వేదులాన్వయు పలుకు -3

చట్టమును కొద్దిగా వంచి జనుట కద్దు

మొత్త ముల్లంఘనము జేయ ముప్పు కలుగు 

హద్దు దాటిన నేచట్ట మాదు కొనదు

వేదులాన్వయు పలుకు సమ్మోదమొలుకు 41 

ఊరకుక్కల బాధల కోర్వలేక

ఊరు విడనాడు టేమంత ఒప్పు కాదు 

దండమును బట్టి దూరము తరుము టొప్పు

వేదులాన్వయు పలుకు సమ్మోదమొలుకు 42

తనకు సంపద యుండియు ధరిని వేరె 

యొరుల సంపద చూచిన నోర్వలేని

గుణము మనసుకు శాంతి చేకూర్చ దెపుడు 

వేదులాన్వయు పలుకు సమ్మోదమొలుకు 43

తనకు లేదని బాధతో తల్లడిల్లి 

ఒరులకుందని కుందుట నుర్వి తగదు 

ఉన్న దానితో సంతుష్ఠి నొందు టొప్పు

వేదులాన్వయు పలుకు సమ్మోదమొలుకు 44

జంకు లేకుండ “కోర్టు”లో బొంకు సాక్షు

లుండ జేకూరునే న్యాయ మొకరికైన

న్యాయదేవత కనుగప్ప న్యాయమగునె! 

వేదులాన్వయు పలుకు సమ్మోదమొలుక 45

దారి తప్పయి గమ్యము చేరలేక

మనసు కట్టడి తప్పిన మనుగడందు

శాంతమును సౌఖ్యముండవు సుంతయైన 

వేదులాన్వయు పలుకు సమ్మోదమొలుకు 46 

సంఘసేవకు ధనమెల్ల సంతరించి

చిల్లి గవ్వయు కోరక సేవ జేయు 

వారి నెల్లర శ్లాఘింపవలయు నెపుడు 

వేదులాన్వయు పలుకు సమ్మోదమొలుకు 47

చెంత నుండిన విలువల చింత రాదు 

దూరముండగ కొండను దోచు నునుపు

దరికి జేరగ దోచును గరుకు నిజము 

వేదులాన్వయు పలుకు సమ్మోదమొలుక 48

ఋజువు లేకుండ నమ్మరు నిజము నెవరు 

మనసు నూహించి నమ్ముట మంచి కాదు

మంచి చెప్పిన పట్టదు మనసు కెపుడు !

వేదులాన్వయు పలుకు సమ్మోదమొలుక 49

ఒరుల తప్పులు వెదకుట నొప్పు కాదు 

తాను చేసిన పనులందు తప్పు లెరిగి

తిరిగి చేయక నుండిన బరగు మేలు 

వేదులాన్వయు పలుకు సమ్మోదమొలుకు 50

© 2020 Chaitanyam Magazine. All Rights Reserved.