పన్నెండవ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్

1934వ సంవత్సరం డిశంబరు నెల 19వ తేదీన మహారాష్ట్రలోని జలగాం ప్రాంతపు, నంద్ గామ్ అనే పల్లెటూరిలో పుట్టింది. తండ్రి పేరు నారాయణ్ పగ్లూ రావ్. వారిది మరాఠి కుటుంబం. నారాయణ్ పగ్లూ రావ్ ని ‘నానా సాహెబ్’ అని కూడా పిలిచేవారు. ఆయన మంచి జ్యోతిష్కుడు. కూతురు పుట్టగానే జాతకం చూసి ఆమె భవిష్యత్తులో చాలా పేరు సంపాదించి, రాజకీయాల్లో గొప్పగా రాణించి పెద్ద పెద్ద పదవిల్ని అలంకరిస్తుందనిఊహించ గలిగాడు. అందువల్ల ఆమె ను బాగా చదివించాలని నిర్ణయిం చుకున్నాడు.

నానా సాహెబ్ కి ప్రతిభ కాక అయిదుగురు కొడుకులు ఉండేవారు. అలా అయిదుగురు అన్నదమ్ముల మధ్యలో ఒకే ఒక సోదరి కాబట్టి అల్లారు ముద్దుగా పెరిగింది ప్రతిభ. ఆ రోజుల్లో ఎదుగుతున్న ఆడపిల్లలకి ఇంట్లో వంటా వార్పూ నేర్పించి, ఇల్లు చక్కబెట్టుకోవడం అలవాటు చేస్తూ పెంచేవారు. పెళ్ళయి అత్తవారింటికి వెళ్ళాక అక్కడ ఎంత అణకువగా ఉండాలో బోధించే వారు. అలా అయితేనే ఆడపిల్ల పుట్టింటికి, మెట్టినింటికి పేరు ప్రఖ్యాతులు తెస్తుందని నమ్మేవారు. అది ఆనాటి సమాజంలోని ఆచారం. అంతేకాని, ఆడపిల్లలని బడికి పంపి చదివించాలనే ధ్యాసే ఉండేది కాదు తలిదండ్రులకి.

కాని నానా సాహెబ్ ఉన్నత ఆదర్శాలు కలవాడు. అభివృద్దిలోకి రావలసిన వారిని , వారి ఆశయాల్ని అణగ ద్రొక్కి తమ దారిలోకి త్రిప్పుకోవాలని చూడడం, బలవంతం చేయడం కూడదని ఆయన విశ్వాసం. అందుకోసం తరతరాలుగా వస్తున్న పరంపరని ఎదిరించి అయినా సరే, ప్రతిభని బడికి పంపి చదివించాలని ఆయన నిశ్చయించుకున్నాడు. కొడుకులతో బాటు సమానంగా

కూతుర్ని కూడా, ఏ విధమైన వివక్షా చూపకుండా బడికి పంపసాగాడు.

జలగామ్ లో ఆర్. ఆర్. స్కూలుకి వెళ్ళేది ప్రతిభ. చదువు లో చాలా చురుకుగా ఉండేది. అలాగని, ఇంట్లో పారంపర్యంగా చేయవలసిన పనులు ఏవీ నిర్లక్ష్యం చేసేదికాదు. బడిలో చదువు మీద ఎంత శ్రద్ధగా ఉండేదో, ఇంట్లో చాకిరీ చేయడం కూడా అంత శ్రద్ధగాను చేసేది. అమ్మదగ్గర వంటా, వార్పూ, దంపుళ్ళు, కుట్టుపని, బట్టలుతకడం వంటి పనులన్నీ నేర్చుకుంది. ఆ పనులు చేయ డానికి నౌకర్లు లేరని కాదు. ఆ విధంగా అన్నిరకాల పనులు స్వంతంగా చేసుకోవడం అలవా టు కావాలని ఆమె ఆశయం.

పదిహేను సంవత్సరాల వయసు వచ్చేసరికి ప్రతిభ మరాఠి పద్ధతిలో గోచిపోసి చీరకట్టడం, జరీ, బుటావు ఉన్న సిల్కు చీరలు ధరించడం, వెండి, బంగారు నగలు పెట్టుకోవడం, చెప్పుల దగ్గర్నుంచి మేచింగ్ వి వేసుకుని అలంకరించుకోవడం అలవాటు చేసుకుంది. అలా ఆమె సర్వాంగసుందరంగా అలం కరించుకుని, అద్దం ముందు నిలబడి అలవోకగా నవ్వితే, బహు సుందరమైన రాజకుమార్తెలా మెరిసి పోయేది.

హాయ్ స్కూల్ పూర్తి చేసి ప్రతిభ, మూల్ చంద్ జెఠా కాలేజిలో ఎం. ఏ. చదివింది. కాలేజిలో చదివే రోజుల్లో ఆమె తెలివి తేటలకి అందం తోడై ‘కాలేజి బ్యూటీ క్వీన్’ గా ఎంపిక అయింది. అందగత్తె అయి ఉండి కూడా అద్భుతమైన తెలివిని ప్రదర్శిస్తూ, చదువులో రాణించే విద్యార్థినిని ఎవరు గౌరవించరు!! కాలేజి కాలేజి అంతా ఆమెకు బ్రహ్మరథం పట్టేది. ఉపన్యాసకులు కూడా ఆమెను ఎంతో మెచ్చుకునేవారు. ఆమె ఈ విధంగా పదిమందిలో మంచి పేరు తెచ్చుకోవడం, చాలామంది ప్రజలు వచ్చి తన దగ్గర ఆమెను పొగడడం చూసి తండ్రి నానా సాహెబ్ ఉబ్బి తబ్బి బ్బు అయిపోయేవాడు. కన్నా కూతురి విజయోత్సవాలు చూసి, తను ఊహించిన భవిష్యవాణి నిజం అవుతుందని, తన కలలు ఫలిస్తాయని సంతోషంతో పొంగి పోయే వాడు.

ఎం. ఏ. తరవాత 1962వ సంవత్సరంలో, ప్రతిభ ‘గవర్నమెంట్ లా కాలేజి’ ముంబై లో ప్రవేశం తీసుకుంది. ఈ కాలేజికి గొప్ప చరిత్ర ఉంది. దీనిని 1855వ సంవత్సరంలో ఈస్టిండియా కంపెనీ స్థాపించింది. భారత దేశంలోనే ఇది మొట్టమొదటి లా కాలేజి. అంతకు పూర్వం లా చదవాలంటే, ఇంగ్లాండుకు వెళ్లి చదవాల్సి వచ్చేది. ఇంకా ముఖ్యమైన విషయం ఏమిటంటే, 1942వ సంవత్సరం వరకు ఈ కాలేజిలో మహిళలకు ప్రవేశం లేదు. అప్పట్లో స్త్రీలు లా చదివి న్యాయవాద వృత్తి చేపట్టడానికి అధికారం లేదు. హరి సింగ్ గౌడ్ అనే ఆయన 1922వ సంవత్సరంలో లెజిస్లేటివ్ అసెంబ్లీ లో ప్రతిపా దన పెట్టి, స్త్రీలు కూడా లా చదివి న్యాయవాద వృత్తి చేపట్ట వచ్చునని వాదించాడు. దానిని అసెంబ్లీ ఆమోదించింది. ఆ విధంగా యూనివర్సిటీ సెనేట్ నుంచి ఆమోదం పొంది భారత దేశంలో లా చదివిన మొదటి మహిళ ‘కర్నేలియా సోరాబ్ జీ’ అనే ఆమె.

అంత సార్థకమై చరిత్రగల కాలేజిలో న్యాయ శాస్త్ర పట్టా పుచ్చుకున్న మహిళ ప్రతిభ. ఎం.ఏ. చదివాక కూడా ప్రతిభ తిరిగి లా చదవడానికి ప్రత్యేకమైన కారణం ఉంది. కాలేజిలో చదువుకునే రోజుల్లోనే ఆమె దృష్టి సమాజ సేవ వైపు మళ్ళింది. విద్యార్థి దశలోనే ఆమె వ్యక్తిత్వం, తెలివి తేటలు చర్చనీయాంశాలు అయ్యాయి. ఆమెలో రాజకీయాల్లో చేరి దేశ సేవ చేయాలనే తపన ఉండేది. రాజకీయాల్లో రాణించాలంటే, న్యాయ శాస్త్ర పరిజ్జానం ఉండాలి. మరొక ముఖ్య విషయం, ఆమె ఉన్నత విద్యాభ్యాసం సజావుగా సాగడానికి కుటుంబ సభ్యుల ప్రోత్సాహం కూడా ఉంది. అంతే కాక, ఆమెకు ఆటపాటల్లో కూడా మంచి ప్రవేశం ఉంది. టేబిల్ టెన్నిస్ బాగా ఆడేది. కాలేజి రోజుల్లో బహుమతులు గెలుచుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ముందున్న రాజకీయ ప్రస్థానానికి నాందీ వాక్యంగా, కాలేజిలో చదువుకునే టప్పుడే, 1957వ సంవత్సరంలో వారి ప్రిన్సిపాల్, వై. ఎస్. మహాజన్ అసెంబ్లీకి పోటీ చేసిన తరుణంలో ఆయన తరఫున ప్రతిభ ప్రచారం చేసింది. అప్పటికామే వయసు కేవలం 23 సంవత్సరాలు మాత్రమే. సన్నిహితుల్ని కూడ దీసుకుని, ఒక సేవాదళం స్థాపించింది. వారి సహాయంతో ఊరూరా తిరిగి ఓట్లు కోరుతూ ప్రచారం చేసింది. అప్పటికే చదువు, తెలివితేటల ద్వారా ప్రజల్లో ఆమె పేరు మారు మ్రోగుతోంది. ఫలితంగా ప్రిన్సిపాల్ గారు భారీ మెజారిటితో గెలిచారు. ప్రతిభా పాటిల్ లో ఆత్మ స్థైర్యం ఎక్కువ అయింది. ప్రజల్ని ఆకర్షించుకునేలా మాట్లాడి, వారిని తన వైపు

త్రిప్పుకోగల సామర్థ్యం తనలో ఉందని తెలుసుకుంది. ఆమె గొప్ప వక్తగా పేరు పొందడాడానికి మరొక ముఖ్యమైన ఘటన 1960వ సంవత్సరంలో జరిగింది. అది ఆమె ‘రాజపుత్’ సమాజాన్ని ఉద్దేశించి మాట్లాడిన సందర్భం. ఆరోజున ఆ ఉపన్యాసం విన్న రాజపుత్రులు ఎంతగానో ప్రభావితులై, అప్పటి నుంచి ఆమెను తమ నాయకురాలిగా భావించసాగారు. ఆ తరువాత ప్రతిభా పాటిల్ రాజకీయప్రస్థానంలో వెనుదిరిగి చూడ లేదు.

ఈ విజయ పరంపర ఆమెను 1962వ సంవత్సరంలో జరిగిన మహారాష్ట్ర, రాష్ట్ర స్థాయి ఎన్నికలలో పోటీ చేయడానికి పురికొల్పింది. ఆ నిర్ణయం తీసుకునే ముందు తండ్రిని అనుమతి కోరింది ప్రతిభ. ఎన్నికలలో పోటీ చేయడం అంటే మాటలు కాదు. పెద్ద ఎత్తున ప్రచారం జరగ వలసి ఉంటుంది. దానికోసం విరివిగా ధనవ్యయం అవుతుంది. అయినప్పటికీ తండ్రి ఆమెను నిరుత్సాహ పరచ లేదు. కాని ఒక్క విషయం మాత్రం చెప్పాడు. ప్రతిభ వివాహంకోసం తాను పొదుపు చేసిన డబ్బు ఉందనీ, దానిని వాడుకోవచ్చుననీ. అయిన పక్షంలో ఇక వివాహంలో కట్నం ఇవ్వడానికి ఏమీ మిగలదనీను. అప్పుడామె కట్నం ఇచ్చి పెళ్లి చేసుకునే ప్రసక్తి లేదని, అలాంటి వాడిని తను పెళ్ళే చేసుకోనని చెప్పింది. అది విన్న తండ్రి మహదానందంగా ఆ డబ్బు ఆమెకిచ్చి, ఎన్నికలలో పోటీ చేయడానికి ప్రోత్సహించాడు. ఆ విధంగా ప్రతిభ మొదటిసారిగా మహారాష్ట్ర విధాన సభకి ఎన్నిక అయింది.

ఎం. ఎల్. ఏ. అయిన మూడేళ్ళకి, 1965వ సంవత్సరం లో ప్రతిభా పాటిల్ వివాహం ‘దేవి సింగ్ శేఖావట్’ అనే రాజపుత్ర యువకునితో జరిగిం ది. అప్పటికామె వయసు 31సంవత్సరాలు. రాజపుత్ కుటుంబాల్లో అంత వయసు వచ్చేవరకు ఆడపిల్లకి పెళ్లి కాకపోవడం చాలా అరుదు. సాధారణంగా అమ్మాయికి 18 సంవత్సరాలు నిండే లోపునే పెళ్లి జరిగిపోయి, కాపురానికి వెళ్లిపోవాలి. వీరి వివాహం ఇలా ఆలస్యం కావడానికి కారణా లున్నాయి. ప్రతిభకు తన వివాహం విషయంలో కొన్ని నిర్దిష్టమైన అభిప్రాయాలు ఉండేవి. వరుడు వరకట్న దురాచారానికి దూరంగా ఉండాలి. ఉన్నత విద్యాభ్యాసం పూర్తి చేసి ఉండాలి. తను రాజకీయ ప్రవేశం చేసిన తరవాతే పెళ్లి చేసుకోవాలి. తన సమాజ సేవా కార్యక్రమాలకి అడ్డు రాకూడదు. ఇత్యాది. ఇక వరుడి విషయంలో అమ్మాయి బాగా చదువుకున్నది అయి ఉండాలి. కాని ఆ రోజుల్లో రాజపుత్ సమాజంలో ఆడపిల్లలని బడికి పంపే ఆచారం లేదు కనుక అటువంటి అమ్మాయి దొరకడం ఆలస్యం అయింది. ఆ విధంగా వారిద్దరి వివాహం రాసిపెట్టి ఉంది.

శేఖావట్ కుటుంబం మౌలికంగా రాజస్థాన్ లోని షెఖావతి అనే ప్రాంతానికి చెందినది. కాని కొన్ని తరాల క్రితమే ఈ కుటుంబం వలస వచ్చి, మహారాష్ట్రలోని అమరావతి ప్రాంతంలో స్థిర పడ్డారు. కాలక్రమాన దేవీ సింగ్ అమరావతి పట్టణానికి మేయర్ కూడా అయ్యాడు.

మహారాష్ట్ర ఎన్నికలలో 1962వ

సంవత్సరంలో ఎం. ఎల్. ఏ. గా ఎన్నిక అయ్యాక, ప్రతిభ రాజకీయాల్లోనూ, సామాజి కాభివృద్ధి కార్యక్రమాల్లోనూ, పూర్తిగా తలమున్కలయింది. తన కలుపుగోరు తనం వల్ల, ఎదుటివారి మనసుల్ని ఆకర్షిం చడంలో దిట్ట అయిన ఆమె ప్రజల్లో సుస్థిరమైన స్థానం సంపాదించుకుంది. ఫలితంగా ఆమె ఎన్నికల్లో ఓడిపోయిన దాఖలాలంటూ ఏమీ లేవు. మహారాష్ట్ర విధానసభ సభ్యురాలి గా ఉన్న 1962-1985 సంవత్సరాల వ్యవధిలో చాలా విభాగాల్లో మంత్రిగా పని చేసి చక్కని అనుభ వం గడించింది.

అక్కడితో ఆమె మహత్వాకాంక్ష ఆగిపోలేదు. తన స్వంత రాష్ట్రంలో పాగా వేశాక కేంద్రం వైపు ఆమె దృష్టి మళ్లించింది. ఆ రోజుల్లో శ్రీమతి ఇందిరా గాంధి దేశానికి ప్రధాన మంత్రిగా ఎన్నిక అయిన మొదటి మహిళగా పేరు పొంది ఉంది. ప్రతిభా పాటిల్ కు ఆమె నుంచి కూడా ప్రేరణ లభించింది. అవకాశం రాగానే ఆమెకు దగ్గర అయి, తన రాజకీయ చాకచక్యం నిరూపించి ఔ ననిపించుకుంది. తరువాతి కాలంలో కాంగ్రేసు పార్టీ. వ్యక్తిగతంగా ఇందిరా గాంధి కూడా చాలా ఒడిదుడుకులకు గురయ్యారు. ఎందరో నాయకులు పార్టీని విడిచిపెట్టి, విపక్షాలలో చేరారు. కాని ప్రతిభా పాటిల్ మాత్రం ఒక విశ్వసనీయమైన నాయకురాలిగా ఆమె వెంటనే నడిచింది. ఆఖరికి ఇందిరా గాంధిని జైలులో నిర్బంధించి నప్పుడు తనని కూడా జైలులో పెట్టమని ఉద్యమం లేవదీసింది.

ఇందిరా గాంధి కుమారుడు సంజయ్ గాంధి విమాన ప్రమాదంలో మరణించినప్పుడు ఆ కుటుంబానికి అండగా నిలి చింది. వారంతా శోక సముద్రంలో మునిగి ఉంటే, తను వెంట ఉండి, వంటలు కూడా చేసి తినిపించింది. అటువంటి నాయకురాలికి కేంద్రంలోని కాంగ్రెసు ప్రభుత్వంలో చోటు లభించడంలో ఆశ్చర్యం ఏముంది! రాజ్యసభ సభ్యురాలై కేంద్రంలో తన సత్తా చాటింది.

ఈ విధంగా రాజకీయాల్లో తన కోరిక తీరేటట్లు వివిధ ప్రక్రియల్లో ఆరితేరాక ఇక పార్టీ రాజకీయాలు మాని దేశసేవ, సమాజసేవ చేయాలని సంకల్పించుకుంది ప్రతిభా పాటిల్. స్త్రీ జనోద్దరణ కోసం మహిళా సహకార బ్యాంకు స్థాపించింది కార్ఖానాలు, విద్యాలయాలు స్థాపించి వాటిని సమర్థవంతంగా నిర్వహించింది.

ఎందరో ప్రోత్సహించినా, అవకాశం వచ్చినా మళ్ళి ఎన్నికలలో పోటీ చేయలేదు. ఆమె చేస్తున్న నిస్వార్థ సేవల్ని గుర్తించి ప్రభుత్వం ఆమెని రాజస్థాన్ కి గవర్నరుగా నియమించింది. ఆ విధంగా రాజస్థాన్ గవర్నరు అయిన మొదటి మహిళగా గుర్తింపు తెచ్చుకుంది. తరువాతి కాలంలో, 62 సంవత్సరాల వయసులోనే, మన దేశానికి రాష్ట్రపతిగా ఎన్నుకోబడింది. మరొక ముఖ్యమైన విషయం, భారత దేశపు రాష్ట్రపతిగా ఎన్నిక అయిన మొదటి మహిళ కూడా ప్రతిభా పాటిల్ కావడం ఎంతో గర్వకారణం. తనకై తాను జీవితంలో కొన్ని లక్ష్యాలని నిర్దేశించుకుని, వాటి సాధనలో నిరంతరం కృషిచేస్తూ, విజయ మార్గంలో నడిచిన మహిళగా ప్రతిభాపాటిల్ పేరు చరిత్రలో ఎప్పటికీ. నిలిచిపోతుంది.

© 2020 Chaitanyam Magazine. All Rights Reserved.