ఆధ్యాత్మిక పద్యాలయం ఆచార్య అనుమాండ్ల భూమయ్య

కవి,కులపతి,విమర్శకుడు ఆచార్య అనుమాండ్లభూమయ్యగారిని పరిచయం చేయడమంటే కొండను అద్దంలోచూపినట్టే.1976 లో కొరవి గోపరాజు సాహిత్య విశ్లేషణతోమొదలయిన వీరి రచనా వ్యాసంగం ఇటీవల 2019 లోవెలువరించిన తెలంగాణ నాగేటి చాళ్లు దాకా 41 పుస్తకాలతోనిరంతరాయంగా కొనసాగుతూనే ఉంది.పద్యం ,గేయం,విమర్శఅనే మూడు ప్రక్రియలలో ఆరితేరిన చేయి ఆచార్య అనుమాండ్లభూమయ్య గారిది.1973లో జూనియర్ లెక్చరర్ గా మొదలయిన వీరిఉద్యోగపర్వం క్రమంగా లెక్చరర్ గా,రీడర్ గా,ప్రొఫెసర్ గా 2009 వరకుసాగింది.అంతేగాక అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ ఇంఛార్జ్వైస్ ఛాన్సలర్ గా మరోవైపు పొట్టి శ్రీరాములు తెలుగువిశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ గా 2011 దాకా పదవీ బాధ్యతలునిర్వహించిన ప్రజ్ఞాశాలి, పండిత వరేణ్యులు ఆచార్య అనుమాండ్ల భూమయ్య. పాఠశాలలోచదివే రోజుల్లో పద్యాల భూమయ్యగా పేరుకెక్కిన భూమయ్యగారుతమ విశ్రాంత పర్వంలో ఆ పేరును నిలబెట్టడానికి,తన పద్యప్రేమనుప్రకటించుకోవడానికి అత్యాధునిక అంతర్జాల మాధ్యమంలోపద్యాలయం అనే ఒక పద్యప్రియ బృందాన్ని నిర్వహించటం అదేపేరుతో పద్యప్రక్రియను ప్రోత్సహించడానికి ఆరు నెలల కొకసారిపలువురి పద్యరచనలతో పద్యాల యం పుస్తకరూపంలోవెలువరిస్తూ వస్తున్నారు.

అధ్యాపక వృత్తితో పాటు ఆధ్యాత్మిక ప్రవృత్తిని అలవరచుకున్న ఆధునిక యోగి అని చెప్పవచ్చు వీరిని.దేవీ ఉపాసకులు,శంకరుల సౌందర్య లహరిని అతిసరళంగా ఆత్మైకానుభూతితో అనువదించిన ఆధ్యాత్మికవేత్త.వృత్తిలో భాగంగా పలు గ్రంథాలను విశ్లేషించి విమర్శా గ్రంథాలువెలువరించారు.ఛందోబంధురమైన పద్యానికి తమ్ముడు వంటిది లయాన్వితగేయం.మృదు మధురంగా పద్యాలాపన చేసిన ఆయన గొంతు గేయాలను కూడాకమనీయంగా అక్షర రమణీయంగా పాడుకున్నది.అవికూడా ఆధ్యాత్మిక భావగీతాలేదాదాపుగా. వేయినదులవెలుగు వీరి తొలిపద్యకావ్యం.ఆటవెలదులు,తేటగీతులలో దేవీస్తుతి.గుంటూరు శేషేంద్ర శర్మగారు ఈ పుస్తకాన్ని తామరపూలు,కలువపూలు ఉన్నకొలనుతో పోల్చడం రెండు ప్రక్రియల వైశిష్ట్యాన్ని తెలియబరుస్తుంది.ఒకటి పగలు వికసిస్తేమరొకటి రాత్రి వికసిస్తుంది.అంటే నిరంతర వికసిత కాసారం ఆ పుస్తకం. చీకటులచేత బంధింపజేయ బడిన వరమనోహర బాలార్క కిరణమట్లు వదన సౌందర్య లారీ ప్రవాహమట్లు సిందురపు రంగుతే నేది చెలగు దేవి అట్టి సీమంతమునకు నేనంజలింతు సౌందర్య భూమిక,ఎర్ర గోరింట, వెన్నె ల కన్ను,భూమి పుండు,మెదడు పూవు శీర్షికలతోఐదుభాగాలు గల సంపుటం ఈ పుస్తకం.ఇది భూమయ్య గారి తొలి పద్య కావ్యం.ఆతరువాత వెలుగు నగల హంస, అగ్నివృక్షము,జ్వలిత కౌసల్య,ప్రవరనిర్వేదానికి,త్రిజట,చలువపందిరి,అష్టలక్ష్మ గీత,అమృతసేతువు, అరుణా చలరమణీయము,గురుదత్త శతకము అనే పద్య కావ్యాలు వెలువరించారు.

సద్గురువును సేవించిన చాలు కలుగు యోగమదియె కల్గించు యోగసిద్ధి ఇంతనీటిచే ద్రాక్ష ఫలించినట్లు దత్త!గురుదత్త!జయగురుదత్త!దత్త!

ఇది గురుదత్త శతకంలోని పద్యం.స్వామి సచ్చిదానందగణపతి సంస్కృత నీతిమాలసూక్తి మంజరికి స్వేచ్ఛానువాదం ఈ శతకం. అనువాదం కత్తిమీది సాము అని నానుడి.అలాఅనువాదాన్ని కూడా సమర్థవంతంగా నిర్వహించిన ప్రతిభాశాలి భూమయ్య గారు. విశ్వనాథ అంటే విపరీతమైన అభిమానము గలిగిన భూమయ్య గారు వారిదేశిఛందస్సులోని పద్యాలను వారి విధానంలోనే రాయడం ఒక ప్రత్యేకత. ఇది ఒకరకంగా ఛందోబద్ధ వచనమనవచ్చు. సాధారణంగా ఆటవెలది గాని తేటగీతి గానిఇంకా చెప్పాలంటే ఏ రకమైన పద్య పాదమైనా ఏ పాదానికి ఆ పాదంలోనే భావంముగిసిపోతుంది.పోవటమే అభిలషణీయం.ఉదాహరణకు వేమన పద్యపాదం ఒకటిగమ నిస్తే తెలుస్తుంది. ‘అనగననగ రాగమతిశయి ల్లుచునుండు’లో చెప్పవలసిన విషయం లోని ఒక అంశంఅక్కడ విరుగుతుంది.అలా కాకుండా భావం విరగకుండా రాయటం ఒకపద్ధతి.ఒకింత కష్టతరమని కూడా చెప్పవచ్చు.ఆ క్లిష్టతను ఇష్టంగా మార్చుకునిపద్యార్చన చేయడం అనుమాండ్ల భూమయ్య గారి ప్రత్యేకత. వెలుగు నగల హంసలోని ఈ పద్యం మచ్చుకు

ఎంతకాలమా కఠినమౌ హిమశిఖరము లందు మీరట్లు తాండవ మాడనేల? మెత్తని కమలదళముల నొత్తుగా ప రచితి దేవి!

నా తలపైకి రారె దేవి వ్యాసవిస్తరభీతి చే ఎక్కువగా రాయలేకున్నాను. కాని పద్యమంటే మిక్కిలి ప్రేమగలిగిన అనుమాండ్ల గలిగిన భూమయ్య గారు చిన్నప్పుడు పద్యాలు బాగా చదవే వారట.అందుకే పద్యాల భూమయ్య అతని నిక్ నేమ య్యింది. అలాగే మాత్రాఛందస్సులో రాసిన గేయకావ్యాలు ఆనందగీతి,శివానందగీతి,శాంతిగర్భ,సౌందర్య లహరి గీతాలు,అపరోక్షానుభూతి గేయామృత స్రవంతి ,సినారెవైభవము వంటి గేయకావ్యాలు కొన్ని వెలువరించారు.

వాణివీణాశ్రుతులు వాగ్రూపమైనటుల హనుమాజిపేటలో అవతరించె సినారె కప్పురపు వాసనలు గుప్పుమన్నవి రైతు గూనపెంకుల ఇంట గుణము పండిన ఇంట

ఇక యం ఫిల్ కోసం కొరవి గోపరాజు సాహిత్య విశ్లేషణ, పిహెచ్.డి కోసం ‘నాయని సుబ్బారావు కృతులపై పరిశోధన వీరి సాహిత్య శబలతను తెలుపుతాయి. ఇవిగాక వేయిపడగలు ఆధునికఇతిహాసము,వ్యాసభారతి,ఆద్యుడు కట్టమంచ,మాలపల్లి అభ్యుదయ మహాకావ్యము,వ్యాసభూమి,నాయనతో కాసేపు,ఆధునిక కవిత్వంలో దాంపత్యం,కర్పూరవసంత రాయలు:కథా కళా ఝంకృతులు, తెలంగాణ భావ విపంచి (గోల్కొండ కవుల సంచిక),తెలంగాణ చైతన్య స్ఫూర్తి ‘ప్రజలమనిషి’, అంతర్వీక్షణము,ఆంధ్రపురాణము:భారతీయ సంస్కృతి వైభవము,నాయనిసుబ్బారావు, వేమన అనుభవసారము,సౌందర్యలహరి:భావమకరందము,పాలికురికి సోమనాథుడు,ఇందూరుకవిరాజు కొరవిగోపరాజు,శివానందలహరి:భావమకరందము,విమర్శవిద్యాలసార్వభౌమం అట్లేఇటివల నందిని సిధారెడ్డి రచనలమీద సహేతుక విమర్శ నాగేటి చాళ్లు అనే పలువిమర్శా వ్యాస సంపు టుల వెలువరించిన వారు ఆచార్య అనుమాండ్లభూమయ్య. ఇవే గాక పలు పుస్తకాలకు సంపాద కత్వం వహించారు.అనేక పత్రికలకువ్యాసాలు, ఎందరి పుస్తకాలకో పీఠికలు రాసిన నిరంతర రచనాశీలి భూమయ్య గారు.

5 సెప్టెంబరు 1951 న కరీంనగర్ జిల్లా చొప్పదండి సమీపంలోని వెదురుగట్టలోజననం.పద్మశాలి కుటుంబం.అనుమాండ్ల లసుమయ్య,శాంతమ్మల ఏడుగురు పిల్లలలో ఐదవవారు. ప్రాథమికవిద్య వెదురుగట్టలో, చొప్పదండి జిల్లాపరిషత్ ఉన్నతపాఠశాలలో హెచ్చెస్సీ, కరీంనగర్ ఎస్సారార్ కళాశాలలో పియూసి,జగిత్యాలలో డిగ్రీ,హైదరాబాద్ ఆర్ట్స్కాలేజీలో ఎం.ఏ,వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయం నుండి పిహెచ్డీ చేశారు. వీరి వేయినదులవెలుగుకు తెలుగు విశ్వవిద్యాలయంవారి సాహిత్య పురస్కారంలభించింది.ఇదే పుస్తకానికి కాకినాడ గరికపాట పురస్కారం లభించింది.తణుకునన్నయభట్టారక పీఠం వారిచే వెలుగు నగల హంసకు పురస్కారం దొరికింది.ఇలాచెప్పుతూ పోతే చాలా ఉన్నాయి వీరు పొందిన సన్మాన సత్కారాలు. సహృదయులు,సత్కవి,పండితుడ ప్రాచార్యుడు,బహు పుస్తక గ్రంథ కర్త,మంచివక్త,పరిపాలన నిర్వహణ దక్షుడు అన్నింటికి మించి స్మేహశీలి స్మితవదనుడు ఏడుపదుల వయలసుదాటినా పడుచుదనంతో కనిపించే ఆరోగ్య సౌభాగ్యవంతుడు ఆధ్యాత్మిక భావ సంపన్నుడు అనుమాండ్ల భూమయ్య గారు తెలంగాణా ముద్దుబిడ్డ.ఆయనకలం నుండి ఇంకా అనేకరచనలు వెలువడాలని ,అనేక విశిష్ట పురస్కారాలతోసత్కరింప బడాలనీ,వారి జ్ఞాన సంపత్తి భావితరాలక స్ఫూర్తి గా నిలవాలనికోరుకుంటూ ముగిస్తున్నాను.

© 2020 Chaitanyam Magazine. All Rights Reserved.