పూరి జగన్నాధ స్వామి వైభవం

పూరి జగన్నాధుని రధయాత్ర తెలుగువారికి అత్యంత ప్రీతి పాత్రమైనది.కాని ఆ స్వామికి సంబంధించిన పురాణగాధ సంపూర్ణంగా కొద్దిమందికి మాత్రమే తెలుసు. స్కాందపురాణాంతర్గతమైన జగన్నాధ క్షేత్ర మాహాత్త్యాన్ని యధామూలంగా, సరళ, వ్యావహారిక భాషలో అనువదించి మన పాఠకులకు ప్రతి నెల అంది- స్తున్నాము. చదవండి, చదివించి మోక్షాన్ని పొందడి. – సంపాదకురాలు

యదీయ పాదాబ్జ యుగాంత భూమౌ లుఠేచ్చిరో యస్యహి పాంచభౌతమ్

తద్దివ్యపాదం శిరసా వహతి సురేంద్ర నార్యః ఖలు తం నమామి

తద్దివ్యసింహంహతపాప సంఘం పాదాశ్రితానాం కరుణాబ్ధి సింహం

పాదాబ్జ సంఘట్ట విఘట్టమాన బ్రహ్మాండ భాండం ప్రణమామి చండం

పటాఛటాకంపన శీర్యమాణ ఘనౌఘ విద్రావిత పాప సంఘం చండాట్టహాసాంతరితాబ్ద శబ్దం త్రిలోక గర్భం నృహరిం నమామి

నమస్తే నమస్తే నమస్తే&ద్య విష్ణో పరిత్రాహి దీనానుకంపిన్ననాధమ్

భవంతం సమాసాద్య మే దేహ బంధో మురారే న సంసార కారాగృహేస్తు

హయమేధ సహస్రాం తే యధా త్వాం చర్మచక్షుషా దివ్యరూపం ప్రపశ్యామి తధామక్రోశయ ప్రభో

యధాచేజ్యా సహస్రం మే నిర్విఘ్నం తత్సమాప్యతే యగ్నేశ త్వత్ప్రసాదాన్మే తధా సాన్నిధ్య మస్తు తే

ఓ స్వామి నీవు ఏకము. అనేకము, స్థూల ము, సూక్ష్మము, అణువు, వ్యోమము కంటె అతీతుడైన వాడవు. వ్యోమ రూపంలోను, వ్యోమా కారంలోను, వ్యోమందు నిలచి ఉండు వాడు, వ్యోమంలో వ్యాపించి ఉండువాడు, వ్యోమమే కోశంగా ఉన్నవాడు బ్రహ్మ. ఆబ్రహ్మకుకూడా నీవే మూలము. నీవు మాకు దూరంగాను ఉంటావు, దగ్గరగాను ఉంటావు. నీకు దగ్గర, దూరం అనేవి లేవు.మాకు తెలియవలసిన వాడవు. మాగురించి నీవు తెలుసుకుంటావు. మాయకు అతీతమైన వాడవు.నీ రూపాన్ని ఊహించలేము. ఈ లోకంలో అన్నిటికి నీవే మొదటి వాడవు. లోకములోని అన్నిటిని నీవే సృష్టిస్తావు, స్థితిని కలిగిస్తావు, లయం చేస్తావు. నీవు ఈ విశ్వానికి సాక్షివి. దుఃఖాలు నశింపచేయు శక్తి నీకే ఉంది. సంశయాలు పోగొడతావు. జ్యోతి స్వరూపుడవు. జ్ఞాన స్వరూపుడవు.

నాలుగువ్యూహాలనుధరించనవాడవు.సృష్టికిమూలకారముఅయినవాడవు.నీపాదాలయందుభక్తికలుగునట్లుఅనుగ్రహించు.చతుర్విధ భక్తిని అనుగ్రహించు. అందరం సంసార సాగరంలో మునిగి ఉన్నాం. దిక్కులు వస్త్రంగాను, రాత్రి పగలు కవచ కుండలాలుగా, నక్షత్రాలు నీకు హారంగా ఉన్నాయి. నృసింహ రూపమున భక్తుల కోరికలు తీర్చడానికి నీవు అవతరించావు. బ్రహ్మాదుల కిరీటములోని రత్న కాంతులవలన నీపాదాలు ప్రకాశిస్తున్నాయి. దేవతా స్త్రీలు తలవంచి స్వామి పాదాలకు నమస్కరిస్తున్నారు. పాపాలు నశింపచేయు దయాసముద్ర్రుడు, స్వామి. తన పదఘట్టనలచే భూమండలాన్ని కుదుపేస్తున్నాడు. జూలు కదపడం వలన పాపాలు నశించిపోతున్నాయి. తన అట్టహాసముతో మూడు లోకాలు నింపివేస్తున్నాడు.

అనాధుడనుదీనుడను అగు నన్ను అనుగ్రహించు. నిన్ను శరణు వేడిన వారికి దేహ బంధము, సంసార బంధము విడిపోతుంది. ముక్తిని కలిగించు నీ దివ్య రూపాన్ని ఈ కన్నులతో చూచే అదృష్టాన్ని కలిగించు. యజ్ఞేశుడవయిన నీవు అశ్వమేధ యాగం నిర్విఘ్నంగా జరుగునట్లు చూడు. నీ ఎదుట నేను ఉండునట్లు నన్ను అనుగ్రహించు” అని ఇంద్ర ద్యుమ్నుడు నరసింహ స్వామిని ప్రార్ధించాడు. దివ్య మైన ఈ స్తుతిని ఎవరు చదవుతారో వారికి రెట్టింపు ఫలితం వస్తుంది. ( 11 – 55 )

బ్రహ్మచేప్రతిష్ఠించబడిన ఈ నరసింహ స్వామినిపరమేశ్వరుని దరించుకొన్న వారికి దేహబంధం ఉండదు. వేయి అశ్వమేధ యాగాలు చేసిన ఫలితం కలుగుతుంది. ఈ నరసింహ స్వామిని పంచామృతాలతోను, కొబ్బరి నీళ్ళతోను, గంధపు నీటి తోను అభిషేకం చేయాలి. పుష్పాలతో పూజించి, గంధాన్ని సమర్పించాలి. కర్పూరంతో కూడిన తాంబూలం ఇవ్వాలి. స్వామిని స్తుతిస్తూ, జయ జయ ధ్వానాలు చేయాలి. ప్రదక్షణ చేసి, స్వామికి నమస్కరించాలి. బ్రాహ్మణులకి దానం చేయాలి. వైశాఖ మాసం, చతుర్దశి, శని వారం, స్వాతి నక్షత్రం, ఉదయం స్వామి ఆవిర్భవించిన సమయం. ఆ సమయంలో నరసింహ స్వామిని అర్చించినట్లయిన వేల కోట్ల నాటి పాపాలు నశిస్తాయి. వ్యాధులు, శోకం కలుగదు. కోరిన కోరిక తీరుతాయి. స్వామి ఎదుట చేసిన శుభ కర్మలు కోటిరెట్లు ఫలితాన్ని ఇస్తాయి.(56-66)

స్కాందపురాణంలోని వైష్ణవ ఖండంలోని పురుషోత్తమ క్షేత్ర వైభవంలోని జైమిని-ఋషి సంవాదము అను పదహారవ అధ్యాయం సమాప్తం 17 వ అధ్యాయం జైమిని- ఋషి సంవాదం ( అశ్వమేధ యాగం ) “ మహర్షి! నరసింహుని ప్రతిష్టించిన తరువాత ఇంద్రద్యుమ్నుడు ఏం చేసాడో వివరంగా చెప్పండి అని ఋషులు అడిగారు. జైమిని ఈవిధంగా చెఫ్ఫడం ప్రారంభించాడు. రాజు ఇంద్రాది దేవతలను, ఋషులను, బ్రాహ్మణులను, పురోహితులను పిలిపించాడు. విశ్వకర్మ కుమారుడు నిర్మించిన సభామండపంలో సభ నిర్వహించాడు. వారికి తగిన ఆసనాలపై కూర్చోబెట్టారు. అందరిని సత్కరించి, సగౌరవంగా చేతులు జోడించి “ఇంద్రా! అశ్వమేధ యాగము చేసి, యజ్ఞపురుషుని సంతోష పెట్టుటకు నీ అనుమతి కోరు తున్నాను. నేను ఏ పదవిని కోరి యజ్ఞం చేయటం లేదు.మీరు ఉపాసించిన నీలమాధవుని విగ్రహం బంగారు ఇసుకచే కప్పివేయబడింది. తిరిగి ఆ స్వామిని దర్శించుకోవడానికి వేయి అశ్వమేధ యాగాలు చేయమని బ్రహ్మ ఆజ్ఞాపించాపించారు. ఆ స్వామిని తిరిగి ఇక్కడ దర్శించుకోగలిగినట్ల యిన, మీకు ప్రయోజనం కలుగుతుంది” అని విన్నవించాడు. ( 1 – 33)

రాజు మాటలు విని ఇంద్రాది దేవతలు ఆకాశవాణి చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకొని ఆనందించారు. “ ఓ రాజా! నీవు తలపెట్టిన యజ్ఞం గురించి మాకు ముందుగానే తెలుసు. ముల్లోకాలను పవిత్రం చేసే ఈ కార్యక్రమంలో నీకు మేము సహాయంగా ఉంటాం. బ్రహ్మ స్వయంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. నీవు అశ్వమేధయాగాలు నిర్వహించి స్వామిని తృప్తి పరచు.” అని ఇంద్రాది దేవతలు అనుజ్ఞ ఇచ్చారు. ( 34- 45 ) ఇంద్రద్యుమ్నుడు మనస్సులో ఆనందించి యాగం చేయడానికి ముందుగా భగవంతుని ఆరాధించాడు. భగవంతునికి శాస్త్రోక్తంగా ఉపచారాలు అన్ని చేసాడు. బ్రాహ్మణులు పుణ్య తిధిని నిర్ణయించారు. యజ్ఞానికి కావసిన సంభారాలు అన్ని రాజు సిద్ధంచేసుకొన్నాడు. ఋత్విజులను నిర్ణయించాడు. వారు భార్యా సహితుడైన రాజుకి యజ్ఞ దీక్ష ఇచ్చారు. సదస్సు అనుమతితో రాజు యజ్ఞం ప్రారంభించారు. యజ్ఞవేదికపైసాక్షాద్విష్ణుమూర్తివలెప్రకాశిస్తున్న ఆహవనీయ అగ్నిని తీసుకు వచ్చి, వేదికపై ఉంచారు.శుభలక్షణాలుకలిగినగుర్రాన్నిఅభిమంత్రించి, చక్కగా సంప్రోక్షణ చేసి, దిక్పతుల అనుమతి తీసుకోని అశ్వాన్ని విడిచిపెట్టారు. రురు చర్మంతో చేసిన ఆసనంపై రాజు సభ మధ్యలో కూర్చున్నాడు. ( 46- 51)

వచ్చినవారందరికి భోజనం ఏర్పాట్లు చూడమని రాజు ఆదేశించాడు. దేవతలకు రత్న పాత్రల లోను, మునులకు, రాజుకు బంగారు పాత్రలలోను, వైశ్యులకు వెండి పాత్రలలోను భోజనం ఏర్పాటు చేసాడు. వారు భోజనం చేసాక ఆ పాత్రలను పారవేసే వారు. యాగానికి వచ్చిన రాజులందరు, వారి కుటుంబాలతో కలిసి ఆక్కడే ఉండిపోయారు. ఇంద్ర ద్యుమ్నునిప్రార్ధననుఅంగీకరించినారదుడు అక్కడే ఉండి, రాజులమధ్య సమన్వయం ఉండునట్లు చూస్తున్నాడు. దేవతలకు మంత్ర శాస్త్ర నిపుణులు పాకశాస్త్ర నిపుణులు అయిన వారువంటలుచేసారు. ఇంద్రాదులు సామాన్య మానవులతో కలిసి ఉన్నారు.

భోజనం అయిన తరువాత సుగంధభరిత మైన పూల మాలలు, లేపనాలు సమర్పించారు. సన్నని పట్టు వస్త్రాలు సమర్పించారు. రత్నాలు పొదిగిన మంచాలు ఏర్పాటు చేసారు. జాజి, లవంగం, కర్పూరంతో కూడిన తాంబూలం ఇచ్చారు. పాతాళ లోకవాసులకు కూడా తగిన ఏర్పాట్లు చెసారు. వారి గృహాలు సూర్య కాంతి లేకుండా పాతాళ లోకంలో ఉన్నట్లు ఏర్పాటు చేసారు. యజ్ఞానికి కావలసిన సామగ్రి అంతా తీసుకొని వచ్చారు. భూమిపై బంగారు వర్షం కురిసింది. ఇంద్రద్యుమ్నుడు చేస్తున్న యాగం గురించి ప్రజలు కధలు, కధలుగా చెప్పుకుంటున్నారు. ఒక అశ్వమేధ యాగం కంటె మరొకటి గొప్పగా ఉండునట్లు రాజు యాగాలు నిర్వహిస్తున్నాడు. భక్తి శ్రద్ధలతో సుసంపన్నం అవుతోంది. అగ్న్యాధానంనుండి, అవబృధం వరకు క్రమాన్ని అనుసరించి యాగాన్ని నిర్వహింప చేస్తున్నారు. యాజ్ఞవల్కుడు మొదలైన మునులు ఋత్విక్కులుగా ఉన్నారు. ఆ యజ్ఞంలో హవిస్సులు అగ్ని మధ్యలో వేస్తున్నారు. ఈ విధంగా సశాస్త్రీయంగా జరుగుచున్న యాగాన్నిచూసి,ఆనందించి,ఇంద్రాదులుఅమరావతికి వెళ్ళ కుండా అక్కడే ఉండిపోయారు. అగ్నిలో సమర్పిస్తున్న అమృతాన్ని హవిస్సుగా దేవతలు స్వీకరిస్తున్నారు. నాగరాజు పాతాళంలోకంటెఇక్కడ ఎక్కువ భోగాలు అనుభవిస్తూ ఉండడం వలన ఇక్కడే ఉండి పోయాడు. ( 52 – 98) (ఇంకా వుంది)

© 2020 Chaitanyam Magazine. All Rights Reserved.