కాల రచన

“కాలం అంటే కేవలం నది లాగా ప్రవహించేది మాత్రమే కాదు… ఎప్పుడు ఏమేమి ఎలా జరగాలో స్పష్టంగా రచించేది. శృతినీ, గతినీ నిర్ణయించేది” అన్నారు మా స్వామీజీ ఓనాడు. చింతలపూడి అనే మా వూళ్ళో విశ్వనాధాశ్రమాన్ని స్థాపించింది వారే. ఆది శంకరాచార్యులవారి విగ్రహాన్నీ, శ్రీ రాజరాజేశ్వరీ అమ్మవారి విగ్రహాన్నీ ప్రతిష్టించి ప్రాణ ప్రతిష్ట చేసిందీ వారే. వారి పేరు శ్రీ బోధానందపురి మహారాజ్. 

“ఎలా స్వామీజీ?” అడిగారొక భక్తుడు. దసరా ఉత్సవాలు మా ఆశ్రమంలో అద్భుతంగా జరుగుతాయి. వేలాదిమంది భక్తులు వచ్చి అమ్మవార్ని దర్శించుకునేవారు. ఎందరో పండితులు, భాగవతార్లూ, హరికథా విడవాసులు వచ్చి ఆ పదకొండు రోజులూ అద్భుతంగా తమ ప్రజ్ఞతో ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసేవారు. 

“నిన్న మీరు భరతుడి పుట్టుక గురించి విన్నారుగా. భరతుడి పుట్టుక జరగాలంటే మొదట అతని తల్లిదండ్రులే కాదు అమ్మమ్మ తాతయ్యలు ఎవరో కూడా నిర్ణయించబడాలి. ఒక నాటకాన్ని రక్తి కట్టించాలంటే సరైన రచయితలే కాదు, సరైన పాత్రధారులుండాలి. అప్పుడే ఆ నాటకం ప్రజారంజకమవుతుంది. మనిషి రాసే నాటకమే ఇంట రక్తి కడితే, కాలం రచించే నాటకం ఇంకెంత పకడ్బందీగా ఉండాలీ?” నవ్వారు స్వామీజీ. 

“మీరు వివరించి చెబితేనే గదా మాకూ అర్ధం అయ్యేది. మేమేదో చదివినదానికి కొంత కల్పనా జోడించి ప్రేక్షకులు ఆనందించేలా చెబుతామే గానీ, అంతరార్ధాలూ, విశేషార్ధాలూ మాకేం తెలుసూ!” గడుసుగా అన్నారు ఇంగువ వాసుదేవశాస్త్రి గారు. ఆయన గొప్ప విద్వత్తు గలిగినవాడే. అందులో ఏమాత్రం సందేహం లేదు. అయినా, స్వామీజీ ముందు పిల్లాడయిపోతాడు. 

“అయ్యా శాస్త్రిగారూ… మీకు తెలిసిన విషయాన్నే మళ్ళీ నాతొ చెప్పించుకోవడం మీ వినయానికి నిదర్శనం. సరే. అఖండ భరత ఖండాన్ని పరిపాలించడానికి ఓ రాజుని కాలం సృష్టించాలి. ఆ రాజు లక్షణాలు ఏమై వుండాలీ? ఒకటి నిర్భయత్వం. రెండు బుద్ధి బలం. మూడు అనంతమైన శారీరక బలం. నాలుగు దేన్నైనా లొంగదీసుకు తీరాలనే పట్టుదల. అయిదు రక్షించగల సామర్ధ్యం. ఆరు ధర్మాధర్మ విచక్షణ. ఏడు పెద్దవారి మాటల్ని ఆలకించే వినయ విధేయతలు. ఎనిమిది అవసరమైనప్పుడు నిర్దాక్షిణ్యంగా వ్యవహరించగల నిర్మొహమాటం, నిర్దయ. ఇన్ని లక్షణాలు భరతుడిలో పుష్కలంగా వున్నాయి. ఈ లక్షణాలు అతనికి సంక్రమించాలంటే, ఇవన్నీనో, కొన్నో తల్లిదండ్రులనుంచి రావాలి. ఆ తల్లిదండ్రులకి కూడా ఈ లక్షణాలు వారికి పూర్వీకులనుంచి రావాలి. అంటే వారి తరతరాల చరిత్రనూ పరిశీలించాల్సి ఉంటుంది. సైన్సు ప్రకారం ‘జీన్’ స్ట్రక్చర్ మారాలంటే 28 మిలియన్ సంవత్సరాలు పడుతుంది. ఒక మిలియన్ అంటే పది లక్షలు. 28 మిలియన్ అంటే 28 x 10 = 280 లక్షల సంవత్సరాలు. అంటే, ఎన్ని మహాయుగాలు గడవాలీ?” ఆగారు స్వామీజీ. 

“మహాయుగం అంటే?” అడిగాడు మా మొక్కపాటి రవి. 

“కృత, త్రేతా, ద్వాపర, కలి యుగాలు నాలుగిటినీ కలిపితే ఒక మహాయుగం అవుతుంది. లెక్కలు తరువాత చెబుతానులే. ఈ భూమండలంలో గణితాన్ని నేర్చిందీ, నేర్పిందీ భారతీయులే. అంతే కాదు. వాస్తు, జ్యోతిష్య, అణు (కణ), వైద్య, ఖగోళ శాస్త్రాల్ని కూడా స్పష్టంగా లోకానికి ఇచ్చింది భారతీయులే!” స్వామీజీ మోహంలో ఆనందంతో కూడిన చిరునవ్వు. 

“అబ్బాయ్ రవీ… చిన్న చిన్న ప్రశ్నలతో అడ్డం రాకు. స్వామీజీని చెప్పనీ” మందలించారు సబ్ రిజిస్ట్రార్. 

పకపకా నవ్వారు స్వామీజీ. “అయ్యా సబ్ రిజిస్ట్రారు గారూ ఇవన్నీ నేను చెబుతున్నది పిల్లలకోసమే! సగం జీవితం గడిపేసినవాళ్ళకి ఇదంతా ఎందుకూ? అబ్బాయ్, కలియుగ పరిమితి 4,32,000 సంవత్సరాలు. దాని పైనున్నది ద్వాపరయుగం. దాని పరిమితి 8,64,000 సంవత్సరాలు. త్రేతాయుగపు పరిమితి 12,96,000 సంవత్సరాలు. ఆ పైది కృతయుగం. దాని కాలపరిమితి 17,28,000 సంవత్సరాలు. ఈ నాలుగూ కలిపితే ఒక మహాయుగం. అంటే 43 లక్షల 20 వేల సంవత్సరాలన్న మాట. ఇలాంటివి 71 మహాయుగాలు గడిస్తే ఒక మన్వంతరం అవుతుంది. నాయనా, భారతీయుల కాలమానం అత్యంత అద్భుతమైనది. దీనికి సాటి వచ్చేది సృష్టి లోనే లేదు” రవి గాడి సందేహం తీర్చారు స్వామీజీ. 

“మీరు భరతుడి సంగతి చెబుతున్నారు” గుర్తు చేసింది మహాలక్ష్మమ్మ వినయంగా. 

“అవును కదూ..! దుశ్యంతుడు అందగాడు. అమ్మాయిల్ని క్షణాల్లో వాలా వేయగల సౌందర్యం కలవాడు. అలాగే అవసరం తీరాక అవతలకి త్రోసే దుర్గుణం కూడా అతనిలో వుంది. ఒకవిధంగా చెప్పాలంటే, శౌర్యమూ, క్రూరత్వమూ, సౌందర్యమూ కూడా సమపాళ్లలో కలిగినవాడు, పులులు సింహాలు వంటి క్రూర జంతువుల్ని వేటాడి పట్టుకుని, వాటితో ఆటలాడుకునే అలవాటు అతనికి చిన్నతనం నుంచే వుంది. 

ఇక శకుంతల…. ఈమె మేనక, విశ్వామిత్రుల సంగమం వల్ల పుట్టిన బిడ్డ. మేనక అత్యంత సౌందర్యవంతురాలే కాక అద్భుతమైన మేధస్సు, సహజమైన ప్రతిభ కలిగిన దేవకన్య. రంభ ఊర్వశి తిలోత్తమలతో సరితూగే నాట్య ప్రతిభ యీమె సొత్తు.

ఇక భరతుడి తాత అయిన విశ్వామిత్రుడైతే, బ్రహ్మ కుమారుడైన కుశుడికి మునిమనవడు. ఎలాగంటే, కుశుని కొడుకు కుశనాభుడు,కుశనాభుడి కొడుకు గాడి. ఆ గాది యొక్క పుత్రుడే విశ్వామిత్రుడు. కుశ వంశం వాడు కనక ఇతడ్ని కౌశికుడు అని కూడా పిలుస్తారు. అనన్య సామాన్యమైన పట్టుదల, పంతం, దీక్ష విశ్వామిత్రుడికి పుట్టుకతో వచ్చిన లక్షణాలు. అనుకున్నది సాధించేవరకూ నిద్రపోని మనస్తత్వం. ఎంత చాపల్యం వుందో అంతకి వెయ్యిరెట్లు పట్టుదల వుంది. క్షాత్ర ధర్మాన్నించి బ్రాహ్మణత్వానికి మారే ప్రయత్నంలోనే మేనకా సౌందర్యానికి ముగ్ధుడై శకుంతల జన్మకి కారకుడయ్యాడు. 

విశ్వామిత్రునిలో గల పట్టుదల, దీక్ష, మేనకలోని ప్రతిభ, మేధస్సు, సౌజన్యం, సున్నితత్వం, శకుంతలలోని సౌకుమార్యం ధీరత్వం+ దుష్యంతునిలోని సౌందర్యమూ, క్రూరత్వము (ఇక్కడ క్రూరత్వము అంటే తాను చేసే పనులలో లేక కర్తవ్యంలో నిర్దాక్షిణ్యంగా తీసుకోవాలి). ఇవన్నీ కలగలిపితే కానీ భరతుడు అనే మహా బలశాలియైన చక్రవర్తి ప్రభవించలేదు. అంటే, భరతుడి పుట్టుకకి వ్యూహరచన చేసింది కాలమే గదా! లేకపోతే ఎక్కడి మేనక, ఎక్కడి విశ్వామిత్రుడు, ఎక్కడి శాకుంతల, ఎక్కడి దుష్యంతుడు…. ఎక్కడి కణ్వుడు. ఒక భరతుడు ఓ ఖండాన్నే నిర్మించడానికి ఇంతమంది ప్రత్యక్ష, పరోక్ష కారకులయ్యారు” ఆగారు స్వామీజీ. 

“అంటే ప్రతి పుట్టుకకీ ఇలాంటి కారణాలు ఉంటాయా స్వామీజీ?” అడిగాడో భక్తుడు. 

“అవును. కాలానికి సంబంధించిన రహస్యాలు మనకి అర్ధం కావు. అది మన మేధో శక్తికి అతీతతమైనది. జాగ్రత్తగా గమనిస్తే ప్రతి వ్యక్తి పుట్టుక వెనకా ఓ సృష్టి రహస్యం ఇమిడేవుంటుంది” చెప్పారు స్వామీజీ. 

“ఎక్కడో పోర్ బందర్ లో పుట్టిన గాంధీ ప్రపంచానికి అహింస అనే అద్భుతమైన ఆయుధాన్నిచ్చి శాంతిని స్థాపింపచెయ్యలేదా? అంతెందుకూ… అగ్గిపుల్ల దగ్గర్నుంచి అణ్వస్త్రాల వరకూ కనిపెట్టిన మహానుభావులందరూ మానవాళి ప్రగతికి చేసిన శ్రమనూ త్యాగాలనీ మనం మర్చిపోగలమా? ఆర్ధిక సాంఘిక, సాంకేతిక, విద్యా, వైద్య, రవాణా, ప్రయాణ రంగాల్లో మానవుడు సాధించిన ప్రగతికి కారకులందరూ మనకోసం కాలం సృష్టించిన పుణ్యపురుషులు కాలరా?” మళ్ళీ ఆగారు స్వామీజీ. 

మనం ప్రగతి అనుకునే ఈ మార్పులవల్ల నష్టమే లేదంటారా?” అడిగాడు అచ్చిరెడ్డి సుబ్బారావు. 

“చెట్టుకి పూసిన ప్రతి పువ్వూ కాయగా మారాడు. ఒకవేళ కాయిగా మారితే ఆ బరువుకి చెట్టే నేలరాలిపోతుంది. సైన్సు తెచ్చే ప్రతిదీ మానవాళికి ఉపయోగపడనక్కరలేదు. కానీ ప్రతి ప్రయోగము, ప్రతి నిర్వచనము కూడా ప్రగతికి ఏదోనాడు మెట్లుగా మారతాయి. ఆ నమ్మకం నాకుంది. ఎందుకంటే నా దృష్టిలో ఇండియన్ ఫిలాసఫీ అంటే ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ సైన్స్” అని ముగించారు స్వామీజీ.

అయ్యా ప్రతి పుట్టుకకీ ఓ అర్ధం వుంది. అందుకే ఎప్పుడూ నిరాశకీ నిస్పృహకీ లోను కాకూడదు. గెలుపోటములు కావు….. జీవితపు విలువని నిర్ణయించేది. మనలో వున్నా మంచి చెడులే మన జీవితాన్ని నిర్వచిస్తాయి. 

సమస్త లోకాస్సుఖినో భవంతు. 

మళ్ళీ కలుద్దాం. 

మీ 

భవనచంద్ర

© 2020 Chaitanyam Magazine. All Rights Reserved.