ప్రేమంటే ఇంతే

(గతసంచిక తరువాయి)……

నరసింహారా వుగారు బ్రాహ్మణ పుట్టుక పుట్టి రోజూ దేవునికి దీపం కూడా పెట్టడు, నిత్య పూజలు చేయడు, మోహన్ కూడా అంతే. ఇక వారికి వున్న ఆస్థిపాస్తులు వారి ఉద్యోగాలు మాత్రమే. అన్నింటికన్నా ముఖ్యమైన విషయం మోహన్ వాళ్ళది హరితస గోత్రం, మన గోత్రం గౌతమస కానీ నేను దత్తుడిని, నా జనక సంబంధం గోత్రం హరితస అవడం వలన ఈ తరం వాళ్ళకి అంటే నా పిల్లలికి హరితస గోత్రం వారినిచ్చి పెళ్ళి చెయ్యకూడదు, మనవలకి చెయ్యొచ్చు. రెండవది పెళ్ళి సంబంధం కలుపుకునేటపుడు గోత్రాలలో ఋషులు కూడా కలవకూడదు. హరితస గోత్రం లోని, గౌతమస గోత్రంలోని మొదటి ఋషి ఆంగీరస, శాస్త్ర ప్రకారం సగోత్రీకుల వివాహం నిషిద్దము. అందుకని మోహన్కి అనూరాధనిచ్చి వివాహం చేయడానికి నేను సమ్మతించను” అని నిక్కచ్చిగా చెప్పారు విశ్వనాధంగారు.

విశ్వనాధంగారు తన బాబయ్యని విమర్శించినందుకు వైదేహికి మనస్తాపము కలిగి “మా పుట్టింటివారు ప్రాచీన సాంప్రదా యాలు, అలవాట్ల పట్ల గౌరవం వున్నవారు, అయితే చాందస భావాలను సమర్ధించరు. మా వాళ్ళందరూ ప్రగతిశీల భావాలు వున్నవారు. ‘శ్రీమహావిష్ణువు తన దశావతారాలు వివిధ జంతువుల రూపాలలోను, వివిధ కులాలలోను జన్మించి ఆ పరమాత్ముడు తాను సర్వాంతర్యామినని, సమస్త జీవకోటిలోని తానేనని, అన్ని కులాలు సమానమేనని తెలియజేసాడు’. ఆ పరమాత్మ బోధనలయందు విశ్వాసము వున్నవాళ్ళు గనుక ఆ వివాహాన్ని అంగీకరించారు. ఇకపోతే రోగాలనేవి ఎప్పుడు ఎవరికి వస్తాయో ఎవ్వరూ చెప్పలేరు. మానవసేవే మాధవసేవ అని నమ్మిన వ్యక్తి మా బాబయ్య, ఆయన ఎన్ని గుప్త దానాలు చేసారో, ఎంతమందికి ఎన్ని రకాలుగా సహాయపడ్డారో మీకు తెలియదు, చేసిన సహాయాన్నిగాని, దానాన్నిగాని అతనుగా మూడో వ్యక్తి చెప్పని మహోన్నత వ్యక్తిత్వమున్న మనిషి మా బాబయ్య.

ఆయన నాస్తికుడు కాదు, దీపాలు, నైవేద్యాలు పెట్టకపోయినా రోజూ స్నానం చేసినాక పూజగదిలోకి వెళ్ళి భగవంతునికి నమస్కారం చేసుకొంటారు, ఆలయాలకి, పుణ్యక్షేత్రాలకి వెళతారు…నా చిన్నపుడు ఒకసారి “‘బాబయ్యా నువ్వు పూజలు చెయ్యవుకదా మరి రోజూ దేవునికి నమస్కారం చేసి ఏ స్తోత్రం పఠిస్తావు?” అని అడిగాను. దానికి ఆయన “ఎదట మనిషి నిస్సహాయస్థితిలో వున్నపుడు ఆ మనిషికి సహాయం చేయగలిగే శక్తిని ప్రసాదించు తండ్రి అని భగవంతుడిని వేడుకొంటాను” అన్నారు. అటువంటి మానవతా దృక్పథం వున్న మనిషి మా బాబయ్య, ఆ తండ్రి నమ్మిన సిద్దాంతాలకి నికార్సయిన వారసుడు నా తమ్ముడు. ఆ మానవత్వం, దయాగుణాలే భగవంతుడు వారికి ఇచ్చిన ఆస్థిపాస్తులు.

ఉంకొక విషయం మా బాబయ్య పిల్లలు పుట్టక ముందే తన పిల్లలికి కానీ కట్నం తీసుకోను, ఇవ్వను అని చెప్పారు, అటువంటి అభ్యుదయ భావాలున్న వ్యక్తి మా బాబయ్య” అని చాలా ఉద్వేగంగా చెప్పింది వైదేహి. వైదేహి ఉద్వేగాన్ని చూసి చర్చ దారి తప్పుతున్నాదని సత్యనారాయణ వైదేహిని కళ్ళతోటే వారించి “పిన్ని నువ్వేమి మాట్లాడటం లేదు, నీ అభిప్రాయం చెప్పు” అని చర్చని కొనసాగించాడు. “మోహన్ చాలా మంచి పిల్లాడు, ఉత్తముడు.

కాకినాడలో వున్నపుడు ఇంట్లో మనిషి లాగ మాతో కలిసిపొయి చాలా సరదాగా వుండేవాడు. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా, సహాయం చేయడానికి ముందు వెనుక ఆలోచించకుండా చేసేవాడు, మంచి వుద్యోగం, హోదా వున్నవాడు. నీ పెళ్ళి అయి పన్నెండు సంవత్సరాలు అయ్యింది, అందువలన ఆ కుటుంబం గురించి కూడా ఆలోచించవలసినది ఏమీలేదు. నాకు కాకినాడలో అతనిని నువ్వు తీసుకు వచ్చి మాకు పరిచయం చేసినాక ఒక సంవత్సరం తరువాత మోహన్, అనూని చూసి ఇద్దరి జోడి బాగుంది, మేనత్త మేనమామ పిల్లలులా వున్నారు అనూ గురించి అడిగితే అనే ఆలోచన వచ్చింది, అయితే అప్పుడు వాళ్ళు ఇంకా చదువుకుంటున్నారు. అతను వుద్యోగంలో సెటిల్ అయిన తరువాత నీ ద్వారా వాళ్ళ పెద్దలని అడిగిద్దాము అనుకున్నాను, ఈ విషయం మీ బాబయ్యకి కూడా చెప్పలేదు. మొన్న ఇక సంబంధాలు చూద్దామని అనుకున్నాక మీ బాబయ్యతో చెప్పాను. ఆయన ఈ గోత్రాల విషయం చెప్పి, తనకి ఇష్టం లేదని చెప్పారు. అప్పటిదాకా నేను ఈ గోత్రాల విషయం ఆలోచించలేదు.

ఒక విషయం గోత్రాల గురించి మీ బాబయ్య చెప్పినది వాస్తవం. ఏం చేస్తాము? మనము అనుకుంటాము గాని దైవ నిర్ణయం వేరుగా వుంటుంది” అన్నారు పార్వతమ్మగారు. అప్పటిదాక జరిగిన చర్చ విన్న రవికి విసుగు కోపం వచ్చింది, నిరాశ కలిగింది. “ఏమిటమ్మా ఇది? మనం ఆధునిక యుగంలో వున్నాము. మనిషి చంద్రమండలాన్ని చుట్టి వచ్చిన రోజులలో మీరు ఇలా మాట్లాడుతున్నారు. అనూ చేసిన తప్పేమిటి? అన్య కులస్తుడినో లేదా అన్య మతస్తుడినో ప్రేమించలేదు కదా మీరు అభ్యంతర పెట్టడానికి. ఒక లక్షణమైన కుర్రాడిని, బాగా పరిచయమున్న వ్యక్తిని అదీ బంధువుల అబ్బాయిని, ప్రేమించి తన జీవిత భాగస్వామిని చేసుకుందాము అనుకుంటున్నాది. మోహన్కి ఏం తక్కువ? అందానికి అందం వుంది, చదువుకున్నవాడు, మంచి ఉద్యోగం హోదా వున్నాయి, అభ్యుదయ భావాలున్న వ్యక్తి. అన్నిటికీ మించి అనూని మనసారా ఇష్ట పడిన వ్యక్తి, అందుకని ఏ కష్టము రాకుండా ప్రేమతో చూసుకుంటాడు. ఇలాంటి అవకాశం వచ్చిన అనూ అదృష్టవంతురాలు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా మీరు ఏదేదో చెబుతున్నారు.

నాన్నగారు, అమ్మా దయచేసి ఈ పెళ్ళి ఎందుకు జరగకూడదో కారణాలు చెప్పకుండా, ఈ పెళ్ళి జరిపించే మార్గాన్ని అన్వేషించండి, వారిని విడదీయకండి. అలా విడదీస్తే జరిగే పరిణామాల గురించి ఆలోచించండి” అని చాలా ఆవేదనతో చెప్పాడు రవి. “పిన్నీ, బాబయ్యా…పెళ్లి సంబంధం వచ్చినపుడు, ఈ రకమైన విశ్లేషణ చెయ్యడం సహజం. కాని ఇక్కడ పిల్లలిద్దరూ ప్రేమించుకున్నారు, ఒకరినొకరు ఇష్టపడుతున్నారు, ఆ విషయాన్ని మనం విస్మరించలేము, అందుకని కొంత సడలింపు వుండాలి. ఇది సున్నితమైన వ్యవహారం, మనం తొందరపడి నిర్ణయం తీసుకుంటే ఆ తరువాత వాళ్ళు కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకొని ఏ అఘాయిత్యమో చేసుకుంటే మనం జీవితాంతం బాధ పడాలి, కొంచెం నిదానంగా ఆలోచించండి, ఈ గోత్రాల గజిబిజి నుండి బయటపడటానికి ఏదైనా దారి వుందేమో చూడండి” అన్నాడు సత్యనారాయణ. “నేను అన్ని విషయాలు ఆలోచించాను, ఇంక ఆలోచించడానికి ఏమీ లేదు. నేను మన సాంప్రదాయాలని, కట్టుబాట్లని నమ్ముతాను, వాటిని గౌరవిస్తాను, వాటి ప్రకారం నడుచుకుంటాను. అందుకని నేను ఈ పెళ్ళికి అంగీకరించలేను” అన్నారు విశ్వనాధంగారు. “బాబయ్యా, పిన్నీ…మీకన్నా చిన్నవాడిని వీడు చెప్పడమేమిటి అనుకోకండి? ఈ సమస్యకి ఒక పరిష్కార మార్గం వుంది, ఈ ఋషులు కలవని గోత్రం వారిచేత కన్యాదానం చేయిస్తే సరిపోతుంది…పిన్నీ నీకు గుర్తుందా? మీ మేనత్తగారి అమ్మాయి విషయంలో గోత్రాలు ఒకటైనా మంచి సంబంధమని వేరే గోత్రంవారి చేత కన్యాదానం చేయించారు. మీరు ఒప్పుకుంటే నేను, వైదేహి కన్యాదానం చెయ్యడానికి సిద్ధము” అని పరిష్కార మార్గాన్ని సూచించాడు సత్యనారాయణ.

“మరింకేమి, అన్నయ్య సూచించినట్లు చేద్దాము” అన్నాడు రాజేశ్వరరావు. రవి, కవిత అతనికి వంత పాడారు. ఈ చర్చని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ముగిద్దామని చర్చ ప్రారంభం నుండి అనుకుంటున్న విశ్వనాధంగారికి, సత్యనారాయణ సూచనకి మిగతా వారు వంత పాడేసరికి కోపం తారా స్థాయికి చేరుకుని “ఏమిటి మాట్లాడుతున్నారు మీరంతా? మాకు మొదటిసారి పుట్టిన ఆడపిల్ల అనూ, ఆడపిల్ల అంటే లక్ష్మీదేవి. అటువంటిది నా పిల్లకి కన్యాదానం ఉంకొకరి చేత చేయించమని సలహా ఇస్తారా? నేను ఇంకా బ్రతికే వున్నాను, వేరొకరితో కన్యాదానం చేయించడానికి నా పిల్ల అనాధ కాదు, ఇంకెప్పుడూ ఇలాంటి సలహాలు నాకివ్వకండి, ఇక ఈ విషయం గురించి నేను ఏమీ మాట్లాడదలచుకోలేదు” అని ఆయన బట్టలు మార్చుకొని కోపంగా బయటకి వెళ్ళారు. రాజేశ్వరరావు, కవిత వాళ్ళ స్నేహితుల ఇంట్లో ఫంక్షన్కి వెళ్ళారు. ఈ చర్చలతో బుర్ర వేడెక్కి పోయిన రవి కాస్సేపు అలా తిరిగి రావడానికి బయటకు వెళ్ళాడు.

వాళ్ళంతా బయటికి వెళ్ళాక సత్యనారాయణ, వైదేహి పార్వతమ్మగారితో మళ్ళీ చర్చ మొదలెట్టారు. “బాబయ్య ఇంతమంది చెప్పినా వినకుండా అంత పట్టుదలతో ఎందుకు అలా మొండిగా వున్నారు పిన్ని?” అని అడిగాడు సత్యనారాయణ. “అవును అత్తయ్యగారు పరిష్కార మార్గం చెప్పినా మామయ్యగారు ఎందుకు ఈ వివాహానికి అంగీకరించడం లేదో మాకు అర్ధం కావడం లేదు. మా బాబయ్య, పిన్నికి విషయం చెప్పాము, మా పిన్ని ఈ గోత్రాల విషయం లేవనెత్తింది…అని విశాఖలో జరిగిన చర్చల సారాంశం వివరించి…వాళ్ళిద్దరూ అనూరాధని తమ కోడలుగా చేసుకోడానికి అంగీకరించడమే కాదు ఎంతో సంతోషంగా కూడా వున్నారు. అనూరాధని కన్న కూతురిలా పువ్వులలో పెట్టి చూసుకుంటుంది మా పిన్ని.

అత్తయ్యగారు నా తమ్ముడు అని చెప్పడం కాదుగాని మోహన్ ఆణిముత్యం లాంటి కుర్రాడు. పిల్లలిద్దరూ ఇష్టపడ్డారు, మీరు ఎలాగైనా మామయ్యగారిని ఒప్పించండి” అంది వైదేహి. వాళ్ళిద్దరి మాటలు విన్నాక పార్వతమ్మగారు అంతవరకు ఉగ్గబట్టి ఉంచిన తన ఆవేదనని ఇక ఆపుకోలేక పోయింది, కనులనుండి నీరు కారుతుండగా…”ఒరేయ్ సత్యం ఏం చెప్పమంటావు? ఆయన మీకు చెప్పిన కారణాలే కాకుండా ముఖ్యమైనవి రెండు కారణాలు వున్నాయి…మొదటిది నువ్వు అక్కకి ఒక్కడివే సంతానం, మీకు బాగా ఆస్థి వుంది అందుకని ఎలాగైనా తన మేనకోడలుని నీకిచ్చి చేద్దామని ఆయన చాలా ఆశలు పెట్టుకున్నారు.

నీ పెళ్ళి అయిన తరువాత కూడా వైదేహి కన్నా నా మేనకోడలు ఎందులో తీసిపోయిందని సప్తగోదారులు దాటి ఆ తూర్పు సంబంధం చేసుకున్నారు అని నన్నూ, మీ అమ్మని చాలాసార్లు దెప్పి పొడిచారు. ఆయన మాట చెల్లుబాటు కాలేదని ఆయన అహం దెబ్బ తిని, ఆయన పరువు ప్రతిష్టకి భంగం వాటిల్లినట్లు భావించారు. అందుకని అక్కబావగార్ల మీద, నీ మీద కోపం పెంచుకున్నారు, దాని పర్యవసానమే నీ పెళ్ళిలో గలాటా…రెండవది ఆ గలాటాకి తానే కారణమన్న నిజం బంధువర్గంలో అందరికి తెలిసిపోవడం వల్ల ఆయనలో అపరాధ భావం నెలకొంది. (ఇంకా వుంది)

© 2020 Chaitanyam Magazine. All Rights Reserved.