బహుముఖ ప్రజ్ఞాశీలి – రావి కొండలరావు

(గత సంచిక తరువాయి)

తొలి చిత్రం ‘శోభ’ అయినా, నటుడిగానే కొనసాగించాలని నిర్ణయించుకున్న చిత్రం ‘దాగుడుమూతలు’. నటుడన్నవాడు ఒకే తరహా మూస పాత్రలకే పరిమితం కాకూడదన్న ఉద్దేశంతో “అర్ధ రాత్రి” సినీమా లో పక్కా విలన్ పాత్ర నటించారు. చిన్నప్పటినుండీ నాటకాలంటే అమితమైన ఆసక్తి కల కొండలరావు “నాలుగిళ్ళ చావిడి” “పట్టాలు తప్పిన బండి” “ప్రొఫెసర్ పరబ్రహ్మం” “కుక్క పిల్ల దొరికింది” ఇలా ఎన్నో బహుళ ప్రజాదరణ పొందిన నాటకాలు రచించారు. వాటిల్లో ప్రొఫెసర్ పరబ్రహ్మం నాటకం దేశ వ్యాప్తంగా 50 సార్లు ప్రదర్శింప బడింది. అలాగే కొండలరావు గారి అన్నయ్యకు ఆర్. కె. రావు గారు మోనోయాక్టర్ గా లభించిన కీర్తిని పురస్కరించుకుని, విజయ నగరంలో 1960లో రాజ్యలక్ష్మి ఫౌండేషన్ వారి సభ ఏర్పాటు చేశారు.

ఆ అభినందన సభకు గుమ్మడిగారు ముఖ్య అతిధిగా విచ్చేసారు. రమణా రెడ్డిగారి మ్యాజిక్ ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ సభ విశేషం ఏమిటంటే కొండలరావు గారి అన్నదమ్ములు ఏడుగురూ … అందులో సన్మాన గ్రహీత ఆర్. కె . రావు తప్పించి, మిగిలిన ఆరుగురు సోదరులు, కొండలరావు వ్రాసిన ‘కుక్కపిల్ల దొరికింది’ నాటకం ప్రదర్శింపబడింది.

ఇలా ఒక అన్న తమ్ముడికి సత్కారం జరుగుతుంటే, తక్కిన సోదరుల్లో ఒక సోదరుడు రాసిన నాటకాన్ని సోదరులంతా కలిసి ప్రదర్శించడం గొప్ప విశేషం. బహుశా ప్రపంచం లోనే ఇది ఒక రికార్డు.

1960 లో సహజ నటి రాధా కుమారితో వివాహం 1952 –53 లలో శ్రీకాకుళం నుంచి విజయనగరం రాఘవ నాటకోత్సవాల్లో పాల్గొనడానికి వెళ్ళినప్పుడు, విజయనగరం లో ఉండే జె. వి. రమణమూర్తి, సోమయాజులు బృందం వేసిన,ఆత్రేయ వ్రాసిన “ఎన్. జి. ఓ” నాటకంలో మొదటిసారి రావి కొండలరావు చూడడం తటస్థించిం ది. ఆ సంవత్సరం ఆమెకు ఉత్తమ నటి బహుమతి వచ్చింది.

ఆ తర్వాత కూడా పలు పర్యాయములు నాటక ప్రదర్శ నలలో కలుసుకుంటూ ఉండడం, రాధాకుమారి చాలా సార్లు ఉత్తమ నటిగా బహుమతులు పొందడం జరుగుతూనే ఉంది. అప్పటికే రావి కొండలరావు గారు సినీ ఫీల్డ్ లో….. సహాయ దర్శకునిగా పని చేస్తున్నారు. రాధా కుమారి కూడా తన కున్న నటనానుభవంతో చలన చిత్ర సీమలో కాలు పెట్టాలని ప్రయత్నిస్తోంది. కానీ ఆ రోజుల్లో సినిమాల్లో నటించడం అంత సులభం కాదు కదా!

కొండలరావు గారి సిఫార్సు మీద తొలి సారిగా డబ్బింగు కు ప్రయత్నించడం మొదలు పెట్టింది రాధాకుమారి. రాధాకుమారిని తీసుకుని డబ్బింగ్ కు ప్రయతించే సమయంలో వివిధ స్టూడియోలకు కలిసి తిరగడం లో వాళ్ళ మధ్య ప్రేమ చిగురించింది. కొంత మంది పెద్దలు కూడా ముళ్ళపూడి వెంకట రమణ గారి లాంటి వాళ్ళు —ఇలా తిరక్కండి, హాయిగా పెళ్లి చేసుకోండి అంటూ సలహా ఇచ్చారు. కొండల రావు గారు కూడా ఇష్ట పడ్డారు.ఇంట్లోనే ఒక నటి ఉంటుంది. ఇక నాటకాలు వేసుకోవడానికి ఇబ్బందేం ఉంటుంది? ఇక ముందులా స్త్రీ పాత్ర లేని పాత్ర వ్రాసుకోనక్కర లేదు.

స్త్రీ పాత్రలతో నాటకాలు వ్రాస్తే భార్యకు భార్య, నటికి నటి కలిసి వస్తాయి అనుకున్నారు. మొదట పెద్ద వాళ్ళకా విషయం నచ్చ లేదు. కొండలరావు గారి తల్లి ముందు సమ్మతించక పోయినా, తరువాత మీ ఇష్టం అంది. పెళ్లి పత్రికలూ, శుభలేఖలు కళ్యాణ మండపాలు ఏమీ లేవు. ఇద్దరూ ఒక రోజు తిరుపతి వెళ్లి, స్వామి సాక్షిగా, అక్కడే రాధాకుమారి మెళ్ళో తాళి కట్టారు రావి కొండలరావు గారు 1960 లో. రావి కొండలరావు, రాధా కుమారి దంపతులకు కుమారుడు శశి కుమార్, కోడలు లత, మనుమలు రవి కిరణ్ సాయి కిరణ్. కొండలరావు గారి భార్య రాధా కుమారి 2012 మార్చి లో తనువు చాలించారు. అప్పటి నుండి శ్రీ కొండలరావు గారి ఆరోగ్యం తరచుగా ఇబ్బంది పెడుతూ ఉండేది.

అయినా ఎప్పుడూ నలుగురు కావాలని కోరుకునే కొండల రావు గారు సాహితీ సంగీత కార్యక్రమాల్లో పాల్గొంటూ తను హుషారుగా ఉండడమే కాకుండా, తన చుట్టు పక్కల ఉన్న వాళ్ళను కూడా అందరినీ చైతన్య వంతులను చేయడమే కాకుండా నవ్వుల్లో ముంచెత్తుతుండేవారు. కొండలరావు గారు చేసిన తొలి సినిమా రచన “చల్లని నీడ” దీనికి తాతినేని రామారావు గారు దర్శకుడు.

1968 లో విడుదలయ్యింది. కానీ అంత విజయవంతం కాలేదు. అప్పటికీ ఆయన (కొండలరావు గారు) సినిమా పత్రిక విజయ చిత్ర లో “సబ్ ఎడిటర్ ” గా పని చేస్తుండేవారు. ఆ రోజుల్లో విజయ చిత్ర చాలా ఆకర్షణీయంగా, బహుళ జనాదరణ పొందిన పత్రికగా పేరొందింది. ఆ పత్రిక అంత ఆకర్షణీయంగా రూపొందించడంలో శ్రీ కొండల రావు గారి కృషి ఎంతైనా ఉంది. కొండల రావు గారు విజయ చిత్ర పత్రిక లో 1966 నుండి 1992 వరకు పని చేసారు. అదే విధంగా కొన్ని తరాల పిల్లలకు, పెద్దలకు కధామృతాన్ని అందించిన “చందమామ” పత్రిక నిర్వహణలో కధల ఎంపిక లో కీలక పాత్ర పోషించారు. శ్రీ కొండల రావు. అలా విజయా సంస్థకు అత్యంత ఆప్తుడిగా, నమ్మకస్తుడిగా ఉన్నందువల్ల కాబోలు …. చందమామ – విజయా కంబైన్స్ నిర్మించిన బృందావనం, భైరవ ద్వీపం, శ్రీ కృష్ణార్జున విజయం వంటి చిత్రాల రచన, నిర్వహణ బాధ్యతలను ఆయనకు అప్పచెప్పాల్సిందిగా నాగిరెడ్డి సూచించారు. రావి కొండలరావు గారు ఆ బాధ్యతలను అద్భుతంగా నిర్వహించారు. రావి కొండలరావు, రాధా కుమారి ల జంట ఎన్నో సినిమాలలో భార్యా భర్తలుగా నటించారు. వారిద్దరూ దాదాపు 128 చిత్రాల్లో భార్యా భర్త లుగా నటించారు. భార్యా భర్తలుగా ఉంటూ సినిమాల్లో సెంచరీ కొట్టిన జంట మాది అని ఆయన చెప్పే వారు. ఇదో రికార్డు. బంగారు పంజరం సినిమాలో అయన నటనకు ఉత్తమ సహాయ నటుడి గా నంది పురస్కారం లభించింది. . “పెళ్లి పుస్తకం” చిత్రానికి ఉత్తమ కధా రచయిత గా నంది అవార్డు వచ్చింది. కాలమిస్టుగా ఆంద్ర ప్రభ వార పత్రికలో “బ్లాక్ అండ్ వైట్” పేరుతో వ్యాసాలు వ్రాశారు. ఆ వ్యాసాలతో వచ్చిన గ్రంధానికి ఉత్తమ సినీ రచన కేటగిరి లో నంది అవార్డు వచ్చింది.

ఇక రావి కొండల రావు గారి ప్రస్థానం చెప్పాలంటే

 • రంగ స్థలం మీద తొలి పాత్ర -10 వ ఏట తొలి బాలల రచనలు
 • 1946-47 అచ్చయిన మొదటి కధ -దైవేచ్ఛ (యువ 1948)
 • తొలి నాటిక “స్వయం వరం” -1952
 • ప్రసిద్ధ నాటిక -“కుక్క పిల్ల దొరికింది -భారతి ” -1952 డిశంబరు.
 • తొలి పత్రికా ఉద్యోగం -“ఆనంద వాణి”- (1956)
 • సినిమా లో తొలి వేషం -(శోభ “)-1958
 • వివాహం -1960
 • ఆంద్ర జ్యోతి సినీమా విలేఖరి -1965
 • పేరు తెచ్చిన చిత్రం -“ప్రేమించి చూడు “-1965
 • “విజయ చిత్ర పత్రికా నిర్వహణ” -1966 1992.
 • ఉత్తమ సహాయ నటుడిగా నంది పురస్కారం -బంగారు పంజరం(1969)
 • దర్శకత్వం వహించిన తొలి నాటిక -స్వయం వరం ఆలిండియా రేడియో నాటికలు – 100.

ఇదొక రికార్డు పేరు గాంచిన నాటకాలు

నాలుగిళ్ళ చావిడి, పట్టాలు తప్పిన బండి, ప్రొఫిసర్ పర బ్రహ్మం, ( దేశ వ్యాప్తంగా 50 సార్లు ప్రదర్శితం) స్వర్ణ నంది –‘ పెళ్లి పుస్తకం’ కధకు ( 1992 ) ఉత్తమ పుస్తకానికి నంది పురస్కారం —బ్లాక్ అండ్ వైట్ (2005) హైదరాబాదుకు 2005 లో వచ్చారు .

ఇక అవార్డులు, రివార్డుల విషయానికి వస్తే,

నాటక రంగంలో పని చేసిన సేవకు 2001లో పొట్టి శ్రీరాములు విశ్వ విద్యాలయము వారి పురస్కారం “కన్యా కుమారి” సీరియల్ (దర్శకుడు ) లో 2004 లో 9 నంది పురస్కారాలు, 2008లో USA వారి రామినేని ఫౌండేషన్ అవార్డ్, గరిమెళ్ళ రామమూర్తి రంగ స్థల పురస్కారం, 2009 లో జంధ్యాల స్మారక పురస్కారం, భారత్ కల్చరల్ ఇంటి గ్రేషన్ కమిటీ బహుమతులు (రూ.1,00,116/- తో సహా) విన్న కోట రామన్న పంతులు రంగ స్థల పురస్కారం, 2011 లో ఎ ఎన్ ఆర్ స్వర్ణ కంకణం, సమైక్య భారతి వారి రావి కొండల రావు నాటకోత్సవ సందర్భంగా సన్మానం, నిజామాబాద్ నాటక పరిషత్ వారి స్వర్ణోత్సవ సందర్భంగా పురస్కారం, 2012 లో ఎమినెంట్ జర్నలిస్ట్ అవార్డ్, నండూరి సుబ్బారావు పురస్కారం, వంగూరి ఫౌండేషన్ (USA) వారిచే లైఫ్ టైం ఎచీవ్ మెంట్ అవార్డు, 2014లో కొండల రావు 82 వ జన్మ దినాన్ని పురస్కరించుకుని రవీంద్ర భారతిలో గురు సత్కారం, లక్ష రూపాయల నగదుతో, అజో –విభో –కందాళ ఫౌండేషన్ వారి జీవిత కాల సాధన పురస్కారం 2015 లో . .. ఇంకా అనేకానేక పురస్కారాలు, సన్మానాలు, రావి కొండలరావు గారి నైజం విభిన్నంగా ఉండేది.

వారు ఉన్న దానితో సంతృప్తి చెందేవారు. బాల్యం నుండీ అన్నింటిలో ముందుండాలని గెలుపు సాధించాలని అందరు కోరుకున్నట్లు వారు కోరుకోలేదు. ఎక్కడికక్కడ సర్దుబాటు చేసుకోవడమే వారి కిష్టం కాబోలు. చదువులోనైనా అంతే, చేసిన సినీమాల్లో నైనా అంతే, ఉద్యోగం లోనైనా అంతే, వ్రాసి ప్రదర్శించిన నాటకాల్లోనైనా అంతే. వారి స్పెషాలిటీ వారిదే. నాటక ప్రదర్శనలు జరుగుతూంటే ఎంతో పెద్ద పెద్ద పేరున్న సంస్థలు పోటీలో పాల్గొంటుండగా, వాటికి బహుమతులు ఖాయమనుకుంటున్న సందర్భాల్లో, అనూహ్యంగా వీరి నాటకానికి బహుమతులు రావడం. కొండలరావు గారు సరస చతురుడు.

హాస్యానికి పెద్ద పీట వేసేవారు. వారితో మాట్లాడుతుంటే రోజులు సైతం నిముషాల్లా గడిచిపోతాయి. వారి చతురోక్తులు విందామని కాబోలు, ఆ భగవంతుడు కొండలరావు గార్ని 88 సంవత్సరాల వయసులో తన దగ్గరకు పిలి పించుకున్నాడు. జూలై 28 వ తేదీన హఠాత్తుగా గుండెపోటుతో, హైదరాబాదులో ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. తనకెంతో ఇష్టులైన శ్రీ బాపు-రమణ గార్లతో ఇష్టాగోష్టి జరపడానికి సురలోకానికి తరలిపోయారు. అశేష సాహితీలోకం, చలనచిత్ర పరిశ్రమ శ్రీ కొండలరావు మృతికి నివ్వెరపోతూ నివాళులర్పించింది. ఒక బహుముఖ ప్రజ్ఞాశీలి నింగికెగసి, కాంతులు విరజిమ్మాడు.

శ్రీ కొండలరావు బాబయ్య గారితో నాకున్న ప్రత్యక్ష పరిచయం సుమారు 2 సంవత్సరాలు. వారు అధ్యక్షులుగా ఉన్న ‘సాహిత్య సంగీ’త సమాఖ్య’ లోనూ, ‘సునాద వినోదిని’ లోనూ నేనుకూడా సభ్యుడిగా ఉండడం, ఆ కార్యక్రమాల్లో కొద్దిగా ఉత్సుకతతో పాల్గొనడం వల్ల, నాకు వారితో సాన్నిహిత్యం ఏర్పడింది. వారినెప్పుడూ బాబయ్యగారని పిలచేవాడిని. ప్రతీ నెలా రెండవ ఆదివారం, మోతీనగర్ లో ఉన్న వారింట్లో జరిగే సమావేశాల్లో వీలు కుదిరినప్పుడల్లా వెళ్ళడం, శ్రీ ఆకెళ్ళ, సిరివెన్నెల, వైజాగ్ ప్రసాద్, రాళ్ళపల్లి, రేలంగి నరసింహారావు శ్రీమతి విజయదుర్గ మొదలైన హేమాహేమీలతో పరిచయం ఏర్పడడం, అడపా తడపా శ్రీ కొండలరావు బాబయ్య గారు కూడా ఫోన్లో పలకరించడం ఒక మహాద్భాగ్యంగా పేర్కొనదగ్గ విషయం.

కొండలరావు గారితో పరిచయం అయ్యాక వారు నిర్వహించిన సమావేశాల్లో సుమారు 6, 7 సమావేశాల్లో పాల్గొనడం జరిగింది. ఈ పైన తెలిపిన విషయాలన్నీ, కొండలరావు గారి జీవన ప్రయాణం గురించి సవివరంగా తెలియజెప్పిన ఈ కథనం – శ్రీ రావి కొండలరావు గారి స్వీయరచన ‘నాగావళి నుంచి మంజీర వరకు’ (ఒక విధంగా ఆయన ఆత్మకధే) నుంచి సేకరణే. అంటే ఒక విధంగా ఈ వ్యాసానికి ప్రేరణ, రచన కూడా శ్రీ రావికొండలరావు బాబయ్యగారే.

అతి తక్కువ పరిచయం వున్నా, వారు మాకు పంచిన ప్రేమానురాగాలు అనన్యమైనవి. వారికి సద్గతులు కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఆయనకే ఈ వ్యాసం అంకితమిస్తున్నాను. పోడూరి శ్రీనివాసరావు

© 2020 Chaitanyam Magazine. All Rights Reserved.