మా ఊరి నందుల ఆత్మీయ కధ

నన్ను వదిలేయ్ … నేను వెళ్ళిపోతా’ అంటూ అరుస్తూ వుంటుంది దయ్యం. ఆ తరువాత ఓ గంటసేపు నెమ్మదిగా దయ్యం దిగిపోతుంది. ఇది రోజూ జరిగే తంతు. ఆ తరువాత కొద్దిరోజులకు ‘గంటల దయ్యం’ పట్టింది సుబ్బరాయుడిని. భజన జరుగుతుండగానే విసురుగా లేచి పరుగెత్తుతాడు. గంటలు గల.. గలమని మోగుతుంటాయి. అయితే ఆయన దగ్గర గంటలు వుండవ్. అలా పరుగెత్తి పెద్దబావిలో స్నానం చేసి మళ్ళీ వచ్చి గంటలు మోగిస్తుంటాడు. కొద్దిసేపటికి గంటల గలగలలు ఆగిపోతాయి. దయ్యం దిగిపోతుంది. మరికొద్ది రోజులకు నోటి క్యాన్సర్ తో చనిపోయినవాళ్ళ చిన్నాన్న ‘బాబయ్య’ దయ్యమై పట్టినాడు. ఊర్లో ఎవ్వరికి దయ్యం పట్టినా… ఈ బాబయ్య దయ్యం సుబ్బారాయుడి వొంట్లోకి వచ్చి ఆ దయ్యాన్ని వదలగొడుతుంది. ఇది మా ఊరి దయ్యాల కథ.

వైద్యులు – భూతవైద్యులు

ముందుగా భూతవైద్యుల గురించి తెలుసుకుందాం. దయ్యాలు, భూతాలూ వున్నచోట భూతవైద్యులు వుండి తీరుతారు. ఈ భూతవైద్యుల్లో ప్రముఖుడు ‘కళ్ళేగాడు’. ఈయన అసలు పేరు తెలియదు గానీ అందరూ ఈ పేరుతోనే పిలిచేవారు. ఈయన ప్రవర్తన కూడా విచిత్రంగా వుంటుంది. వేషధారణ కూడా విభిన్నంగా వుంటుంది. వొంటెద్దు బండికి అందరూ ఎద్దును కట్టి తోలుతారు. ఈయన దున్నపోతును కట్టి తోలుతాడు.

ఒకసారి మంచి ఎండాకాలంలో ఎండలు మండిపోయే మిట్టమధ్యాహ్నం పూట దున్నపోతును కట్టిన వొంటెద్దు బండిలో పోరుమామిళ్ళకు బయలుదేరాడు. కొంత దూరం పోయాక చెరువుగట్టున పోతూ వుంటే అప్పుడప్పుడే ఎండిపోతున్న చెరువులో బురద కనిపించింది దున్నపోతుకు. ఎండాకాలంలో బురద చూస్తే దున్నపోతు ఊరుకుంటుందా? బండితో సహా అది పరుగుపెట్టి నడుములోతు బురదలో హాయిగా సేదతీరింది. కళ్ళేగాడు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బయటపడ్డాడు.

ఈయన ఎక్కువగా ‘దిష్టి’ తీయడం చేసేవాడు. నమ్మకం వున్నవారు స్వస్థత పొందేవారు. మా నాన్నగారు కూడా భూతవైద్యం చేసేవారు. అయితే దయ్యం పట్టినవారిని ఇంటికి పిలవటంగానీ, ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళడంగానీ చేసేవారు కాదు. రెండు, మూడు గంటలు పూజ చేసి రాగి రక్షరేకు మీద ఏవో బీజాక్షరాలు వ్రాసి తాయెత్తు ఇచ్చేవాడు. అది కట్టుకుని తిరిగేవారు. చాలామంది స్వస్థత పొందారు. వైద్యుల విషయానికి వస్తే ప్రముఖంగా చెప్పుకోవలసింది డాక్టర్ అయిలావజ్ఝుల రామకృష్ణ శాస్త్రి. చక్కటి రూపం, ఆకట్టుకునే మాటతీరు, నిస్వార్ధ సేవ. ఆ రోజుల్లోనే మదరాసు రిజిస్టర్డు మెడికల్ ప్రాక్టీషనర్ గా పట్టా పుచ్చుకుని వచ్చినవారు. గవర్నమెంటు ఆసుపత్రిలో డాక్టర్ గా పనిచేసేవారు. తన జీవితకాలం మొతం ఆయుర్వేద మందుల తయారీకి, మూలికల వేటకు వెచ్చించినవారు. మూలికా వైద్యం కొరకు నల్లమల అడవులను జల్లెడ పట్టినవారు. సాధు, సన్యాసులు ఎవరు వచ్చినా నెలల తరబడి ఇంటిలో ఉంచుకుని ఆతిధ్యం ఇచ్చి మూలికా వైద్యం నేర్చుకున్నారు.

వీరు కూడా గౌతమస గోత్రీకులే. వారి ఇంటిలో పుట్టిన సంతానం అందరూ పుట్టుకలోనే మరణించటం, పిల్లలు దక్కటంలేదని వారి తల్లిగారు శేషమ్మగారు మా ఇంటిలో కానుపు చేసుకున్నారు. అంటే మా ఇంటిలో పుట్టిన మొదటి మగసంతానం ఈయనే. సగోత్రీకులు. మా యింట జన్మించినవారు అవటంవల్ల మేము ఈయనను ‘పెద్దన్న’గా భావిస్తాం. వారు కూడా అంతే ఆప్యాయతతో మా అమ్మ, నాన్నలను పిన్నమ్మ, చిన్నాన్న అని పిలిచేవారు. సంస్కృత పాండిత్యంలో దిట్ట. కాళిదాసు కావ్యాలు కొట్టినపిండి. మధురమైన కంఠంతో, శ్రావ్యమైన ఉచ్చారణతో సంస్కృత శ్లోకాలు చదువుతుంటే… ఎంతసేపైనా వినబుద్ధి వేసేది. అనారోగ్యంతో మందుల కొరకు వచ్చిన పామరులకు, సామాన్యులకు, విద్యార్ధులకు, విద్యాధికులకు కూడా కాళిదాసు కావ్యాల నుండి శ్లోకం చదివి, అర్ధమయ్యే విధంగా వివరించి చెప్పేవారు. రోగికి సగం రోగం ఆ శ్లోక పఠనం వల్ల, ఆ శ్రావ్య శబ్దం వల్ల తగ్గుతూపోయేది.

గవర్నమెంటు డాక్టరుగా పదవీ విరమణ చేసిన తరువాత కొద్దిరోజులు రాజకీయరంగ ప్రవేశం చేసి గ్రామ పంచాయతీకి సర్పంచిగా ఎన్నికై కొంత ‘బురద’ పూసుకుని, అది భరించలేక బయటకి వచ్చాడు. తదుపరి వైదిక విద్యలవైపు చూపు మరల్చి శుభాశుభ కార్యాల నిర్వహణకు శిష్య బృందాన్ని తయారుచేసి పంపారు. ఆ తరువాత ఆలయాలు, ప్రతిష్ఠలు, జపతపాలు అంటూ శిష్య బృందంతో పర్యటనలు చేస్తూ నూతన ఆలయాలలో ప్రతిష్ఠలు చెయ్యటానికి పుస్తకాన్నే రచించి, ముద్రించి, సహస్ర ఆలయప్రతిష్ఠలు గావించి లబ్ధప్రతిష్టులైనారు రామకృష్ణ శాస్త్రులవారు. ఇది వ్రాసేనాటికి వారి వయస్సు దగ్గర దగ్గర తొంభై పైనే వుండవచ్చు. ఇప్పటికీ అదే చలాకీతనం, అదే సౌశీల్యం. భాకరాపేట పండితతోటలో వెలసిన అసలు సిసలు తులసి మొక్క. చిన్నపిల్లల వైద్యానికి వస్తే భాకరాపేటలో మొదటగా చెప్పుకోవలసింది మా అమ్మ ‘నందుల సుబ్బమ్మ’ గారు. వారిది మదనపల్లె.

మా మాతామహులు ‘ఆయుర్వేద భిషగ్వర’ బిరుదాంకితులు. ఇంటిలోనే మందులు తయారుచేసేవారు. సంవత్సరానికి ఒకసారి అమ్మ మదనపల్లె వెళ్లి కావాల్సిన మందులన్నీ మూటకట్టుకుని వచ్చేది. అది కాకుండా అమ్మకు చిన్నపిల్లల విషయంలో చాలా చిట్కాలు తెలుసు. చిన్నపిల్లలకు ఏ అనారోగ్యం వచ్చినా ముందు అమ్మ దగ్గరకు వచ్చేవారు. మొదటి ‘మందు’గా చిన్నపిల్లలకు మా అమ్మ చేసే ‘చారు’ చాలా బాగా పనిచేసేది. అమ్మ చేసే చారులో ధనియాలు, మిరియాలు, జీలకర్ర, ఇంగువ, రాతిపూట మొదలైనవన్నీ పుష్కలంగా వుండేవి. ఇంగువ ప్రత్యేకంగా మదనపల్లె నుండి తెచ్చుకునేది. సాయంకాలం వంటకంలో వేడి వేడి చారు పెద్ద ‘రాచిప్ప’లో మరుగుతూ వుంటుంది. కరివేపాకు, కొత్తిమీర ఈ మరిగే చారులో జలకాలాడుతుంటాయి. సగం ఊరికి ఈ చారు వాసన ఘుమఘుమలాడుతూ వుంటుంది. పొయ్యిపై దించిన తరువాత కూడా చాలాసేపు రాచిప్పలో చారు మరుగుతూ వుంటుంది. సాయంకాలం వరకు వేచివుండి అనారోగ్యంతో వుండిన పిల్లల తల్లిదండ్రులు ఇంటిముందుకు వచ్చి మసక చీకటిలో ‘అమ్మా! సందాకవళం’ అని అరుస్తారు. అమ్మకు తెలుసు అది ‘చిన్నపిల్లలు అనారోగ్యంతో వున్న తల్లుల ఆక్రందన’ అని. వెంటనే వారి అన్నం, వేడి వేడి చారు గిన్నెలో పోసుకుని పోయి వాళ్ళ గిన్నెల్లో పోస్తుంది.

ఎవరు అని అడగదు, వాళ్ళు చెప్పరు. మూడు సాయంకాలాలు ఈ విధంగా చారు, అన్నం తింటే ఎలాంటి అనారోగ్యమైనా పిల్లలకు మటుమాయం. ఎందుకంటే ఈ చారులో రోగాన్ని నిర్మూలించి, రోగనిరోధక శక్తిని పెంచే ఔషధ గుణాలు ఉండేవన్నీ వున్నాయి కాబట్టి. మూడురోజులకు తగ్గకుంటే అప్పుడు చిన్నపిల్లల మందుబిళ్ళలు వాడుతుంది. సాధారణంగా చిన్నపిల్లలకు వచ్చే అనారోగ్యసమస్యలను నివారించి తల్లులకు తగిన పథ్యం కూడా చెప్పేది. అమ్మ తరువాత చిన్న పిల్లల వైద్యుడిగా పేరుపొందింది నందిపల్లె దస్తగిరి’. వీరి నాయన కూడా నాటు వైద్యుడే.

తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన విద్యను పాటిస్తూ వుంటాడు. మనిషి ఎత్తుగా, లావుగా, పెద్ద పొట్టతో ఎప్పుడూ చిరునవ్వుతో వుంటాడు. తన వ్యవసాయం పనులు తను చేసుకుంటూ చిన్నపిల్లలకు మందులు తయారు చేసి ఇచ్చేవాడు. నాడి చూసి, కఫ, వాత, పిత్త వికారాలను గమనించి తగిన మందులు యిస్తూ తనకు తోచిన సేవ చేస్తుండేవాడు. ఊరిలో ‘మంగలి నడిపి’ అని రణ(వ్రణ) వైద్యుడు వుండేవాడు. పుండ్లు పడి దీర్ఘకాలం పీడించే పండ్లకు రణ వైద్యం చేసేవాడు. గజ్జి, తామర లాంటి వాటికి వైద్యం చేసేవాడు. పశువైద్యుడు మన్నెం రామన్న. ఊరిలో ఏ ఎద్దుకైనా, బఱ్ఱె కైనా అనారోగ్యంగా వుందంటే వెంటనే మన్నెం రామన్నను పిలిచేవారు. బర్రెలు పాలు ఇవ్వకపోయినా, ఇచ్చిన పాలు దుర్వాసన వస్తున్నా, బర్రెలు ఈనటం కష్టంగా వున్నా మన్నెం రామన్న చెయ్యి తగిలితే చాలు బాగైపోయేవి. కొత్తగా సేద్యం నేర్చుకునే ఎద్దులకు అర్రుపుండు అయితే నాలుగు రోజుల్లో ఆకుపసరుతో తగ్గించేవాడు. అన్నిటికీ మూలికా వైద్యం చేసేవాడు. శాస్త్రవేత్త మా ఊర్లో కోమటి వెంకటసుబ్బయ్య అంటే ఎవరికీ తెలియదు. ‘శెట్టి’ అంటేనే అందరికీ తెలుసు. (ఇంకా ఉంది)

© 2020 Chaitanyam Magazine. All Rights Reserved.