నాను. వాటన్నిటిని క్రోడీకరించి వ్యాసాలుగా రాసేను. ఇక్కడ ఉటంకించిన అంశాలన్నిటినీ కేవలం ఒక నఖచిత్రంలా స్పర్శించినా ఇది పెద్ద గ్రంథం అవుతుంది. అందుకని కొన్ని ముఖ్యమైన అంశాలని మాత్రమే ముచ్చటించేను. వేమూరి వేంకటేశ్వరరావు ప్లెజంటన్, కేలిఫోర్నియా 2020 గ్రీసు దేశపు పురాణ గాథలు ఎందుకు చదవాలి? మనకి వేదాలు, అష్టాదశ పురాణాలూ, రామాయణ మహాభారతాల వంటి ఇతిహాసాలు ఉండగా, గ్రీకు (గ్రీసు దేశపు) పురాణ గాథలు ఎందుకు చదవడం? మన పురాణ గాథల గురించి లోతుగా అర్థం చేసుకోవాలంటే ఇతరుల పురాణ గాథలు కూడా అధ్యయనం చెయ్యాలి. అసలు గాథ అంటే కథనరూపక గేయం అని అర్థం; పాడుకోడానికి అనువైన కథ. గాథలని ఆలాపించే వ్యక్తి గాథకుడు. వీరుల గురించి చెప్పే గాథలు వీరగాథలు (ballads). పరిమాణాన్నిబట్టి వీరగాథలని లఘుగాథలు, చక్రీయ గాథలు (ballad cycles) అని విడగొట్టవచ్చు. లఘుగాథలు చిన్న కథలు. చక్రీయ గాథలు పంచతంత్రం కథలలా గొలుసు కథలు.
వీరగాథలలో అసలు కథ ఒక వంతు, కల్పన పది వంతులు అనడం అతిశయోక్తి కాదు. వీరగాథలలో అతిలోక వ్యక్తులు, అతీంద్రియ శక్తులు, అద్భుత కథనాలు, అభూత కల్పనలు లేకపోతే జానపదులను ఆకర్షించవు. మనం ఇక్కడ చవి చూడబోయేవి ఇటు వంటి గ్రీసు దేశపు జానపద ఐతిహాసిక చక్రీయ గాథలు (epic cycles) నుండి సేకరించినవి. ఇవి తరతరాలుగా ప్రజలలో మౌఖికంగా వ్యాప్తి చెందిన కథలు. ఇంగ్లీషులో “myth” అనే మాటని తెలుగులో “పురాణ గాథ” అనొ చ్చు. పురాణ గాథలకి రెండు ప్రయోజనాలు ఉన్నాయి. మొదటి ప్రయోజనం – పిల్లలు కుతూహలంతో అడిగే, ఇబ్బంది పెట్టే, ప్రశ్నలకి తేలికగా సమాధానాలు చెప్పడానికి. ఏమిటా ప్రశ్నలు? ఈ ప్రపంచాన్ని ఎవ్వరు తయారు చేసేరు? ఎప్పుడు తయారు చేసేరు? ఈ ప్రపంచం ఎన్నాళ్ళు ఉంటుంది? మొట్టమొదట ఎవ్వరు పుట్టేరు? చచ్చిపోయిన తరువాత ఎక్కడకి వెళ్తాము? మొదలైనవి. రెండవ ప్రయోజనం – మనం ఉంటున్న సాంఘిక వ్యవస్థ వెనుక, మన ఆచార వ్యవహారాల వెనుక ఒక కారణ-కార్య లంకె ఉందని సూచించడం కొరకు. సనాతన కాలపు గ్రీసు దేశపు సమాజంలో దేవుళ్ళ గురించి, దేవతల గురించి, సాహసోపేతమైన ధీరుల గురించి, భయంకరమైన రాక్షసాకారాల గురించి, వికృతమైన “చంపూ మానవులు” (human-animal hybrids) గురించి ఎన్నెన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. తుపానులు ఎందుకు వస్తున్నాయి? అగ్నిపర్వతాలు ఎందుకు పేలుతున్నాయి? భూకంపాలకి కారణం ఏమిటి? పూజలు, వ్రతాలు, మొదలైన కర్మకాండలు ఎందుకు చెయ్యాలి? మొదలైన ప్రశ్నలు అప్పుడే కాదు ఇప్పుడు కూడా అడుగుతున్నారు. వీటికి సమాధానాలు చెప్పడం కోసం పురాణ గాథలు పుట్టుకొచ్చాయి.

హిందువులకి వేదాల వంటి పురాతన ప్రమాణ గ్రంథాలు ఉన్నాయి. క్రైస్తవులకి బైబిల్ ఉంది. కంచు యుగం (Bronze age) రోజులలో, గ్రీసు దేశంలో, వారికి ఉన్నవల్లా తరతరాలుగా వస్తున్న మౌఖిక సాహిత్యము, సంప్రదాయాలు. ఆ కథలు వివిధ గాయకుల నోట ప్రయాణం చేసి, కాలక్రమేణా మార్పులుచెంది, చివరికి లిఖిత రూపంలో గ్రంథస్థం అయేయి. ఈ రకంగా గ్రంథస్థం అయిన వాటిల్లో చెప్పుకోదగ్గవి హోమర్ (Homer, ఉరమరగా సాధారణ శకానికి పూర్వం 8 వ శతాబ్దంలో) రాసిన ఇలియాడ్ (Illiad), ఆడెస్సి (Odessy) అనే రెండు గ్రంథాలు. ఇలియాడ్ లో ముఖ్యమైన కథాంశం ట్రోయ్ లో జరిగిన యుద్ధం.
ఈ యుద్ధం పైకి చూడడానికి రెండు మానవ సైన్యాల మధ్య జరిగిన యుద్ధంలా కనిపించినా, ఈ యుద్ధానికి ప్రేరణ కారకులు దేవతలు, వారి మధ్య ఉండే ఈర్ష్య, అసూయ, మొదలైన వైషమ్యాలు. యుద్ధం అయిపోయిన తరువాత విజయం సాధించిన గ్రీకు సైన్యంలో కొంత మంది పదేళ్ళపాటు సముద్ర ప్రయాణం చేసి, చిట్టచివరకు రోమ్ నగరం చేరుకుంటారు. ఈ బృహత్ ప్రయాణం గురించి చెప్పే కథ ఆడెస్సి. ట్రోయ్ యుద్ధంలో బతికి బయటపడ్డ యోధులు కొందరు ఇటలీ చేరుకుని రోమ్ సామ్రాజ్యపు సంస్థాపనకి కారకులు అయేరు. అప్పుడు గ్రీకు కథలకి సమాంతరంగా రోమ్ పురాణ గాథలు పుట్టుకొచ్చేయి. ఈ కథల లో పాత్రల పేర్లు మారేయి కానీ మౌలికంగా గ్రీకు పాత్రలనే పోలి ఉంటాయి.
రోమ్ సామ్రాజ్యం బలం పుంజుకునే వేళకి గ్రీసు దేశంలో ప్రజలపై పురాణగాథల ప్రభావం సన్నగిల్లడం మొదలయింది కానీ వాటి అవశిష్టాలు అలెగ్జాండర్ కాలం వరకు మిగిలే ఉన్నాయి. ఈ యుద్ధాలలో ప్రముఖ పాత్రలు ధరించిన మానవులు, దేవతలు ఎక్కడనుండి వచ్చేరు? హోమర్ తరువాత ఒక శతాబ్దం గడచిన పిమ్మట (ఉరమరగా సా. శ. పూ. 7 వ శతాబ్దంలో) హేసియోడ్ (Hesiod) అనే చరిత్రకారుడు రాసిన థియోగొని (Theogony) అనే గ్రంథంలో ఈ ప్రపంచం ఎలా పుట్టిందని ప్రాచీన గ్రీకులు నమ్మేవారో మొదటిసారి చూస్తాం. ఈ గ్రంథంలోనే ఆదిలో ఒక అస్తవ్యస్తమైన పరిస్థితి నుండి గాయా (Gaia) అనే భూదేవత పుట్టడం, తరువాత ఆమె ప్రాథమిక ప్రకృతి శక్తులకు ఎలా జన్మనిచ్చిందో, తదుపరి వారి నుండి రాక్షసగణాలు, దేవగణాలు, ఎలా పుట్టుకొచ్చేయో, ఆయా వంశవృక్షాలతో సహా కూలంకషంగా వర్ణించబడ్డాయి.
కాలక్రమేణా ఈ కథలని ఆధారంగా చేసుకుని శిల్పులు శిల్పాలు మలిచేరు, చిత్రకారులు బొమ్మలు గీసేరు, కవులు గ్రంథాలు రచించారు, నిర్మాతలు సినిమాలు తీసేరు. చిట్టచివరకు అధునాతన కాలంలో వ్యాపార సంస్థలు కూడా ఆ కాలపు పేర్లని, శాల్తీలని వాడుకుంటున్నారు. గ్రీకు పురాణ గాథలలో దేవతలే కాదు, శూరులు, వీరులు అయిన మానవులు కూడా ఉన్నారు. ఉదాహరణకి మహా బలవంతుడైన హెర్క్యులిస్ (Hercules) పేరు తెలియనివారు ఉండరు. మొట్టమొదటి మానవ స్త్రీ పెండోరా (Pandora) తెరవకూడని పెట్టె తెరచి మానవ లోకానికి పెద్ద సమస్య తెచ్చి పెడుతుంది. దంతపు విగ్రహాల అందాన్ని చూసి, ప్రేమలో పడడం పిగ్మేలియన్ (Pygmalion) కథాంశం. అరాక్నే (Arachne) అనే సాలె వనిత ఆత్మస్థైర్యాన్ని “పొగరుబోతు ప్రవర్తన” గా పరిగణించి ఆమెని శిక్షించాడానికి సాలెపురుగుగా మార్చేస్తారు ఆ నాటి దేవతలు. ఏది ముట్టుకుంటే అది బంగారం అయిపోవడం వల్ల మైదస్ (Midas) పడ్డ పాట్లు మనకి తెలియనివి కావు. నార్సిస్సస్ అద్దంలో తన ప్రతిబింబం చూసుకుని దాని మీద ప్రేమలో పడడం అనే కథని ఆధారంగా చేసుకునే ఇంగ్లీషులో narcissism అనే మాట వచ్చింది. గ్రీకు పురాణగాథలలో వచ్చే రాక్షసాకారాలు, వికృతమైన జంతు-నర సంకరాకారాలు చాల మట్టుకి కథలలో చదివే ఉంటాం. పేగసస్ (Pegasus) అనే గుర్రానికి రెక్కలు ఉంటాయి. సెంటార్ (centaur) ముందు భాగం మనిషిలా ఉంటే వెనక భాగం గుర్రంలా ఉండే నరతురంగం. ఈ రకం నరతురంగాలనే హిందూ పురాణాలలో కింపురుషులు అన్నారు. మనకి ఉన్నట్లే వారికీ కిన్నరులు (satyrs) ఉన్నారు.

స్ఫింక్స్ (Sphinx) అనేది స్త్రీ రూపంలో ఉన్న నరసింహం. ఇంకా విచిత్రమైన శాల్తీలు చాలా ఉన్నాయి. నేడు మనం బజారులో కొనుక్కునే అనేక వస్తువుల పేర్లు గ్రీకు పురాణ గాథల నుండి సేకరించినవే! పాదరక్షలని చేసే నైకీ (Nike) సంస్థ పేరు ఎక్కడినుండి వచ్చిందని? చంద్రుడి దగ్గరకు మానవులని మోసుకెళ్లిన రాకెట్ అపాలో (Appalo) పేరు ఎక్కడిదో తెలుసా? అమెజాన్ డాట్ కామ్ (Amazon.com) కంపెనీ పేరులో అమెజాన్ ఎక్కడినుండి వచ్చిందో తెలుసా? అమెరికాలో బట్టలు ఉతుక్కునే ఒక సబ్బు వ్యాపార నామం ఏజాక్స్ (Ajax).
అమెరికాలో ఆటలాడే జట్లు పేర్లు టైటన్స్, స్పార్టన్స్, ట్రోజన్స్, వగైరా పేర్లు అన్నీ గ్రీసు దేశపు పురాణాలలో పేర్లే. ఇటువంటి నేపథ్యం ఉన్న గ్రీకు సమాజంలో, ఇటువంటి పురాణ కథలని, మానవాతీత మహత్తర శక్తులని నమ్మిన గ్రీకు సమాజంలో కాలక్రమేణా కార్యకారణ హేతువాద దృక్పథం చోటు చేసుకుంది. ఈ కొత్త దృక్పథానికి విత్తులు హోమర్ కాలంలోనే పడ్డాయేమో కానీ, అవి మొలకెత్తడం మొదలెట్టి ఒక ఆకారం సంతరించుకొనడం థేల్స్ (Thales) తో ప్రారంభం అయిందని చెప్పుకోవచ్చు. అటుపైన గ్రీకు దార్శనికుల సారధ్యంలో, కట్టలు తెంచుకు ప్రవహించిన నదిలా, ఒక కొత్త రకపు ఆలోచనా స్రవంతి పెల్లుబుకి ప్రపంచం అంతటిని ముంచెత్తింది.

అదే ఈ నాటి శాస్త్రీయ దృక్పథం. ఇప్పుడు గ్రీసులో కాని, పాశ్చాత్య దేశాలలో కానీ మిగిలినది కథలు మాత్రమే! ఆ కథలు నేర్పిన దృక్పథం ఎప్పుడో కాలగర్భంలో కలిసిపోయింది. ఇక్కడ ఉటంకించిన అంశాలన్నిటినీ కేవలం ఒక నఖచిత్రంలా స్పర్శించినా ఇది పెద్ద గ్రంథం అవుతుంది. అందుకని కొన్ని ముఖ్యమైన అంశాలని మాత్రమే ముచ్చటించేను.